T20 World Cup- India vs South Africa: టి20 ప్రపంచ కప్ లో భారత జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే పెర్త్ వేదికగా దక్షిణాఫ్రికాతో మరో మ్యాచ్ కు సిద్ధమైంది. పాకిస్తాన్ పై థ్రిల్లింగ్ విజయాన్ని అందుకున్న రోహిత్ సేన… అదే ఊపులో నెదర్లాండ్స్ జట్టు చిత్తు చేసింది. ఆదివారం సౌతాఫ్రికా తో అమీతుమి తేల్చుకోనుంది. కోహ్లీ, సూర్య కుమార్, రోహిత్, హార్దిక్ సూపర్ ఫామ్ లో ఉండటం.. బౌలర్లు మెరుగ్గా బౌలింగ్ చేస్తుండటం భారత జట్టుకు కలిసి వచ్చే అంశాలు. కానీ ఇంకా మూడు అంశాల్లో టీం ఇండియా మెరుగు పడాల్సి ఉంది.

ఓపెనింగ్ ఇబ్బంది
టీ 20 మెన్స్ వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో భారత్ ను ఓపెనింగ్ సమస్య ఇబ్బంది పెడుతోంది. పాక్, నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ ల్లో భారత్ కు శుభారంభం దక్క లేదు. పాక్ తో జరిగిన మ్యాచ్ లో మొదటి వికెట్ కు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఏడు పరుగులు జోడించారు. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో తొలి వికెట్ కు 11 పరుగులు మాత్రమే చేశారు.. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ రాణించినప్పటికీ… రాహుల్ పూర్తిగా విఫలమయ్యాడు. ఇద్దరు మంచి శుభారంభం అందించాల్సిన అవసరం ఉంది. వీరిద్దరూ మెరుగ్గా బ్యాటింగ్ చేస్తే మిగతా వారిపై ఒత్తిడి తగ్గుతుంది.
పవర్ ప్లే
ప్రస్తుత క్రికెట్లో భారత్ జట్టుకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఆస్ట్రేలియా మొదలు న్యూజిలాండ్ వరకు ఎంతటి కఠినమైన బౌలింగ్ అయిన సమర్థవంతంగా ఎదుర్కొంటుందని పేరు కూడా ఉంది . అయితే టి20 ప్రపంచ కప్ లో ఇప్పటివరకు ఆయన మ్యాచుల్లో పవర్ ప్లే లో భారత్ కనీసం 6 రన్ రేటుతో కూడా పరుగులు చేయలేకపోతోంది. ముఖ్యంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో తొలి ఆరు ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 31 పరుగులు మాత్రమే చేసింది.. ఇక నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ భారత్ పవర్ ప్లేలో తడబడింది. ఆరు ఓవర్లలో కేవలం 32 పరుగులు మాత్రమే చేసింది. ఒక వికెట్ను కూడా కోల్పోయింది.
డెత్ ఓవర్ల సమస్య
ఇది ఈ ఏడాది జరిగిన ఆసియా కప్ నుంచి భారత జట్టును ఇబ్బంది పెడుతూ వస్తోంది. పాకిస్తాన్, నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ ల్లోనూ ఈ బౌలింగ్ డొల్లతనం బయటపడింది.. ఆఖరి 5 ఓవర్లలో మరియు ముఖ్యంగా 19వ ఓవర్ లో భారత బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు.
అప్పుడప్పుడో 2007లో టి20 మొదలైన తొలి సంవత్సరంలో భారత్ జట్టు ధోని సారథ్యంలో కప్ సాధించింది. ఇప్పటివరకు మరోసారి కూడా టి20 కప్ దక్కించుకోలేదు. 15 సంవత్సరాల నిరీక్షణకు తెరదించి ఛాంపియన్ గా అనిపించుకోవాలంటే టీం ఇండియా ప్రతి విభాగంలోనూ అద్భుతమైన ప్రదర్శన చూపాల్సి ఉంటుంది.. ఆఖరి బంతికి ఓడినా అది ఓటమి కిందికే వస్తుంది.. టోర్నీ జరిగే కొద్దీ భారత్ లాగే ఇతర జట్లు కూడా తమ సమస్యలను అధిగమించి టైటిల్ కోసం పోటీ పడతాయి. ఇటువంటి పరిస్థితుల్లో చిన్న తప్పు కూడా ఓటమికి కారణం అవుతుంది.

బౌలింగే దక్షిణాఫ్రికా బలం
రబడా, పార్నెల్, బవుమా వంటి వారితో దక్షిణాఫ్రికా బౌలింగ్ చాలా బలంగా ఉంది. డెత్ ఓవర్లలో చాకచక్యంగా బౌలింగ్ వేయడం వీరి ప్రత్యేకత. ఇటీవల భారత్ తో జరిగిన టి20 సిరీస్ లో దక్షిణాఫ్రికా బౌలర్లు మెరుగ్గా రాణించారు.. ఆస్ట్రేలియా పిచ్ లు, దక్షిణాఫ్రికా తో పోలి ఉంటాయి గనుక.. సౌత్ ఆఫ్రికా బౌలర్లు మెరుగ్గా బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పార్నల్ లాంటి బౌలర్ బౌన్సీ పిచ్ ల పై అద్భుతంగా బౌలింగ్ చేయగలడు.. ఈ బౌలర్లను ఎదుర్కొనే దానినిబట్టే భారత జట్టు అవకాశాలు ముడిపడి ఉన్నాయి. ఆదివారం జరిగే మ్యాచ్లో తమ బౌలర్లకు విరాట్ కోహ్లీ కి మధ్య పోటీ ఉంటుందని దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ అడెమ్ మార్కరమ్ వ్యాఖ్యానించాడు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ పెర్త్ పిచ్ పై దక్షిణాఫ్రికా బౌలర్లకు మంచి రికార్డు ఉంది.. ఇది బౌన్సీ పిచ్ కావడంతో సీమర్లకు ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉంటుంది. అయితే మైదానంపై ఉన్న తేమను సద్వినియోగం చేసుకునే బౌలర్లకు మాత్రమే వికెట్లు దక్కే అవకాశం ఉందని క్యూరేటర్ అంటున్నారు. అయితే తిరు జట్లను పోల్చి చూసినప్పుడు భారతే కొంచెం మెరుగ్గా కనిపిస్తుంది. అలాగని దక్షిణాఫ్రికాను అంత తక్కువ అంచనా వేయకూడదు.. అలా తక్కువ అంచనా వేసి జింబాబ్వే చేతిలో పాకిస్తాన్ ఎలా భంగపడిందో చూశాం కదా!