
Mandasa Kova : అది తీపి పదార్థమే కానీ షుగర్ రాదు. ఎటువంటి ఆరోగ్య సమస్యా తలెత్తదు. పైగా ఔషధ గుణాలు కలిగి ఉండడంతో అతిగా తిన్నా సైడ్ ఎఫెక్ట్ రావని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ ఆహార పదార్థం ఏంటి? అంతలా దానికి ప్రాచుర్యం దక్కడానికి కారణాలేంటి? అని తెలుసుకోవాలంటే ఒకసారి మనం శ్రీకాకుళం జిల్లాకు వెళ్లి రావాల్సిందే. అక్కడ మారుమూల కుగ్రామం మందస. పేరుకే మండల కేంద్రం కానీ.. అసలు సిసలైన పల్లె వాతావరణం అక్కడ కనిపిస్తుంది. అటవీ ఉత్పత్తులు విక్రయించే గిరిజనులు, మైదాన ప్రాంతాల నుంచి వచ్చే రైతులు.. మధ్యన కొందరు క్లాస్ పిపుల్స్ ప్రత్యేక వాహనాల్లో వచ్చి చిన్నపాటి షాపుల ముందు ఆగుతారు. వడివడిగా వెళ్లి షాపుల వద్ద కొన్ని పదార్థాలను కొని తీసుకెళుతుంటారు. ఇంతకీ వారు కొనుగోలు చేసేది ఏమిటో తెలుసా? తెల్లటి నోరూరించే కోవా.
అన్నీ ప్రత్యేకతలే..
సాధారణంగా కోవా అనగానే మనకు గుర్తుకు వచ్చేది కోవా బిళ్ళలు, లేదా కోవా ముద్ద.కానీ మందస పాలకోవాకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ద్రవరూపంలో మాధుర్యాన్ని పంచుతూ గమ్మత్తైన రుచిని కలిగి ఉంటుంది. ఇక్కడి కోవాకు సుదీర్ఘ చరిత్ర ఉంది. మందస తూర్పు కనుమల ముంగిట నిలిచిన ఒకప్పటి కళింగ రాజుల సంస్థానం. నాటి నుండి విభిన్న రుచులతో ఆహార పదార్ధాలు తయారుచేసే ప్రాశస్త్యం కలిగి ఉన్నది. అందులో భాగంగా పేరెన్నికగన్నది మందస ఔషధ పాలకోవా.దీనికి దాదాపు 300 ఏళ్ల చరిత్ర ఉందని తెలుస్తోంది. తూర్పు కనుమలు అనేక ఔషధ మొక్కలకు, చెట్లకు నిలయమై విలసిల్లుతున్నాయి. ఈ ప్రాంతంలోని గోవులన్నింటినీ ప్రతిరోజూ ఆ కొండలలో కే మేతకు తీసుకు వెళతారు ఔషధ గుణాలు కలిగిన మొక్కలను తినడం వలన అవి ఇచ్చే పాలు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అందువలననే మందస కోవాకు అంతటి ప్రసిద్ధి.
ఇదో వృత్తిగా…
ఇప్పటికీ ఈ కోవా తయారీతో జీవన భృతి పొందిన ప్రత్యేక కుటుంబాలు ఉన్నాయి. తరతరాలుగా ఇదే వృత్తిని నమ్ముకొని జీవనోపాధిని పొందుతున్నాయి. సాధారణ కోవా తయారీ మాదిరిగానే పాలు, పంచదారతో ఈ కోవాను తయారు చేస్తారు. అయితే దానికి ముద్ద రూపం రాకముందే తీసి విక్రయానికి సిద్ధం చేస్తారు. ఇలా చేయడం వలన ఆ పాలలోని ఔషధగుణాలు భద్రంగా ఉంటాయని తయారీదారుల చెబుతుంటారు. గమ్మత్తయిన రుచి ఈ కోవకు సొంతం. శీతాకాలం, వర్షా కాలంలో దాదాపు 15, 20 రోజుల పాటు ఈ ద్రవరూప కోవా పాడైపోకుండా ఉంటుంది.ఈ ఔషధ గుణకోవాను స్థానికులు విరివిగా కొని తింటుంటారు.సాధారణంగా తీపి పదార్ధాలు తింటే షుగర్ వస్తుంది అని అనుకుంటాం కానీ ఈ కోవా వలన ఎటువంటి సమస్య ఉండదు.
బహుళ ప్రాచుర్యం..
ఈ కోవా గురించి ప్రత్యేకంగా మందస వెళ్లిన వారు ఉంటారు. దూర ప్రాంతంలోని బంధువులు, స్నేహితులకు కోవాను పంపించడం ఇక్కడ ఆనవాయితీ కూడా. ఈ కోవాకు అలవాటు పడిన వారు ఎక్కడ ఉన్నా తమ వారితో తెప్పించుకుంటారు. పిల్లలైతే లొట్టలేసుకొని తింటారు. అందుకే ఉత్తరాంధ్రలోని నగరాలు, పట్టణాల్లో స్వీటు షాపు యజమానులు ఇక్కడ మందస కోవా అమ్మబడును అన్న సూచిక బోర్డులు ఏర్పాటుచేసేదాకా పరిస్థితి వచ్చిందంటే అర్ధం చేసుకోవచ్చు. చివరకు ప్రభుత్వం సైతం శ్రీకాకుళం ప్రత్యేకతల జాబితాలో మందస కోవాకు సైతం చోటు కల్పించడం విశేషం. బహుళ ప్రాచుర్యం పొందుతున్న మందస కోవా దేశ ఖ్యాతిని దక్కించుకోవడం విశేషం.