Omicron: ఇక కరోనా పరిస్థితులు మళ్లీ వచ్చే అవకాశం లేదు., వ్యాక్సిన్ వచ్చేసింది., అని అందరూ అనుకున్నారు. కానీ, కొవిడ్ మహమ్మారి రూపాంతరం చెంది మరో వేరియంట్ రూపంలో వచ్చి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దాంతో ప్రజలు, వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచంలోని దేశాలన్నీ మళ్లీ ఆంక్షల వలయంలోకి ఒక్కొక్కటిగా వెళ్తున్నాయి. కొవిడ్ కేసుల పెరుగుదల చూసి భయాందోళనకు గురవుతున్నాయి కూడా. అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికే కొవిడ్ పంజా విసురుతోంది. న్యూయార్క్ సిటీలో కేసులు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఆ దేశంలో మాస్కులు కంపల్సరీ చేశారు. అమెరికా ఒక్క చోటే కాదు.. భారత్ సహా మిగతా దేశాలన్నిటిలోనూ మాస్కు ధరించడం మస్ట్ అనే నిబంధన మళ్లీ అమలులోకి తీసుకొచ్చారు.
రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్ పట్ల ఆసక్తి చూపించడం అనే నియమాలు మళ్లీ అమలులోకి వచ్చాయి. ఇక ఏదేని ఇతర దేశాలకు వెళ్లాలనుకున్నపుడు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్స్ కంపల్సరీగా చూపించాల్సి ఉంటుంది. దాంతో పాటు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ కూడా చూపించాలి అనే ఆంక్షలు అమలులోకి వచ్చాయి. భారతదేశంలోనూ ఈ నిబంధనలు అమలులో ఉన్నాయి. కర్నాటక, మహరాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చాయి.ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఇక నైట్ కర్ఫ్యూ పెట్టే ఆలోచన చేయాలని ఇప్పటికే కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది.
Also Read: ఒమిక్రాన్ తో థర్డ్ వేవ్ కు ఛాన్స్.. కేంద్రం కీలక సూచనలు..!
చాలా దేశాలు ఎయిర్ పోర్ట్ ద్వారా తమ దేశంలోకి వచ్చే విదేశీయులపై ఆంక్షలు విధించాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తికి అడ్డుకుట్ట వేసేందుకుగాను వివిధ దేశాలు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. దక్షిణ కొరియా, ఇజ్రాయిల్, అమెరికాల్లో కేసులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఆయా దేశాలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఎయిర్ పోర్టుల్లో ప్రత్యేకమైన వైద్య ఆరోగ్య బృందాలను ఏర్పాటు చేసి కొవిడ్ టెస్టులు చేస్తున్నాయి. విదేశీయులను తమ దేశంలోకి అనుమతించే ముందర కంపల్సరీ టెస్టులు చేస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కొవిడ్ కేసులు చాపకింద నీరులా రోజురోజుకూ పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆ దేశ అధికారులు అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు. ప్రత్యేకమైన నిఘా బృందాల ద్వారా ఎయిర్ పోర్టుల్లో విదేశీయుల రాకను పరిశీలిస్తున్నారు.
Also Read: ‘ఒమిక్రాన్’ భయం: దేశంలో మళ్లీ లాక్ డౌన్ వస్తుందా?