https://oktelugu.com/

Credit Card: యూపీఐతో క్రెడిట్‌ కార్డు జత చేస్తున్నారా.. ఇవి తప్పక తెలుసుకోవాలి

సాధారణంగా క్రెడిట్‌ కార్డు చెల్లింపులపై రివార్డు పాయింట్లు వస్తాయి. ఖాతా ద్వారా జరిపే యూపీఐ చెల్లింపులపై ఎలాంటి రివార్డులు ఉండవు. అదే క్రెడిట్‌ కార్డు ద్వారా జరిపే యూపీఐ చెల్లింపులపై రివార్డు పాయింట్లూ పొందొచ్చు.

Written By:
  • Neelambaram
  • , Updated On : December 14, 2023 / 05:10 PM IST

    Credit-Cards doubts

    Follow us on

    Credit Card: డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించటంలో భాగంగా యూపీఐకి క్రెడిట్‌ కార్డులను కూడా అనుసంధానించే సదుపాయాన్ని ఆర్బీఐ తీసుకొచ్చింది. రూపే క్రెడిట్‌ కార్డులు వాడుతున్నవారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. అయితే ఈ సదుపాయంతో ప్రయోజనాలే కాదు.. కొన్ని ప్రతికూలతలూ ఉన్నాయి.

    లాభాలు ఇవీ..
    = బ్యాంకు ఖాతాలో డబ్బులుంటేనే యూపీఐ చెల్లింపులు చేసే సదుపాయం ఉండేది. ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ విధానంతో రూపే క్రెడిట్‌ కార్డును లింక్‌ చేసి సదరు బ్యాంకు నిర్ణయించిన క్రెడిట్‌ లిమిట్‌ వరకు చెల్లింపులు చేయొచ్చు. ఇలా వినియోగించే డబ్బుల్ని తిరిగి చెల్లించటానికి క్రెడిట్‌ కార్డు సంస్థలు కొంత సమయం ఇస్తాయి.

    = సాధారణంగా క్రెడిట్‌ కార్డు చెల్లింపులపై రివార్డు పాయింట్లు వస్తాయి. ఖాతా ద్వారా జరిపే యూపీఐ చెల్లింపులపై ఎలాంటి రివార్డులు ఉండవు. అదే క్రెడిట్‌ కార్డు ద్వారా జరిపే యూపీఐ చెల్లింపులపై రివార్డు పాయింట్లూ పొందొచ్చు.

    = యూపీఐతో క్రెడిట్‌ కార్డులను లింక్‌ చేయడం వల్ల పేమెంట్స్‌ సులభతరం అవుతాయి. ఒక చోట క్రెడిట్‌ కార్డు.. మరో చోట యూపీఐ యాప్‌ వినియోగించాల్సిన అవసరం ఉండదు. మీ చేతిలో ఫోన్‌ ఉంటే చాలు చెల్లింపులు చేయొచ్చు. ప్రతీసారి కార్డును వెంట పట్టుకెళ్లాల్సిన అవసరం ఉండదు.

    = పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ కార్డు స్వైప్‌ మెషిన్లు లేని చిరు దుకాణాల్లోనూ యూపీఐ ద్వారా క్రెడిట్‌ కార్డులను వినియోగించుకోచ్చు.

    = యూపీఐ ద్వారా జరిపే చిన్న చిన్న చెల్లింపులు కూడా బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌లో దర్శనమిస్తాయి. ఎప్పుడైనా స్టేట్‌మెంట్‌ తీసుకోవాలన్నా.. చాలా పెద్దదిగా వస్తుంది. అదే క్రెడిట్‌ కార్డు ద్వారా చేస్తే.. బ్యాంక్‌ స్టేట్మెంట్‌ క్లియర్‌గా ఉంటుంది. చెల్లింపుల వివరాలు కేవలం క్రెడిట్‌ కార్డు స్టేట్‌మెంట్‌లో మాత్రమే నమోదవుతాయి.

    ప్రతికూలతలు ఇవీ..
    = మాస్టర్, వీసా వంటి నెట్‌వర్క్‌పై పనిచేసే క్రెడిట్‌ కార్డులకు ఈ సదుపాయం లేదు. కేవలం రూపే క్రెడిట్‌ కార్డు యూజర్లు మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించుకునే వీలుంది.

    = ఈ తరహా లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ విధిస్తారు. వ్యాపారులపై దీనివల్ల భారం పడుతుంది. అంటే యూపీఐతో జతచేసిన క్రెడిట్‌ కార్డు ద్వారా జరిపే ప్రతీ చెల్లింపులపై వ్యాపారులు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఈ తరహా చెల్లింపుల్ని స్వీకరించటానికి వారు నిరాకరించే అవకాశం ఉంటుంది.

    = వ్యక్తిగత యూపీఐ ఐడీని ఉపయోగించే చిన్న వ్యాపారాలకు క్రెడిట్‌ కార్డుల్లతో యూపీఐ లావాదేవీల చెల్లింపులు సాధ్యం కాదు.

    = బ్యాంక్‌ ఖాతాలో నగదు లేకపోయినా క్రెడిట్‌ కార్డులను వినియోగించుకునే వీలుండడంతో కొనుగోళ్లపై నియంత్రణ తగ్గి.. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. తద్వారా అనవసరంగా రుణ ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉంది.