మనలో చాలామంది ఉద్యోగంతో పోలిస్తే వ్యాపారం బెస్ట్ అని భావిస్తారు. అయితే వ్యాపారం చేయాలనుకుంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. పది మందికి ఉపాధి కల్పిస్తూ వ్యాపారం చేయాలని అనుకునే వాళ్లకు కేంద్రం అమలు చేస్తున్న పథకాల ద్వారా రుణం పొందే అవకాశం ఉంటుంది. ఏపీలోని కోనసీమ ప్రాంతాలలో, కొంకణ్, ఉత్తర ఈశాన్య ప్రాంతాలలో మోదీ సర్కార్ కొబ్బరిపీచు ఉత్పత్తి పరిశ్రమను అభివృద్ధి చేయాలని భావిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా కొబ్బరిపీచు ఉత్పత్తులకు సంబంధించి మన దేశం యొక్క వాటా 80 శాతానికి పైగా ఉంది. కొబ్బరి పీచు ఉత్పత్తులకు డిమాండ్ సైతం రోజురోజుకు పెరుగుతుండటం గమనార్హం. ఈ వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వాళ్లు కేంద్రం నుంచి సాయం పొందవచ్చు. ఇప్పటికే ఈ వ్యాపారం ద్వారా దేశంలోని 7,30,000 మంది ఉపాధిని పొందుతున్నారు. ఇలా ఉపాధిని పొందుతున్న వాళ్లలో మహిళలు ఎక్కువమంది ఉన్నారు.
కనీసం 50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా కొబ్బరిపీచు ఆధారిత పరిశ్రమను మొదలుపెట్టే అవకాశం అయితే ఉంటుంది. కాయిర్ ఉద్యోమి యోజన పేరుతో కేంద్రం కొబ్బరిపీచుతో వ్యాపారం చేస్తున్న వాళ్లకు ప్రయోజనం చేకూరుస్తోంది. ఈ స్కీమ్ కింద గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు సబ్సిడీ పొందవచ్చు. ప్రాజెక్ట్ ఆమోదం పొందితే 55 శాతం వరకు రుణం పొందే ఛాన్స్ ఉంటుంది.
ఈ వ్యాపారం ద్వారా తయారు చేసిన ఉత్పత్తులకు ప్రభుత్వం నుంచి మార్కెటింగ్ మద్దతు లభిస్తుంది. http://coirservices.gov.in/frm_login.aspx వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందాలని అనుకునే వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.