Financial Lessons: ధనం మూలం ఇదం జగత్.. “డబ్బు చుట్టూ, డబ్బు వల్ల, డబ్బు కోసం ” వీటి చుట్టే ప్రపంచం పరిభ్రమిస్తోంది.. అవసరాలు, అవకాశాలు, అసరా.. ఇంకా ఎన్నో ఈ డబ్బు చుట్టే ముడిపడి ఉన్నాయి. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలు బాగుండాలని డబ్బు సంపాదిస్తూ ఉంటారు. గతంలో మాదిరి ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు కాబట్టి.. మీ పిల్లలకి టీనేజ్ వయసులో ఉన్నప్పుడే ఈ ఆర్థిక పాఠాలు చెబితే భవిష్యత్తులో వారు ఇబ్బంది పడరు. మొక్కగా ఉన్నప్పుడు వంచితేనే నిటారయిన మానుగా ఎదుగుతుంది. అలాగే పిల్లలు యుక్త వయసులో ఉన్నప్పుడే ఆర్థిక పాఠాలు చెబితే వారికి డబ్బు విలువ తెలిసి వస్తుంది.

బలమైన పునాది వేయాలి
తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల ఉన్నతిని కోరుకుంటారు. చిన్నతనం నుంచే బలమైన పునాది వేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.. ఈ క్రమంలోనే తమకు వీలున్నంతలో అత్యుత్తమమైన వాటిని పిల్లలకు అందించేందుకు ప్రయత్నిస్తూనే బాధ్యత, క్రమశిక్షణ వంటి కొన్ని మంచి లక్షణాలు పెంపొందేలా చర్యలు తీసుకుంటారు.. ఇవి వారిని విజయం వైపు నడిపించడంలో తోడ్పడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అదే సమయంలో పిల్లల భవిష్యత్తు బంగారుమయం కావడానికి తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వాల్సిన మరో ముఖ్యమైన బహుమతి ఆర్థిక అక్షరాస్యత. సాధారణంగా మన కుటుంబాల్లో డబ్బులు లెక్కించే ముందుగానే, డబ్బు గురించి ఏదైనా చర్చ వచ్చినప్పుడు గానీ పిల్లల ప్రమేయం లేకుండా పెద్దలు జాగ్రత్త పడతారు. కానీ ఈ ధోరణి భవిష్యత్తులో సమస్యలకు దారి తీయవచ్చు.. డబ్బు విషయంలో జాగ్రత్త, బాధ్యత, క్రమశిక్షణ ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి.. చిన్న వయసులో ఆర్థిక నిర్వహణకు బీజం వేయడం వల్ల పిల్లలు వాస్తవ ప్రపంచాన్ని, పరిస్థితులను అర్థం చేసుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లగలుగుతారు.
ఈ ఆర్థిక పాఠాలు చెప్పాల్సిందే
డబ్బులు ఊరికే ఎవ్వరూ ఇవ్వరు. కష్టానికి ప్రతిఫలంగా మాత్రమే లభిస్తుంది. ఈ వాస్తవాన్ని తల్లిదండ్రులు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఇక కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు అడిగింది వెంటనే చేస్తారు. దీనివల్ల పిల్లల్లో విచ్చలవిడితనం, వ్యసనాలు పెరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. అందుకే వారికి డబ్బు విలువ చెప్పాలి. అనవసర వస్తువులను కొనుగోలు చేయడం వల్ల శ్రమ, డబ్బు వృధా అవుతాయని హెచ్చరించాలి. వస్తువు కూడా ఉచితంగా రాదని పిల్లలను త్వరగానే అర్థం చేసుకుంటారు. ఈ విషయం వారికి అర్థమైన తర్వాత అవసరానికి, కోరికలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించాలి.. అప్పుడు ఏ ఖర్చులకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాలో వారికి అర్థమవుతుంది. పిల్లలకు పొదుపు నేర్పించేందుకు పిగ్గీ బ్యాంకు కొనవచ్చు. అప్పుడప్పుడు పెద్దలు ఇచ్చే డబ్బును అందులో దాచుకోమని చెప్పండి. స్నేహితులు బహుమతిగా ఇచ్చిన డబ్బును కూడా దాచుకోమని చెప్పండి. కావలసిన మొత్తం పూర్తయిన తర్వాత ఇష్టమైన వస్తువును కొనుగోలు చేయవచ్చని చెప్పండి.

ఇది పిల్లల్లో పొదుపు అలవాట్లు పెంచుతుంది. పెద్దయ్యాక దుబారా ఖర్చులు చేసే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఇలా పొదుపు చేసేందుకు పిగ్గీ బ్యాంకుకు బదులు పొదుపు ఖాతాలను తెరవ వచ్చు. ప్రస్తుతం చాలా బ్యాంకులు పిల్లలకు పొదుపు ఖాతాలను అందిస్తున్నాయి. వీటన్నిటి కంటే ముఖ్యంగా డబ్బు విలువ ఎలాంటి హెచ్చుతగ్గులకు గురవుతుందో పిల్లలకు అర్థమయ్యేలా చెప్పండి. ఉదాహరణకి మీ చిన్నతనంలో పెన్ను రూపాయికే వచ్చేది.. ఇప్పుడు అది పది రూపాయలు అయింది. వస్తువు అప్పుడు ఎలా ఉందో… ఇప్పుడు కూడా అదే పరిమాణంలో ఉంది.. కాకపోతే ప్రపంచంలో ఏర్పడిన మార్పుల వల్ల కరెన్సీ విలువలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయని అర్థమయ్యేలా చెప్పండి. అప్పుడే వారు మార్పులను అంగీకరిస్తారు.