IT Layoffs 2022: ఐదు అంకెల జీతం.. ప్రతివారం రెండు రోజుల సెలవు.. విలాసవంతమైన జీవితం…అడగ్గానే లోన్లు ఇచ్చే బ్యాంకులు.. ఐటీ ఉద్యోగం అంటే నిన్నా మొన్నటి దాకా ఇలానే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. ఉద్యోగం ఉంటుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది.. ఎప్పుడు ఎవరికీ పింక్ స్లిప్పులు వస్తాయో అంతు పట్టకుండా ఉంది.

ఆర్థిక మాంద్యం
ఆర్థిక మాంద్యం వల్ల అమెరికా, ఇతర దేశాల్లో పరిస్థితులు నానాటికి దిగజారి పోతున్నాయి.. కొనుగోళ్ళు మందగించడంతో కంపెనీలు ఖర్చులో కోత విధిస్తున్నాయి.. మొన్నటికి మొన్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తమ ఉద్యోగం ఉంటుందా లేదా అని వారు సీఈఓ ను అడిగితే.. రేపటి గురించి చెప్పడం కష్టం అని సమాధానం ఇచ్చారు.. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు మార్కెట్ ఎంత అపసవ్యదిశలో కొనసాగుతోందో.. అంతటి గూగుల్ కే ఆ పరిస్థితి వస్తే ఇక మిగతా వాటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఇది 2022లోనే మొదలు కాలేదు.. కోవిడ్ ప్రబలినప్పుడు కంపెనీలన్నీ తీవ్రంగా నష్టపోయాయి.. కొత్త ప్రాజెక్టులు రాలేదు.. ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి క్లైంట్లు మధ్యలో నే చేతులెత్తేశారు. దీనివల్ల ఆ ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. పైగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడుతున్నాయి.. ఈ రెండు దేశాల యుద్ధం మధ్యలోకి అమెరికా కూడా ప్రవేశిస్తుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఒకవేళ ఇదే నిజమైతే మార్కెట్లు మరింత కుప్పకూలే ప్రమాదం ఉంది.
లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు
ఆర్థిక మాంద్యం పేరుతో సంస్థలన్నీ పొదుపు చర్యలు పాటిస్తున్న నేపథ్యంలో ఇష్టానుసారంగా ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి.. 2008లో ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు సంస్థలు భారీగా కోతలు విధించాయి.. కానీ అప్పటితో పోలిస్తే ఇప్పుడు లే ఆఫ్ శాతం కనివిని ఎరుగని స్థాయిలో పెరిగింది.. బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం 2018 నుంచి 2022 వరకు అమెరికా, ఇండియా వంటి దేశాల్లో సుమారు 30 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని సమాచారం. గతంలో కొనసాగిన పింక్ స్లిప్ సంస్కృతి ఇప్పుడు కూడా ప్రారంభమైంది.. ఆపిల్, ట్విట్టర్, మెటా, గూగుల్ వంటి సంస్థలు వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. అమెజాన్ అయితే భవిష్యత్తు ప్రాజెక్టుల జోలికి అసలు పోవడం లేదు.. ఉన్న వాటిని కూడా మూసేస్తోంది.. ఇక ఆపిల్ కూడా అదే దారిలో ఉంది. ట్విట్టర్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.. ఇక మధ్య, చిన్న తరహా కంపెనీలు అయితే ఉద్యోగులకు నేరుగా పింక్ స్లిప్పులు ఇస్తున్నాయి.. సీనియర్ ఉద్యోగులతే సెటిల్మెంట్ చేసుకోమని సలహా ఇస్తున్నాయి. 2022 మాత్రమే కాదు. 2023 లోనూ పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుందని ఐటి వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్లు రికవరీ అయితే తప్ప కొత్త నియామకాలు చేపట్టలేమని చేతులు ఎత్తేస్తున్నాయి.

నరకం చూస్తున్నారు
ఐటీ ఉద్యోగం ఉందని చాలామంది గృహాలు, కార్లు, స్థిరాస్తి వెంచర్లలో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. వీటికి ప్రతినెలా వారు ఈఎంఐ చెల్లిస్తుంటారు.. అయితే ఇప్పుడు మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడటంతో ఉద్యోగులు క్షణం క్షణం భయం భయంగా గడుపుతున్నారు. ఎప్పుడు ఎవరికీ పింక్ స్లిప్ వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమందికి కంపెనీలు ఉద్వాసన పలకడంతో… వారు తమ కొనుగోలు చేసిన ఆస్తులను నిలువునా అమ్ముకుంటున్నారు. కోవిడ్ సమయంలో ఉద్యోగులను బతిమాలి మరి పని చేయించుకున్న సంస్థలు… ఇప్పుడు మెడ పట్టి బయటకు గెంటేస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.