Homeలైఫ్ స్టైల్Summer sleep problems: వేసవిలో రాత్రి నిద్రపట్టడం లేదా? ముందు ఇలా చేయండి..

Summer sleep problems: వేసవిలో రాత్రి నిద్రపట్టడం లేదా? ముందు ఇలా చేయండి..

Summer sleep problems: ప్రస్తుతం వేసవి కాలం. వాతావరణం వేడెక్కుతూ ఉంటుంది. దీంతో శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి. ఎండవేడికి తట్టుకోలేక శరీరం తీవ్రంగా అలసిపోతుంది. అయితే అలసని శరీరానికి అవసరమైన ఆహారంతో పాటు సరైన నిద్రను కూడా ఇవ్వాలి. కానీ వేసవిలో రాత్రిపూట నిద్రపోవడం చాలామందికి పెద్ద సమస్యగా మారుతుంది. అధిక ఉష్ణోగ్రత, గాలి లేమి, శరీర వేడి కారణంగా నిద్ర మెలకువగా మారుతుంది. అయితే కొన్ని చిన్న జాగ్రత్తలు పాటిస్తే రాత్రి చల్లగా, ప్రశాంతంగా నిద్రపోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రశాంతమైన నిద్ర ఆరోగ్యాన్ని ఇస్తుంది. కలత నిద్ర వల్ల మానసిక, శారీరకంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇందులో కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. వేసవిలో రాత్రి బాగా నిద్రపట్టాలంటే గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరంపై ఉన్న వేడి తగ్గుతుంది. మొదట వేడి అనిపించినా, కొద్దిసేపటికి శరీర ఉష్ణోగ్రత సహజంగా తగ్గి నిద్రకు అనుకూలంగా మారుతుంది. రాత్రి టైట్ దుస్తులు వేసుకుంటే చెమట ఎక్కువై అసౌకర్యం కలుగుతుంది. కాటన్ దుస్తులు చెమటను పీల్చుకుని శరీరానికి గాలి అందేలా చేస్తాయి. అందుకే వదులుగా ఉండే పలుచని కాటన్ నైట్ డ్రెస్సులు ఉత్తమం.

కొంత మంది అవగాహన లేకుండా బెడ్ పై సింథటిక్ బెడ్ షీట్స్ ను వేస్తుంటారు. కానీ ఇవి వేడిని ఎక్కువగా నిల్వ చేస్తాయి. కాటన్ బెడ్ షీట్స్ మాత్రం గాలి ఆడేలా చేసి శరీరానికి చల్లదనం ఇస్తాయి. వేసవిలో తెలుపు లేదా లైట్ కలర్ బెడ్ షీట్స్ వాడటం మరింత మంచిది. రాత్రి భోజనంలో మసాలాలు ఎక్కువగా ఉంటే శరీరంలో వేడి పెరిగి జీర్ణక్రియ కూడా భారంగా మారుతుంది. అందుకే రాత్రి తేలికగా జీర్ణమయ్యే ఆహారంలో భాగంగా అన్నం, పెరుగు, కూరగాయలు, పప్పు వంటి వాటిని తీసుకోవాలి.

పడుకునే గంట ముందు ఒక గ్లాస్ మజ్జిగ లేదా గోరువెచ్చని పాలు తాగితే శరీరానికి ఉపశమనం లభిస్తుంది. మజ్జిగ శరీరాన్ని చల్లబరుస్తే, పాలు నిద్రను మెరుగుపరుస్తాయి. టీ, కాఫీలో ఉండే కాఫిన్ నిద్రను దూరం చేస్తుంది. సాయంత్రం తర్వాత వీటిని తీసుకుంటే రాత్రి నిద్ర ఆలస్యమవుతుంది. అధికంగా నీరు తాగితే రాత్రి మధ్యలో పలుమార్లు లేచి బాత్రూమ్‌కు వెళ్లాల్సి వస్తుంది. దీని వల్ల నిద్ర మధ్యలో భంగం కలుగుతుంది.

గది గాలి సరిగా ఉండాలి. కిటికీలు తెరిచి గాలి ఆడేలా చూడాలి. అవసరమైతే ఫ్యాన్, కూలర్‌ను సరిగ్గా ఉపయోగించాలి. వేసవిలో నిద్ర నాణ్యత తగ్గితే శరీర అలసట, చిరాకు, పనితీరు తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే రాత్రి పడుకునే ముందు శరీరాన్ని చల్లబరచే అలవాట్లు చేసుకోవడం చాలా అవసరం

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version