phone : ప్రస్తుతం ఫోన్ లేకుండా ఉండటం ఎవరి వల్ల కాని పని కదా. ప్రతి ఒక్కరి చేతిలో ఈ ఫోన్ కనిపిస్తుంది. బాత్రూమ్ వరకు కూడా వెళ్తుందంటే ఈ ఫోన్ ఏ రేంజ్ లో మనుషుల జీవితంలో భాగస్వామిగా మారిందో అర్థం చేసుకోవచ్చు. మన జీవితంలో మొబైల్ ఒక ముఖ్యమైన అంశంగా మారింది. పర్సనల్, ఆఫీస్ పనులు, డబ్బు లావాదేవీలు, ఆన్‌లైన్ ఇలా ఏ పని చేసినా సరే ఫోన్ కావాల్సిందే అనే విధంగా మారింది. పర్సనల్ డేటా, బ్యాంకు ఆన్‌లైన్ అకౌంట్ వివరాలు, ఫొటోలు, వంటి ముఖ్యమైన సమాచారం కూడా ఇందులోనే ఉంటుంది.
ఇంత కీలకమైన ఫోన్‌ని నిర్లక్ష్యం చేస్తుంటారు కొందరు. కొన్ని సందర్బాల్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగలిస్తారు కూడా. మరి అందులోని కీలక సమాచారం, ఫొటోల పరిస్థితి ఎలా? దాన్ని ఎలా రికవరీ చేసుకోవాలి? వీటిని మోసగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది . అయితే కొన్ని జాగ్రత్తలో తీసుకుంటే తర్వాత జరిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఫోన్ పోయిందని తెలిసిన వెంటనే మీరు కొన్ని పనులు చేయాలి.
సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ పోర్టల్ సహకారంతో పోయిన ఫోన్ ను వెతికి తీసుకోవచ్చు. దీని కోసం మీ ఫోన్ పోయిన వెంటనే దగ్గరలో ఉన్న మీ సేవకు వెళ్లి ఫిర్యాదు చేయాలి. ఫోన్ లో ఉన్న నంబర్ తోనే కొత్త సిమ్ తీసుకోవాలి. ఆ తర్వాత CEIR పోర్టల్ ఓపెన్ చేసి BLOCK STOLEN/LOST MOBILE ఆప్షన్ ను పిక్ చేసుకోవాలి. పోగొట్టుకున్న సెల్ ఫోన్ లో అప్పటివరకు వినియోగించిన ఫోన్ నెంబర్, IMEI నంబర్లతో పాటు ఇతర వివరాలను నమోదు చేయాలి. ఫిర్యాదు ప్రతిని పోర్టల్ లో అప్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొత్త సిమ్ కు రిక్వెస్ట్ ఐడీ వెళ్తుంది. ఆ ఐడీ ఆధారంగా కేసు స్టేటస్ ను తెలుసుకోవచ్చట. ఇలా ఫిర్యాదు అందగానే CEIR పోర్టల్ 24 గంటల్లోనే స్పందించి ఫోన్ ను బ్లాక్ చేస్తుంది.
మరో ప్రాసెస్: మీ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు, వెంటనే అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వాలి. భవిష్యత్తులో ఏవైనా చట్టపరమైన సమస్యలు ఎదురైతే ఈ కంప్లైట్ మిమ్మల్ని రక్షిస్తుంది. పోగొట్టుకున్న ఫోన్‌ను తిరిగి పొందడానికి కంప్లైంట్ వివరాలు చాలా కీలకంగా మారుతాయి. అంతేకాదు కొన్ని అడ్వాన్స్‌డ్ ఆప్షన్లు ఉపయోగించి మొబైల్‌లోని డేటాను డిలీట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మీ ఫోన్‌లో ‘ఫైండ్ మై ఐఫోన్’ లేదా ‘గూగుల్ ఫైండ్ మై డివైజ్’ వంటి ట్రాకింగ్ యాప్‌లు యాక్టివ్‌గా ఉన్నాయా? దీనితో వెంటనే ఫోన్‌ను లాక్ చేయవచ్చు. లేదా డేటాను ఎరేజ్ చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. అలాగే మీ అన్ని సోషల్ మీడియా అకౌంట్‌ల పాస్ వర్డ్ లను కూడా వెంటనే మార్చండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పోగొట్టుకున్న స్మార్ట్‌ఫోన్ నుంచి లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.