Agrasen Ki Baoli: ఇదో భయానక బావి.. ఇందులోకి వెళ్తే.. బయటకు రారు!

ఐదంతస్తుల నూతి. ఆరవై మీటర్ల పొడవు, పదిహేను మీటర్ల వెడల్పు. మెట్టు తర్వాత మెట్టు. అలా 108 మెట్లు దిగితే బావి కనిపిస్తుంది. చుట్టూ ఎర్రని శిలలతో నిర్మించిన ఎత్తయిన గోడలు..

Written By: Bhaskar, Updated On : September 20, 2023 12:00 pm
Follow us on

Agrasen Ki Baoli: చేద బావులు చూశాం. మోట బావుల్లో ఈదులాడాం. గుడిలో కోనేరులా విశాలంగా ఉన్న బావిని అరుదుగా చూసుంటాం. ఇంతెత్తు మెట్లతో.. అంతెత్తు గోడలతో.. ఒక దుర్గంలా కనిపించే నూతిని చూడాలంటే దేశ రాజధాని ఢిల్లీ వరకూ వెళ్లాల్సిందే. హస్తినలో ఉన్న ఆ బావి పేరు ‘అగ్రసేన్‌ కీ బావ్‌లీ’. కొందరు ‘ఉగ్రసేన్‌ కీ బావ్‌లీ’ అని కూడా పిలుస్తారు. సుప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉన్న ఈ కోట బావి పేరు చెబితేనే కొందరు ‘అయ్య బాబోయ్‌!’ అంటారు. పురాతన రాతికట్టడాలు, రాజ భవంతులు చూడగానే ఎంత ఆనందం కలుగుతుందో.. మనసులో అన్ని అనుమానాలు రేగుతాయి. ‘అగ్రసేన్‌ కీ బావ్‌లీ’ పరిస్థితీ అంతే. అందమైన ఈ బావిని చూడగానే తన్మయంతో పరవశించేవారూ ఉంటారు. ఏదో తెలియని భయానికి లోనయ్యేవారూ ఉంటారు.

ఐదంతస్తుల నూతి. ఆరవై మీటర్ల పొడవు, పదిహేను మీటర్ల వెడల్పు. మెట్టు తర్వాత మెట్టు. అలా 108 మెట్లు దిగితే బావి కనిపిస్తుంది. చుట్టూ ఎర్రని శిలలతో నిర్మించిన ఎత్తయిన గోడలు.. భారీ ఆర్చరీలు.. విశాలమైన బాల్కనీలతో చూడ ముచ్చటగా ఉంటుంది. అయినా.. ఇందులోకి దిగాలంటే కొందరికి ముచ్చెమటలు పడుతుంటాయి. ఎందుకని అడిగితే… ఒక్కొక్కరూ ఒక్కో కారణం చెబుతారు. ఆత్మలు తిరుగుతున్నాయని.. పిశాచాలు వెంటపడుతున్నాయని.. ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంటందని.. ఇలా నోటికి వచ్చిన రీజన్‌ చెప్పేస్తుంటారు. అందమైన నూతి భయానక కూపంగా మారడం వెనుక స్థానికంగా కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి.

ఈ బావికి చారిత్రక నేపథ్యం ఉంది. మహాభారత కాలం నాటిదని చెబుతుంటారు. అగ్రసేన మహారాజు ఈ బావిని నిర్మింపజేశారని అంటారు. ఆయన పేరు మీద.. ‘అగ్రసేన్‌ కీ బావ్‌లీ’గా ఇది స్థిరపడింది. క్రీస్తుశకం 11వ శతాబ్దంలో ఢిల్లీ పాలకులు ఈ బావిని పునరుద్ధరింపజేశారని పురావస్తుశాఖ అధ్యయనంలో వెల్లడైంది. ఇప్పటికీ ఈ బావి బాగోగులు పురావస్తు శాఖ చూసుకుంటోంది.

ఒకప్పుడు ఈ భారీ నూతిలోని నీళ్లు నలుపు రంగులో భయానకంగా ఉండేవట. బావిని చూడడానికి వచ్చినవారు.. ఆ నీటిని చూసి భయవిహ్వలయ్యేవారట. తదేకంగా నీటిని చూస్తూ.. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేవారట. ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపితులు అయ్యేవారట. వెనక నుంచి ఎవరో తోసేసినట్టు అమాంతంగా నూతిలోకి దూకేసేవారట. ఈ బావిని చూడడానికి వచ్చిన వందలాది మంది అలా హిప్నటైజ్‌ అయిపోయి.. బావిలో పడి మృతిచెందారట. ఈత వచ్చిన వాళ్లు సైతం బావిలో ఈదలేక తనువు చాలించారట. ఈత రాని వారి సంగతి సరే సరి. ‘అగ్రసేన్‌ కీ బావ్‌లీ’ చూసేందుకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడినవారంతా ఆత్మలుగా అక్కడ సంచరిస్తున్నారన్న ప్రచారం ఉంది. అయితే బావిలో నీళ్లు ఎందుకు నల్లగా ఉన్నాయో ఎవరికీ తెలియదు.

ప్రస్తుతం ఆ బావిలో నీటి చుక్క లేదు. అందుకే ఆత్మహత్యలూ లేవు. అయినా.. ఆ బావిని చూడడానికి వెళ్లినవారు అనుమానంగా అడుగులు వేస్తుంటారు. ఎవరో పిలిచినట్టుగా అప్పుడప్పుడూ వెనక్కి తిరిగి చూస్తుంటారు. వెనక నుంచి ఎవరో వెళ్లిపోయినట్టుగా ఉలిక్కిపడుతుంటారు. ఇదంతా కట్టుకథలు అని కొట్టిపారేస్తుంటారు కొందరు. ఢిల్లీలో అత్యంత ప్రజాధరణ పొందిన పర్యాటక కేంద్రాల్లో ఇప్పుడు ఇదీ ఒకటి. వారాంతాల్లో వందలాది మంది స్నేహితులతో కలిసి బావి సందర్శనానికి వస్తుంటారు. సాయంకాలం వరకూ సరదా సరదాగా కాలం గడిపేస్తుంటారు. సూర్యాస్తమయం అయ్యిందంటే మాత్రం కులాసా కబుర్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టేసి చల్లగా అక్కడ్నుంచి జారుకుంటారు. రోజు రోజుకూ ‘అగ్రసేన్‌ కీ బావ్‌లీ’ చూడడానికి వస్తున్నవారి సంఖ్య పెరుగుతున్నా.. భారతదేశంలో పది భయానకమైన పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా దీనికున్న గుర్తింపు మాత్రం ఇప్పటికీ పదిలంగానే ఉంది.