T20 World Cup 2022: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 మెన్స్ వరల్డ్ కప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. బంగ్లాదేశ్ తో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్ లో టీం ఇండియా గెలుపొందింది. అంతకుముందు దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన పరాభవాన్ని ఈ గెలుపుతో మర్చిపోయింది. అయితే టీమిండియా సెమిస్టర్ పోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే పాకిస్తాన్ జట్టు దక్షిణాఫ్రికా పై గెలుపొందిన నేపథ్యంలో గ్రూప్ 2 జాబితా రసవత్తరంగా మారింది. ఒకవేళ జింబాబ్వే చేతిలో భారత్ ఓడిపోతే సెమిస్ ఆశలు సంక్లిష్టమవుతాయి. వాస్తవానికి జింబాబ్వే కు భారత జట్టును ఓడించేంత శక్తి సామర్థ్యాలు లేకపోయినప్పటికీ టి20 క్రికెట్లో ఏదైనా జరగొచ్చు. అంతటి చిన్న జట్లయిన నెదర్లాండ్స్, జింబాబ్వే ఇంగ్లాండ్, పాకిస్తాన్ జట్లను మట్టి కరిపించిన విషయం ఇక్కడ మరవరాదు.

సెమిస్ బెర్తులు సంక్లిష్టం
ఈరోజు దక్షిణాఫ్రికా మీద పాకిస్తాన్ విజయం సాధించడంతో గ్రూప్ 2 లో సెమీస్ బెర్త్ లు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ గ్రూపు నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సెమీస్ కి వెళ్తాయి అనుకుంటే.. పాకిస్తాన్ సాధించిన గెలుపుతో సమీకరణాలు మొత్తం మారిపోయాయి. చిన్న జట్టైన నెదర్లాండ్స్ తో చివరి మ్యాచ్ ఆడాల్సి ఉండడంతో సౌత్ ఆఫ్రికా స్థానానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోయింది. అయితే టీం ఇండియా నే ఆఖరి మ్యాచ్లో జింబాబ్వే పై తప్పక గెలవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇక సౌత్ ఆఫ్రికా నెదర్లాండ్స్ పై గెలిస్తే తొలి సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంటుంది. మరో బెర్త్ కోసం తీవ్ర పోటీ నెలకొని ఉంటుంది. ఏమాత్రం అటు ఇటు జరిగి భారత్ జింబాబ్వే చేతిలో ఓడిపోతే.. పాకిస్తాన్ తమ చివరి మ్యాచ్లో బాంగ్లాదేశ్ పై భారీ తేడాతో గెలిచి.. మెరుగైన రన్ రేట్ ఆధారంగా సెమీస్ కి వెళుతుంది. కాబట్టి భారత్ ఎట్టి పరిస్థితుల్లో జింబాబ్వే పై గెలవాల్సిందే. అప్పుడే పాకిస్తాన్ తో ఎటువంటి సంబంధం లేకుండా నేరుగా సెమిస్ కి వెళ్తుంది.
ఒకవేళ ఇలా జరిగితే
భారత్ జింబాబ్వే పై గెలిచి, పాకిస్తాన్ బంగ్లాదేశ్ పై భారీ తేడాతో గెలిచి, దక్షిణాఫ్రికా నెదర్లాండ్స్ చేతిలో ఓడిందంటే భారత్ పాకిస్తాన్ జట్లు సెమిస్ కి వెళ్తాయి. అయితే ఇది అనుకున్నంత సులభం కాదు. గ్రూప్ 2 నుంచి సెమిస్ రేసులో ఉన్న భారత్, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ జట్ల పాయింట్ల వివరాలు ఒకసారి పరిశీలిస్తే.. భారత్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడింది.

మూడు విజయాలు సాధించింది. ఆరు పాయింట్లు, 0.730 రన్ రేట్ తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక సౌత్ ఆఫ్రికా నాలుగు మ్యాచ్ల్లో రెండు విజయాలు సాధించింది. ఒక దాంట్లో పరాజయం పాలైంది. మరో మ్యాచ్ లో ఫలితం తేలక పోవడంతో 5 పాయింట్లు సాధించింది. రన్ రేట్ 1.402 తో ఈ గ్రూప్ లో రెండో స్థానంలో కొనసాగుతోంది..ఇక పాక్ నాలుగు మ్యాచ్లు ఆడింది. రెండు విజయాలు, రెండు పరాజయాలతో నాలుగు పాయింట్లు సాధించింది. రన్ రేట్ 1.085 తో ఈ గ్రూప్ లో మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. మిగతా మ్యాచ్ లకు వరుణుడి గండం పొంచి ఉంది.