Pitru Paksha 2023: పితృపక్షం అంటే మన పూర్వీకుల కోసం ఓ పక్షం రోజులు ఆచరించే మాసం. ప్రతీ ఏడాది భాద్రపద పౌర్ణమి నుంచి ఈ పక్షం మొదలవుతుంది. పితృపక్షంలో చనిపోయిన పెద్దవారు తిరిగి ఈ భూమ్మిదకు వస్తారని నమ్మకం. అందుకే ఈ పక్షం రోజులు కొన్ని నియమాలను వారి ఆత్మశాంతి కోసం పాటిస్తారు. ఈ ఏడాది 2023 సెప్టెంబర్ 29న పితృపక్షం ప్రారంభం కానుంది. అయితే, ఈ పక్షంలో మగవారు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి.
ఈ పక్షంలో చేసేవి..
ఈ పక్షంలో అందరూ, ముఖ్యంగా మగవారు చనిపోయిన తమ పూర్వీకులకు ఆత్మశాంతి కోసం తర్పణం, శార్ధం పెడతారు. దీంతో వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని నమ్ముతారు. పదిహేను రోజులు సంతాప దినాలుగా పాటిస్తారు. ఈ పక్షం రోజులు ఆత్మ శాంతించని తమ చనిపోయిన పెద్దలు భూమిపైకి తమను చూడటానికి వస్తారని నమ్మకం. కొన్ని నియమాలు పాటించి వాటిని ఆచరిస్తే వారికి మోక్షం కలుగుతుందని పిండ ప్రదానం చేస్తారు. కాకులు చనిపోయిన వారికి గుర్తు కాబట్టి వీటికి కూడా ఏదైనా ఆహారం పెడతారు. ఆ పిండాన్ని కాకులు తింటే తమ పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుందని అంటారు. ఒకవేళ అవి ఈ ఆహారం ముట్టుకోకపోతే ఆత్మ శాంతించలేదని భావిస్తారు.
ఇవి చేయకూడదు..
ఇవన్ని ఒక ఎత్తు అయితే… ఈ పక్షం రోజులు మగవారు కట్టింగ్, షేవింగ్ చేసుకోరు. ఎందుకంటే ఈ దినాలను సంతాప దినాలుగా భావిస్తారు. ముఖ్యంగా పితృపక్షం ముగిసే వరకు ఏ శుభకార్యాలు, కొత్త పనులకు కూడా పూనుకోరు. అంటే కొత్త బట్టలు, వస్తువులు, బంగారం, ఏ ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేయరు. కొత్త ఇల్లు, వాహనాలు కూడా కొనుగోలు చేయరు.
ఆహారం విషయంలో భిన్నంగా..
ఇంకా ఈ పక్షంలో కొందరు ఉల్లిపాయ, వెల్లుల్లి, నాన్ వెజ్ వంటి చికెన్, మటన్, చేపలు, ఘటైన వాసన వచ్చే ఇతర ఆహార పదార్థాలను కూడా తీసుకోరు. కొంతమంది ఇళ్లలో పూర్తిగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. ప్రార్థనలు, ఆచారాలు పాటించడం వల్ల వారి ఆత్మకు శాంతి కలిగి ముక్తి కలిగుతుందని నమ్మకం. కొంత మంది తమ పెద్దలకు ఇష్టమైన నాన్‌వెజ్, వెజ్ వంటకాలు చేసి పిండప్రదానం చేస్తారు. మొత్తానికి చెప్పాలంటే ఏవైనా పితృదోషాలు ఉంటే ఉపశమనం కలుగుతుందంటారు. అయితే ఈ కథనం ప్రజల విశ్వాసాలు మాత్రమే. ఇది వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.