Homeబిజినెస్Waayu Food Delivery App: స్విగ్గి, జొమాటో ఆయువు పట్టుపై "వాయు" దెబ్బ

Waayu Food Delivery App: స్విగ్గి, జొమాటో ఆయువు పట్టుపై “వాయు” దెబ్బ

Waayu Food Delivery App: క్షణంలో కోరుకున్న ఆహారాన్ని ఇంటికి తెచ్చి ఇచ్చే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గి, జొమాటో మనదేశంలో ఎంతగా ప్రాచుర్యం పొందాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.. అంతటి కోవిడ్ కాలంలో కూడా ఈ ఫుడ్ డెలివరీ సంస్థలు విస్తృతంగా ఆహారాన్ని సరఫరా చేశాయి. మొన్నటికి మొన్న రంజాన్ లో రికార్డు స్థాయిలో బిర్యానీలు, హలీం వంటి పదార్థాలను వినియోగదారుల చెంతకు చేర్చి ఔరా అనిపించాయి. అలాంటి ఈ సంస్థలు కేవలం మెట్రో నగరాలకు మాత్రమే కాకుండా మధ్య స్థాయి పట్టణాలకు కూడా తమ సేవలను విస్తరించాయి. ఆన్ లైన్ లో ఫుడ్ వ్యాపారాన్ని దాదాపుగా ఈ సంస్థలు ఆక్రమించాయి. అలాంటి ఈ దిగ్గజాలకు ఇప్పుడు కోలుకోలేని షాక్ తగిలింది.

తక్కువ ధరలో..

ఇప్పటికే ప్రభుత్వానికి చెందిన , తక్కువ ధరల ఫుడ్ డెలివరీ యాప్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ( ఓఎన్డీపీ) యూజర్ల ఆదరణతో దూసుకుపోతోంది. తాజాగా దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఫుడ్ డెలివరీ యాప్ ఎంట్రీ ఇచ్చింది. ఫుడ్ డెలివరీ కోసం దేశ ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబై హోటల్స్ తమ సొంత ఆన్లైన్ ఫ్లాట్ఫారం లాంచ్ చేశాయి. దీనిని “వాయు” పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చాయి. బాలీవుడ్ నటుడు, వ్యాపారవేత్త సునీల్ శెట్టి ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ఈ యాప్ లో అతడికి కూడా వాటా ఉంది. అంతేకాదు ఓఎన్డీసీ తో ఇంటిగ్రేట్ చేయాలని కూడా చూస్తోంది. ఆన్ లైన్ ఫుడ్ వ్యాపారానికి డిమాండ్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వాయు యాప్ మార్కెట్లోకి వచ్చింది. పోలిస్తే ఇతర పోటీ సంస్థలతో పోలిస్తే 15 నుంచి 20% తక్కువ కు ఆహారాన్ని సరఫరా చేస్తున్నట్టు ఆ కంపెనీ చెబుతోంది.. తమ నిర్ణయం వల్ల కమీషన్లు, ఫేక్ ర్యాంకింగ్, పెయిడ్ రివ్యూలు, నాణ్యత లేకపోవడం లాంటి సమస్యలకు చెక్ పడుతుందని ఆ కంపెనీ అంచనా వేస్తోంది.

టెక్ ఫౌండర్స్ ఆధ్వర్యంలో..

అనిరుధ్ కోటిగిరే, మందార్ లాండే స్థాపించిన “డెస్టెక్ హోరికా” ప్రొడక్ట్స్ లో ” వాయు” యాప్ కూడా ఒకటి. ముంబై నగరానికి చెందిన ఇండియన్ హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్, ఇతర సంస్థల ప్రోత్సాహంతో ఇది మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. సాఫ్ట్వేర్ యూజ్ ఏ సర్వీస్ అనే ప్లాట్ ఫారం ద్వారా భగత్ తారాచంద్, మహేష్ లంచ్ హోమ్, బనానా లీఫ్, శివ సాగర్, గురుకృప, కీర్తి మహల్, పర్షియన్ దర్బార్, లడు సామ్రాట్ తో పాటు ఇతర ముంబై రెస్టారెంట్ లతో ఆహార ప్రియులను అనుసంధానం చేస్తుంది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో రెస్టారెంట్ల నుంచి ఎటువంటి కమిషన్ వసూలు చేయదు.

నెలకు 1000

అయితే అవుట్ లెట్ కు మాత్రం నెలకు 1000 ప్రారంభ ధరలతో నిర్ణీత రుసుము వసూలు చేస్తుంది. తర్వాత దీనిని రెండు వేలుగా నిర్ణయిస్తుంది. ఈ వాయు యాప్ లో ప్రస్తుతం వెయ్యికి పైగా రెస్టారెంట్ లిస్టింగులు ఉన్నాయి.. ముంబై, పూణే నగరాల్లో వచ్చే మూడు నెలల్లో ఇది 10,000 కు పెరుగుతుంది. ప్రస్తుతం ముంబైలో అందుబాటులో ఉన్న ఈ సర్వీస్ ఇతర మెట్రో, నాన్ మెట్రో నగరాలకు విస్తరించే అవకాశం ఉంది. ఈ యాప్ ద్వారా తక్కువ ధరకే ఫుడ్ డెలివరీ చేస్తామని సంస్థ చెబుతోంది. కమిషన్ రహిత మోడల్ ద్వారా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ఇండస్ట్రీలో కొత్త మార్పులు తీసుకొస్తామని ఆనిరుద్ చెబుతున్నారు. సకాలంలో పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని వినియోగదారులకు అందించడమే తమ లక్ష్యం అని ఆయన వివరిస్తున్నారు. ఇక ఫుడ్ డెలివరీ విషయంలో ఎలాంటి ఆలస్యం ఉండదని ఆయన హామీ ఇస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular