Snoring: నిద్రపోయే సమయంలో చాలా మంది గురక పెడతారు. దీంతో ఇంట్లో వాళ్లకు కూడా ఇబ్బందులు వస్తాయి. గురక మానేయాలని వైద్యులను కూడా సంప్రదిస్తారు. గురక పెద్ద సమస్యగా తయారయింది. ఈ నేపథ్యంలో గురకను కంట్రోల్ చేస్తామని కొన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయి. టోపీ ధరిస్తే చాలు గురక మాయం అంటూ ప్రకటనలు ఇస్తున్నాయి. దీంతో అందులో వాస్తవమెంత? అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. ప్రస్తుతం దీనిపై పెద్ద చర్చ నడుస్తోంది. గురక పెట్టే వారితో పక్కనున్న వారికి నిద్రపట్టకుండా సమస్యలు వస్తాయి.

సిటీ మధ్యలోని ఓ చోట వేలాదిమందితో గురకను కంట్రోల్ చేసే మ్యాగ్నటిక్ టోపీ గురించి కంపెనీ యాజమాన్యం చెబుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. టోపీ గురకను ఎలా నియంత్రిస్తుందని ప్రశ్నిస్తున్నారు. స్టాప్ స్నోరిం్ పేరుతో క్యాప్ (టోపీ) విక్రయిస్తే కమీషన్ ఇస్తామని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ అధినేత సహా నలుగురిని బెంగుళూరులోని హై గ్రౌండ్స్ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. మహారాష్ట్రలోని ముంబయికి చెందిన సునీల్ జోషి, బెంగళూరుకు చెందిన షేక్ సాదిక్ అలీ అలియాస్ షేక్, యోగేష్, ప్రమోద్ గోపి అనే వ్యక్తులు ఈ దందాకు పూనుకున్నట్లు చెబుతున్నారు.
బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ సమీపంలోని వసంత్ నగర్ లో ఇటీవల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవన్ లో కంపెనీ నిర్వాహకులు ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. గురక టోపీల గురించి మార్కెట్ చేయాలని ఏజెంట్లను ప్రలోభాలకు గురిచేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇందులో ఇంకా ఎవరెవరి పాత్రలు ఉన్నాయనే దానిపై విచారణ కొనసాగిస్తున్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా పలు కోణాల్లో ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ముంబయికి చెందిన సునీల్ జోషి దీనిపై ఈ బయోటోరియం పేరుతో ఓ చైన్ లింక్ కంపెనీని స్థాపించాడు. తలపై అయస్కాంత పదార్థం ఉన్న టోపీని ధరిస్తే గురక ఆగిపోతుందని ప్రచారం చేశాడు. ఒక్కో టోపీ ధర రూ. 5 వేలుగా నిర్ణయించాడు. ఒక్కో కిట్ విక్రయిస్తే ఆకర్షణీయ కమీషన్ అందజేస్తామని నమ్మబలికాడు. దేశవ్యాప్తంగా ఈ వ్యాపారం కొనసాగించాలని భావించాడు. ఇందులో భాగంగానే పోలీసులకు చిక్కాడు. అలా తన వ్యాపారం బట్టబయలు అయింది. పోలీసుల అదుపులో ఉన్నాడు.

ఆ టోపీ ధర కేవలం రూ. 300 ఉంటుందని తేల్చారు. అందులో అయస్కాంత మూలాలేవి లేవని కనుగొన్నారు. కేవలం ప్రజలను మోసం చేసేందుకు ఇలాంటి పన్నాగం పన్నారని చెబుతున్నారు. సునీల్ జోషి ఖాతాలో రూ.38 లక్షల డబ్బును సీజ్ చేశారు. ఈ మేరకు డీసీపీ శ్రీనివాస్ గౌడ్ ఈ కుట్రలను చేధించారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వారిని రిమాండ్ కు పంపనున్నారు. ఇలాంటి మోసాలకు ఎవరు కూడా గురికాకుండా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.