
India Vs Australia: నాలుగు టెస్టుల బోర్డర్, గవాస్కర్ ట్రోఫీ ముగిసింది. టీమిండియా 2_1 తేడాతో సిరీస్ గెలుచుకుంది. వరుసగా నాలుగో సారి ట్రోఫీని తన దగ్గర పెట్టుకుంది. అంతేకాదు కంగారులతో డబ్ల్యూటీసి ఫైనల్ ఆడనుంది. ప్రస్తుతం టెస్ట్ సిరీస్ విజయంతో సంబరాలు చేసుకుంటున్న టీమిండియా.. మరికొద్ది రోజుల్లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడబోతోంది. మార్చి 17 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కాగా.. ఆస్ట్రేలియాతో భారత్ మూడు వన్డే మ్యాచ్లు ఆడుతుంది. ముంబాయి, విశాఖపట్నం, చెన్నై ప్రాంతాలలో ఈ మ్యాచ్లు జరుగుతాయి. ఈ సిరీస్ ను భారత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. వన్డే వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియా తో సిరీస్ నెగ్గి ఆత్మవిశ్వాసంతో వరల్డ్ కప్ బరిలోకి దిగాలని యోచిస్తున్నది.
ఇప్పటికే ఈ సిరీస్ కు సంబంధించి భారత జట్టును ఎంపిక చేశారు. వెన్నెముక నొప్పి కారణంగా అహ్మదాబాద్ టెస్టుకు దూరమైన శ్రేయాస్ అయ్యర్ స్థానంలో సంజు శాంసన్ ఎంపికయ్యే అవకాశం కల్పిస్తోంది. ఇక డబుల్ సెంచరీ సాధించిన గిల్, ఇషాన్ కిషన్ ఈ సిరీస్ లో చోటు సంపాదించుకున్నారు. గిల్ ఇటీవల నాలుగో టెస్ట్ లో సెంచరీ సాధించాడు. మరోవైపు కిషన్ బంగ్లాదేశ్ తో డబుల్ సెంచరీ తర్వాత ఆ స్థాయి ఇన్నింగ్స్ ఆడలేదు. ఇప్పుడు ఈ మూడు వన్డేల సిరీస్ లో తనను తాను నిరూపించుకుంటే భవిష్యత్తులో అవకాశాలు వస్తాయి. లేకుంటే అంతే సంగతులు. మరో వైపు హైదరాబాద్ సంచలనం సిరాజ్ కు కూడా ఈ సీరీస్ లో అవకాశం ఇచ్చారు.
తన తల్లి మరణంతో జట్టుకు దూరమైన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఈ సిరీస్ లో ఆడేది కూడా అనుమానంగా కనిపిస్తోంది. ఇక వ్యక్తిగత కారణాలవల్ల రోహిత్ శర్మ తొలి వన్డే ఆడటం లేదు. దీంతో భారత జట్టుకు తొలి వన్డేలో హార్దిక్ పాండ్యా సారథ్యం వహించనున్నాడు. ఇక ఆస్ట్రేలియా జట్టుకు మరోసారి స్మిత్ కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. టీమిండియా ప్లే 11 బలంగా కనిపిస్తుండడంతో ఆస్ట్రేలియా కూడా జట్టుకూర్పులో మార్పులు చేసే అవకాశం ఉంది.
షెడ్యూల్
మార్చ్ 17, మొదటి వన్డే, ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. రెండో వన్డే మార్చి 19న విశాఖపట్నంలోని వైఎస్ఆర్ స్టేడియంలో జరుగుతుంది. మార్చి 22న మూడో వన్డే చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగుతుంది.
జట్ల అంచనా ఇలా
టీమిండియా
హార్దిక్ పాండ్యా (తొలి వన్డేకు మాత్రమే కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్.
ఆస్ట్రేలియా
స్మిత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, హెడ్, క్యారీ( వికెట్ కీపర్), లబూ షేన్, మార్ష్, మాక్స్ వెల్, గ్రీన్, స్టోయినిస్, స్టార్క్, జంపా.