
Microsoft Internet Explorer: వెబ్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ కు మైక్రోసాఫ్ట్ గుడ్ బై చెప్పేసింది.. జూన్ 13 నుంచి ఈ సేవలు నిలిచిపోతాయి.. ఇదే విషయాన్ని మైక్రోసాఫ్ట్ అధికారికంగా ప్రకటించింది.. 1995లో అప్పటికి టెక్నాలజీ ఇంత ప్రాచుర్యంలో లేదు.. అయినప్పటికీ ప్రపంచానికి ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ ను మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతోపాటు విండోస్ 95ను కూడా లాంచ్ చేసింది.. తర్వాత విడిగా వెబ్ బ్రౌజర్ గానూ అందుబాటులోకి తీసుకొచ్చింది. 1996 నుంచి ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ ఆధిపత్యం చెలాయించింది. ఏకంగా 95% యూసేజ్ తో టాప్ మోస్ట్ యూసింగ్ బ్రౌజర్ గా వెలుగొందింది.. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా… తర్వాత పరిస్థితి క్రమంగా మారిపోయింది.
ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ కు క్రమంగా పోటీ పెరిగింది. దానికంటే మంచి యూజర్ ఇంటర్ ఫేస్, ఇంటర్నెట్ స్పీడ్, స్మూత్ ఫేర్ పార్మెన్స్ తో బ్రౌజర్లు వచ్చాయి.. ముఖ్యంగా గూగుల్ క్రోమ్, మోజిల్లా ఫైర్ఫాక్స్ నుంచి తీవ్రమైన పోటీ ఏర్పడింది.. ఇదే దశలో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ తీసుకొచ్చింది. దీంతో ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ వాడకం తక్కువైంది. పైగా దీని పనితీరు చాలా నెమ్మదిగా ఉందంటూ ఫిర్యాదులు కూడా వచ్చాయి.. ఇదే క్రమంలో భవిష్యత్తు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇక ఎడ్జ్ బ్రౌజర్ అని మైక్రోసాఫ్ట్ పేర్కొంటున్నది. ఎడ్జ్ బ్రౌజర్ వాడాలి అని చెబుతోంది.
మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ఫాస్ట్ గా ఉండటమే కాదు.. చాలా సెక్యూర్ గా ఉంటుంది. ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ కన్నా ఎంతో మెరుగైన బ్రౌజింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.. పాత వెర్షన్లలకు కూడా సపోర్టు చేస్తుంది అని మైక్రోసాఫ్ట్ పేర్కొన్నది.. 2016 నుంచి ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ కు మైక్రోసాఫ్ట్ అప్డేట్స్ ఇవ్వడం ఆపేసింది.. ముఖ్యంగా ఎడ్జ్ బ్రౌజర్ తీసుకొచ్చాక దీని గురించి పట్టించుకోలేదు. ఇక ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది గత చరిత్రగా మారింది.. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు బాధను వ్యక్తం చేస్తుండగా, మరికొందరు జోకులు పేలుస్తున్నారు.

ఎడ్జ్ ఎందుకంటే
ప్రస్తుతం టెక్ మార్కెట్లో గూగుల్ దే హవా.. గూగుల్ మాదిరి అప్పటికప్పుడు అప్డేట్ కాకపోవడం మైక్రోసాఫ్ట్ కు షరా ఘాతంగా పరిణమించింది.. పైగా ఆదాయం అంతకంతకు క్షీణించడం మొదలు పెట్టింది.. అప్పుడు బ్రౌజింగ్ ఎక్స్ ప్లోరల్ మార్కెట్లో తిరుగులేని లీడర్ గా ఉన్న మైక్రోసాఫ్ట్… ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది.. దీంతో తనకు తాను ప్రశ్నించుకుంది. గూగుల్ తో పోటీపడాలి అంటే అప్డేట్ కావాలి అని నిర్ణయించుకుంది. ఈ సత్తెకాలం పోకడలు పోతే ఫాయిదా ఉండదని గ్రహించి ఎడ్జ్ ను తీసుకొచ్చింది. గూగుల్ క్రోమ్ కంటే బాగా పనిచేస్తుందని చెప్తున్న మైక్రోసాఫ్ట్.. గత వైభవం కోసం తీవ్రంగా కృషి చేస్తోంది.. మరి ఇన్నాళ్లు గూగుల్ క్రోమ్ కు అలవాటు పడ్డ నెటిజన్లు ఎడ్జ్ ను ఎలా స్వీకరిస్తారో వేచి చూడాల్సి ఉంది.