T20 World Cup 2022- Pakistan vs South Africa: నిన్న భారత జట్టును ఆదుకున్న వరుణుడు.. ఇవాళ పాకిస్తాన్ పై కరుణ చూపాడు. భారత్, జింబాబ్వే చేతిలో ఓటమి తర్వాత పాక్ జట్టుపై ఇంటా, బయట విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా చేతిలో భారత జట్టు ఓడిపోవడంతో పాకిస్తాన్ సెమీస్ ఆశలు మరింత సంక్లిష్టమయ్యాయి. అయితే సెమీస్ రేసులో నిలవాలి అంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. ప్రోటీస్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు మాత్రమే చేసింది. విజయంతో పాకిస్తాన్ జట్టు సెమిస్ రేసులోకి వచ్చింది. ఫలితంగా గ్రూప్ వన్ సెమిస్ రేసు ఆసక్తికరంగా మారింది. రాబోయే మ్యాచ్ లకు వర్షం ముప్పు పొంచి ఉండటమే ఇందుకు కారణం.

ఆరంభం లభించలేదు
టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ జట్టుకు ఆశించిన ఆనందం లభించలేదు. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి 43 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. బాబర్ (6), రిజ్వాన్(4), మహమ్మద్ హ్యారీస్(28), షాన్ మసూద్ (2) …ఇలా కీలకమైన నలుగురు బ్యాట్స్మెన్ స్వల్ప స్కోర్ కే పెవిలియన్ చేరారు. అయితే మిడిల్ ఆర్డర్లో ఇఫ్తికర్ అహ్మద్(51), షాదాబ్ ఖాన్(52) హాఫ్ సెంచరీలతో రాణించడంతో నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో నోర్జే 4, పార్నెల్, రబడా, ఎంగిడి, శంశీ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 186 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు మొదట్లోనే తడబడ్డారు.. సూపర్ ఫామ్ లో ఉన్న బ్యాటర్ పీకాక్ గోల్డెన్ డక్ అవుట్ గా వెనుతిరిగాడు.. ఆ జట్టు స్కోరు 9 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి 69 పరుగులుగా ఉన్నప్పుడు వర్షం అంతరాయం కలిగించింది. కొద్దిసేపటికి వర్షం తగు ముఖం పట్టింది.

డక్ వర్త్ లూయిస్ ప్రకారం దక్షిణాఫ్రికా లీడ్ లో ఉండడంతో లక్ష్యాన్ని 14 ఓవర్లకు 142 పరుగులుగా ఎంపైర్లు నిర్ణయించారు. అయితే దీనిని చేదించలేకపోయిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు 14 ఓవర్లకు 108 పరుగులకు మాత్రమే పరిమితం అయిపోయారు. ఇక పాకిస్తాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది మూడు వికెట్లు తీశాడు. షాదాబ్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు.. ఇక ఈ విజయంతో పాకిస్తాన్ నాలుగు పాయింట్లు మూడో స్థానానికి చేరుకుంది. అదే సమయంలో సెమిస్ రేసులోనూ నిలిచింది. అయితే భారత్, జింబాబ్వే చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ సెమీస్ కు చేరుతుందా లేదా అనేది ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంది. గ్రూప్ వన్ జాబితాలో భారత్, దక్షిణాఫ్రికా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ ఆదివారం భారత జట్టు జింబాబ్వే ను ఢీకొడుతుంది. ఈ విజయం లాంచనమే అయినప్పటికీ.. అంత ఈజీగా తీసుకోబోమని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అంటున్నాడు. ఇటీవల జింబాబ్వే టూర్ కు భారత్ వెళ్ళినప్పుడు అక్కడ వన్డే సిరీస్ ని వైట్ వాష్ చేసింది.