Homeలైఫ్ స్టైల్Tila Papam Tala Pidikedu meaning: ‘తిలా పాపం తలా పిడికెడు’దీని వెనుక అసలు స్టోరీ...

Tila Papam Tala Pidikedu meaning: ‘తిలా పాపం తలా పిడికెడు’దీని వెనుక అసలు స్టోరీ ఇదే..

Tila Papam Tala Pidikedu meaning: తెలుగు భాషలో ఎన్నో జాతీయాలు, సామెతలు మన జీవిత అనుభవాల నుంచి పుట్టుకొచ్చాయి. అలాంటి వాటిలో ‘తిలా పాపం తలా పిడికెడు’అనే జాతీయం చాలా ప్రసిద్ధి చెందింది. ఒక తప్పుకు ఒక్కరే కాదు.. పలువురు కారణమైతే లేదా ఎవరిది పూర్తి తప్పో తేల్చలేని పరిస్థితి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. చిన్న చిన్న తప్పులు కలిసి పెద్ద అనర్థానికి దారి తీసిన సందర్భాల్లో కూడా దీన్ని చెబుతుంటారు. అసలు ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనక ఉన్న స్టోరీ ఏంటీ?

ఈ జాతీయం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణగాథ ప్రచారంలో ఉంది. ఒక రోజు ఓ గద్ద తన ఆహారం కోసం ఒక విషపామును పట్టుకుని ఆకాశంలో ఎగురుతోంది. గద్ద గోళ్లలో చిక్కుకున్న పాము ప్రాణాలతో పోరాడుతూ తీవ్ర వేదన అనుభవించింది. చనిపోతున్న సమయంలో తన నోట్లోని విషాన్ని బయటకు కార్చింది. అదే సమయంలో కిందుగా ఓ యువతి తన తలపై పెరుగుతో నిండిన ముంతను పెట్టుకుని వెళ్తోంది.

ఆ యువతి ముంతపై కప్పిన గుడ్డ కొద్దిగా జారిపోవడంతో, ఆకాశం నుంచి జారిన పాము విషం నేరుగా పెరుగులో పడుతుంది. కానీ ఆ విషయం ఆ యువతికి తెలియలేదు. కొంతసేపటి తర్వాత ఆమె ఆ పెరుగును ఒక బాటసారికి అమ్మింది. ఆ వ్యక్తి ఆకలితో ఆ పెరుగు తిన్నాడు. విషం కలిసిన కారణంగా అతడు కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనలో నిజంగా తప్పు ఎవరిది అనే ప్రశ్న తలెత్తింది. పామా? గద్దా? లేక పెరుగు అమ్మిన యువతిదా? పాము తన ప్రాణం కాపాడుకునే ప్రయత్నంలో విషం వదిలింది. గద్ద తన ఆహారం కోసం పామును పట్టుకుంది. యువతికి పెరుగులో విషం పడిందనే విషయం తెలియదు. అంటే ముగ్గురిలో ఎవ్వరూ కావాలని హాని చేయలేదు. కానీ ముగ్గురి చర్యలు కలిసి ఒక అమాయకుడి మరణానికి కారణమయ్యాయి.

కాలక్రమంలో ఆ యువతి, గద్ద కూడా మరణించి యమలోకానికి చేరుకున్నాయని కథ చెబుతుంది. అక్కడ యమధర్మరాజు ఈ సంఘటనపై విచారణ జరిపాడట. కానీ ఇందులో ఒక్కరినే పూర్తిగా తప్పుబట్టడం సాధ్యం కాలేదు. అందుకే ఆ పాపాన్ని అందరికీ సమంగా పంచాడని చెబుతారు. ఇలా తిలా పాపం తలా పిడికెడు అనే మాట అక్కడి నుంచే పుట్టిందని అంటారు.

ఈ జాతీయం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని కూడా ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో పెద్ద ప్రమాదాలు ఒక్కరి వల్ల కాకుండా, అనుకోకుండా జరిగిన చిన్న చిన్న పరిణామాల వల్ల జరుగుతాయి. అలాంటి సందర్భాల్లో బాధ్యతను ఒకరిపై మాత్రమే మోపకుండా, పరిస్థితులను సమగ్రంగా అర్థం చేసుకోవాలని ఈ సామెత సూచిస్తుంది. ప్రస్తుతం కూడా రాజకీయాలు, కుటుంబ వివాదాలు, కార్యాలయ సమస్యలు లేదా సామాజిక ఘటనల్లో ‘తిలా పాపం తలా పిడికెడు’ అనే జాతీయాన్ని తరచుగా వాడుతుంటారు. అంటే జరిగిన తప్పులో అందరికీ కొంత బాధ్యత ఉందని చెప్పే సందర్భాల్లో ఈ మాటను ఉపయోగిస్తారు. తెలుగు భాషలోని జాతీయాల వెనుక ఉన్న జీవన సత్యాలకు ఇది ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular