
Sunrisers Hyderabad: ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 క్రికెట్ లీగ్ ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్). క్రికెట్ అభిమానులు ఈ ఐపీఎల్ పండగ కోసం ఎదురుచూస్తుంటారు. 16వ ఎడిషన్ పోటీలు రెండు నెలల్లో మొదలుకానున్నాయి. దీనికి సబంధించి గతేడాది చివరిలో వేలం పూర్తయింది. అన్ని ఫ్రాంచైజీలు స్క్వాడ్‌లను ఖరారు చేసుకున్నాయి. కొన్ని జట్లు తమ కెప్టెన్‌ను ఇంకా ప్రకటించలేదు. ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌లను నియమించాల్సి ఉంది.
ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్‌పై ఆసక్తి..
సన్‌రైజర్స్ హైదరాబాద్ 2016లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. ఆ జరిగిన టోర్నీల్లో పెద్దగా పెర్ఫార్మ్ చేయలేకపోతోంది. 2016లో టీం కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ వ్యవరించాడు. ఏడేళ్లుగా లీగ్ దశలోనే పోరాటం ముగిస్తున్న ఎస్‌ఆర్‌హెచ్ ఈసారైనా మళ్లీ టైటిల్ గెలవాలని తెలుగు క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. జట్టును విజయపథంలో నడిపించే నాయకుడు ఎవరా.. యాజమాన్యం ఎవరిని నియమిస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఫస్ట్ ఆప్షన్ భువీ..
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ రేసులో మొదటి వరుసలో భువనేశ్వర్ కుమార్ ఉన్నట్లు సమాచారం. భువీకి గతంలో అనేక సందర్భాల్లో జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం ఉంది. అందుకే మేనేజ్మెంట్ మొదటి ఫస్ట్ ఆప్షన్ భువీకి ఇస్తున్నట్లు సమాచారం. భువీతోపాటు రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్‌క్రమ్ వంటి ఆటగాళ్లు కూడా కెప్టెన్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. త్రిపాఠికి పెద్దగా కెప్టెన్సీ అనుభవం లేకపోయినా, అగర్వాల్ గతంలో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు.
మార్‌క్రామ్ మంచి ఆప్షన్..
కెప్టెన్సీ రేసులో ఐదారుగురు ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికాకు చెందిన ఐడెన్ మార్‌క్రామ్ మంచి ఆప్షన్ అని ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు భావిస్తున్నారు. మార్‌క్రామ్‌కు కెప్టెన్‌గా అనుభవం ఉంది. అంతే కాకుండా 2014లో దక్షిణాఫ్రికాకు అండర్–19 వరల్డ్‌కప్ అందించాడు. ఈ టోర్నీలో అద్భుతమైన కెప్టెన్సీతోపాటు విలువైన పరుగులు చేశాడు. ఆరు మ్యాచ్‌లలో 370 పరుగులు చేశాడు. ప్రారంభ టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు కూడా టైటిల్ అందించాడు. గాయపడిన ఫాఫ్ డుప్లెసిస్‌ను భర్తీ చేస్తూ మార్‌క్రామ్ గతంలో దక్షిణాఫ్రికా సీనియర్ జట్టుకు కూడా నాయకత్వం వహించాడు. గ్రేమ్ స్మిత్ ఓ సందర్భంలో.. మార్‌క్రామ్‌ను భవిష్యత్తు దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా అభివర్ణించాడు. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ తరఫున మార్‌క్రమ్ బ్యాట్‌తో మెరిశాడు. జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో సంచలన సెంచరీని కొట్టాడు. చాలా కాలంగా మార్‌క్రమ్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. అవసరమైనప్పుడు బౌలింగ్ కూడా చేయగలడు.

ఫుల్ ఎనర్జీ..
మార్‌క్రామ్ ప్రతిభపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. అతను ఇప్పుడు మూడు ఫార్మాట్‌లలో దక్షిణాఫ్రికా జట్టులో కీలక ఆటగాడు. ఐపీఎల్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ20 లీగ్‌లలో ఆడిన అనుభవం ఉంది. దీంతో డిసెంబర్‌లో నిర్వహించిన ఐపీఎల్ వేలంలో ఎస్‌ఆర్‌హెచ్ అతనిని కొనసాగించింది. యంగ్‌స్టర్ కావడంతో దీర్ఘకాలంగా జట్టుకు సేవలు అందించే అవకాశం ఉంది. అందుకే ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు కూడా మార్‌క్రామ్ కెప్టెన్ కావాలని కోరుకుంటున్నారు.