
Gummadi Kuthuhalamma: గుమ్మిడి కుతూహలమ్మ… నాలుగు దశాబ్దాల పాటు తెలుగు రాజకీయాలకు సుపరిచితమైన పేరు. అనూహ్య విజయాలతో కీలక పదవులు దక్కించుకున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఇలా అనేక పదవులు చేపట్టి గుర్తింపు దక్కించుకున్నారు. అటువంటి కుతూహలమ్మ బుధవారం మృతిచెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తిరుపతిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేశారు. నెదురమల్లి జనార్థనరెడ్డి కేబినెట్ లో కీలక వైద్య ఆరోగ్య శాఖను నిర్వర్తించారు. 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు.
అది 1985 సంవత్సరం. ఎన్టీఆర్ ప్రభంజనంలో హేమాహేమీలు కొట్టుకుపోయారు. దశాబ్దాలుగా రాజకీయాలను ఏలిన వారు సైతం తెర మరుగయ్యారు. ఓటమి నుంచి తట్టుకోలేకపోయారు. కానీ ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మహిళా నాయకురాలు మాత్రం విజయబావుట ఎగురవేశారు. రాష్ట్ర రాజకీయాలనే ఆకర్షించగలిగారు. ఆమే గుమ్మిడి కుతూహలమ్మ. వృత్తిరీత్యా డాక్టర్ అయిన కుతూహలమ్మ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత చిత్తూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. అటుతరువాత నెల్లూరు జిల్లా వేపంజెరి నియోజకవర్గం నుంచి తొలిసారిగా 1985లో బరిలో దిగి టీడీపీ అభ్యర్థిపై గెలుపొందారు. ఆ విజయమే ఆమెను రాష్ట్రస్థాయి నేతను చేసింది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వద్ద గుర్తింపు తెచ్చిపెట్టింది.. మంత్రి పదవి దక్కేలా చేసింది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో రాణించిన కుతూహలమ్మ బుధవారం తిరుపతిలో మృతిచెందారు.

కుతూహలమ్మ వృత్తిరీత్యా డాక్టర్. తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరారు. చిత్తూరు జడ్పీ చైర్ పర్సన్ గా తొలి రాజకీయ కొలువు దక్కించుకున్నారు. 1985లో ఎమ్మెల్యేగా వేపంజెర్రి స్థానం నుంచి బరిలో దిగారు. అప్పటికే ఎన్టీఆర్ గాలి బలంగా వీచినా తట్టుకొని నిలబడ్డారు. ఎమ్మెల్యేగా గెలిచారు. 1989,99, 2004లో సైతం అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1994లో మాత్రం కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్ గా పోటీచేసి ఓటమి చవిచూశారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2007లో డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజనతో ఆమె కాంగ్రెస్ పార్టీని వీడారు. 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీచేశారు. కానీ ఓటమే ఎదురైంది. 2019లో ఆమె కుమారుడు హరిక్రిష్ణను బరిలోదించారు. కానీ ఓటమే ఎదురైంది. ఎన్నికల అనంతరం కుతూహలమ్మ, కుమారుడు హరిక్రిష్ణ టీడీపీకి దూరమయ్యారు. కానీ ఏ పార్టీలో చేరలేదు.