Coffee Day Enterprises: మాళవిక హెగ్డే.. ఒకప్పుడు ఈ పేరు బిజినెస్ సర్కిల్లో పెద్దగా తెలిసేది కాదు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ కూతురు అయినప్పటికీ లో ప్రొఫైల్ మైంటైన్ చేసేవారు. చివరకు తన భర్త కేఫ్ కాఫీ డే ఓనర్ అయిన సిద్దార్థ తో ఎక్కువగా కనిపించేవారు కాదు. ఇల్లు, భర్త, కుటుంబ ఫంక్షన్లు, అప్పుడప్పుడు కంపెనీకి సంబంధించిన టి. ఎస్టేట్ల సందర్శన.. ఇవే వ్యాపకాలు. ఉన్నత విద్యనే చదివినప్పటికీ సాధారణ గృహిణిగా ఉండటమే మాళవికకు ఇష్టం. నాన్న పేరు మోసిన రాజకీయ నాయకుడు అయినప్పటికీ ఆ ఛాయలకు కూడా వెళ్ళేది కాదు.

భర్త మరణంతో..
2019 సంవత్సరం జూలై నెల బహుశా బహుశా మాళవిక జీవితంలో చీకటి రోజు. కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, భర్త సిద్ధార్థ మంగళూరులోని ఒక నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్లే సిద్ధార్థ ఈ నిర్ణయం తీసుకున్నారని ఊహాగానాలు వినిపించాయి. ఆయన మరణం తర్వాత భార్య మాళవిక ఆ కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. భర్త ఆత్మహత్య. ఏ మాత్రం తెలియని వ్యాపారాలు, వేల కోట్ల అప్పు.. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో మరొక్కలైతే వ్యాపారాన్ని పూర్తిగా అమ్మేసేవాళ్ళు. కానీ చిన్నప్పటి నుంచే ఎంతో ధైర్యంతో పెరిగిన మాళవిక.. ఈ సవాళ్ళకు ఎదురు నిలిచి తన భర్త భౌతికంగా లేకున్నా మానసికంగా తనతో ఉన్నాడని భావించి వ్యాపారం లోకి దిగారు. కేఫ్ కాఫీ డే సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో అప్పుల్లో ఉన్న కంపెనీని మళ్లీ నిలబెట్టేందుకు ఆమె చాలా కృషి చేశారు. మాటలు మాత్రమే కాకుండా, చేతుల్లో చూసి చూపించారు. సీఈవో పదవి చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవడంతో కంపెనీ అప్పులను సగానికి అంటే 7200 కోట్ల నుంచి 1800 కోట్లకు తగ్గించారు. తన ఉద్యోగుల్లో విశ్వాసాన్ని నింపారు. పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చారు. కేఫ్ కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు. తన భర్త సిద్ధార్థ అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకుంటే.. మాళవిక మాత్రం కార్పొరేట్ ప్రపంచాన్ని ఎదిరించి బలంగా నిలబడ్డారు. కంపెనీని మరింత విస్తరించే పనిలో ఉన్నారు. కష్టకాలంలో కంపెనీకి అండగా ఉన్న ఉద్యోగుల్లో భరోసా కల్పించేందుకు వారి జీతభత్యాలు కూడా పెంచారు.

సిద్ధార్థ జీవితంపై సినిమా
కేఫ్ కాఫీ డే ఫౌండర్ విజి సిద్ధార్థ జీవితం ఆధారంగా త్వరలో ఒక సినిమా రూపొందనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ టి సిరీస్, ఆల్మైటీ మోషన్ పిక్చర్, కర్మ మీడియా ఎంటర్టైన్మెంట్ లు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రుక్మిణి, ప్రో సెంజిత్ దత్తా రాసిన కాఫీ కింగ్ పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించనున్నారు. సిద్ధార్థ జీవితంలో చోటు చేసుకున్న ఘటనలు, వ్యాపారంలో ఒడిదుడుకులు.. మిగతా విషయాలపై లోతైన పరిశీలనతో రాసిన పుస్తకమే కాఫీ కింగ్. అయితే ఈ సినిమాకి మాళవిక ఒక నిర్మాతగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా పూర్తయింది. సినిమా వస్తే గాని సిద్ధార్థ జీవితంలో ఏం జరిగిందో తెలుస్తుంది.