
Sri Rama Navami 2023: భారతీయులకు భారత, రామాయణ, భాగవతాలు శిరోధార్యాలు. వీటిలోని భారతం సంఘాన్ని సంస్కరించేది. భాగవతం ఆత్మ జ్ఞానాన్ని అందించేది. రామాయణం వ్యక్తిని సంస్కరించే కథ. ఎటువంటి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోని రామచంద్రుని వ్యక్తిత్వం ఆచరణీయమైనది. వినయవంతుడైన తనయుడిగా, పర్రాకమవంతుడిగా, ఆశ్రితుల పట్ల వాత్సల్య మూర్తిగా, ప్రేమ మూర్తియైున భర్తగా, బాధ్యత గల సోదరుడిగా ఆదర్శ ప్రభువుగా, వినయశీల వ్యక్తిత్వాన్ని ప్రకటించిన శ్రీరామచంద్రుని గుణగణాలు ఎందరికో ఆదర్శం. ఆరాధ్యం. ప్రతాపానికి, ప్రసన్నతకి, వీరత్వానికి, వినయానికి, ధర్మం పట్ల ఆదరణకి, ఆధర్మం పట్ల ఆగ్రహానికి సామర్ధ్యానికి, సంయమనానికి నిలువెత్తు తార్కాణం రామచంద్రుడు.
రామచంద్రుడిలో అద్భుతమైన ఆదర్శమైన సుగుణాలు ఉన్నాయి కాబట్టే అనేక మంది కవులకు అవి కావ్య రచనకి సామగ్రిగా మారాయి. ప్రపంచ సాహిత్యంలో వెలువడిన ఆదికావ్యం రామాయణం రాముని కథనే తెలియజేసింది. వాల్మీకి సంస్కృతంలో రామాయణాన్ని రచించాక రామకథని అనేక మంది సంస్కృతంలో మరలా రచించారు. వేద వ్యాసుడు అష్టాదశ పురాణాలలోను భాగవతం నవమస్కంధంలో, భారతం అరణ్య పర్వంలోనూ రామకథను వర్ణించారు. అటు పైన విశ్వామిత్ర రామాయణం (అధ్యాత్మిక రామాయణం), అగస్త్య రామాయణం, భరద్వాజ రామాయణం లాంటి ఆర్ష్య సంస్కృత కావ్య రామాయణాలు అసంక్యాకాలు. రఘువంశం, బట్టి కావ్యం, జానకీ హరణం, రామ చరిత్ర, సేతు బంధం, రామాయణ మంజరి, ప్రతిమా నాటకం, అభిషేక నాటకం, మహావీర చరిత్ర, ఉత్తర రామ చరితం, ఆశ్చర్య చూడామణి, అనర్ఘ రాఘవం, బాల రామాయణం, ప్రసన్న రాఘవం, హనుమన్నాటకం, కుందమాల, ఉదార్త రాఘవం, చంపు రామాయణం మొదలైన దృశ్య, శ్రవణ కావ్యాలు సంస్కృతంలో వెలుగు చూశాయి.
సంస్కృతంలో మాత్రమే కాదు
కేవలం సంస్కృతంలోనే కాక భారతీయ భాషలన్నింటిలోనూ రామకథను వర్ణించారు. అసమేయ రామాయణం, బంగ్లా రామాయణం, ఒడియా రామాయణం, నేపాలి మైథిలి, పంజాబి, కాశ్మీరి, మరాఠి, గుజరాతీ రామాయణాలు వాటికి ఉదాహరణలు. హిందీ భాషలో రామచరిత్ర మానస్ అత్యంత ప్రసిద్ధి పొందిన రామకథా కావ్యం. దక్షిణ దేశ భాషలలో కూడా అనేక రామకథా కావ్యాలు రూపొందాయి. తమిళంలో కంబ రామాయణం, మళయాళంలో తుంజత్తు ఎళుత్తచ్చన్ రామాయణం, కన్నడంలో తోరవే రామాయణం చాలా ప్రసిద్ధిమైన కావ్యాలు. తెలుగులో రామకథా కావ్యాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. వాటిలో రంగనాధ రామాయణం, నిర్వచోనత్తర, భాస్కర, మొల్ల, రఘునాథ, ఉ త్తర, కట్టా వరద రాజు, గోవింద, అచ్చ తెనుగు రామాయణ కల్పవృ క్షం, శ్రీమదాంద్ర రామాయణం మొ దలైన రామాయణాలు ప్రసిద్దమైనవి. తెలుగు వారు రామకథను అక్కున చేర్చుకున్నట్లు మరే ఇతర కథను కూడా అక్కున చేర్చుకోలేదు. అందుకే ఒక వెయ్యి సంవత్సరాల సాహిత్యంలో పై వచ్చిన గ్రంథాలు మరి ఏ గ్రంథంపైన రామకథ రాలేదు. కేవలం తెలుగులో కావ్యాలు గానే కాక, కీర్తనలుగా జానపదుల పాటలుగా యక్షగానాలుగా, హరికథలుగా, బుర్రకథలుగా, వీధి భాగవతాలుగా, ఆఖరికి ఇళ్లల్లో సామాన్య స్ర్తీలు మాట్లాడుకునే సామెతల వరకు కూడా రామకథ చేరిందంటే అది రాముడి గుణ విశేషమే.

అనేక దేశాల్లో రామాయణం..
కేవలం భారతీయులనే కాక ఇతర దేశస్థులను కూడా రామకథ ఆకర్షించింది. ‘‘బర్న్ ఆల్ ది లైబ్రరీస్ లెట్ దేర్ బీ రామాయణ‘‘ అని ఒక పాశ్చత్య కవి రామకథను చదివిన రసావేశంలో వివరించి పరవశుడైయ్యాడు. తిబ్బతి రామకథ, కోతాని రామాయణం, చేని రామకథ, మంగోలియా, జపాన్, ఇండోనేషియా, మలేషియా, కంబోడియా, థాయిల్యాండ్, లావోస్, ఫాలక్, ఫిలిప్సిన్స్, సింహళి మొదలైన దేశాలలో కూడా రామకథ ప్రాచుర్యాన్ని పొందింది. రాముడంటేఆస్తిక జనానికే కాదు నాస్తికులకు సైతం ఆదర్శమే. నాస్తికులైన బౌద్ధులు, జైనులు కూడా తమ సిద్ధాంతాలకు అనుగుణంగా రామకథను మలుచుకున్నారు. ఈ విధంగా భారతీయతపై ప్రగాఢ ముద్ర వేసిన రామకథ ఖండాంతరాలలో కూడా ఆదరించారు. రాముడి రూపం మనకు ఆరాధ్యమైంది, రామ కథ మనకు ఆదర్శమైంది, రామనామం మన నాడీ నరమైంది.