Kakanmath Shiva Mandir: భారతదేశంలో వేల సంవత్సరాల కిందటి ఆలయాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. అందుకు కారణం వారు బలమైన పునాదులు వేసి నిర్మించారు. కొన్ని ఆలయాలు అయితే ఎలాంటి భూకంపాలు, తుఫానులు వచ్చిన వాటిని తట్టుకొని ఇప్పటికీ అలాగే కనిపిస్తూ ఉంటాయి. అయితే ఒక ఆలయానికి ఏమాత్రం పునాది లేకుండా కేవలం రాళ్లు పేర్చినట్లుగా మాత్రమే నిర్మాణం కనిపిస్తుంది. ఈ ఆలయం ఎవరైనా నిర్మించారా? లేదా రాళ్లను పేర్చారా? అన్నట్లు కనిపిస్తుంది. సుమారు 1000 సంవత్సరాల కింద నిర్మించిన ఈ ఆలయ కట్టడం గురించి తెలిస్తే ఆసక్తికరంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆలయాన్ని దయ్యాలు నిర్మించారని కొందరు చెబుతున్నారు. ఇంతకీ ఆలయం ఎక్కడ ఉంది?
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మొరేనా జిల్లా సియోనియా అనే గ్రామంలో ఉన్న ఒక పురాతన ఆలయాన్ని చూస్తే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయమునకు ఎలాంటి సున్నం లేదా జిగురు ఉపయోగించలేదు. కేవలం ఒకదానిపై ఒకటి రాళ్లను మాత్రమే పేరుస్తూ వచ్చారు. ఇలా ఉన్న ఈ ఆలయాన్ని కాకన్మత్ గుడి అని అంటారు. ఈ గుడి విశేషాలు ఏంటంటే దీని శిఖరం 100 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. ఇందులోని శిల్పాలు, దేవతామూర్తుల ఆకారాలు చిత్తరువుల్లా చిక్కపడ్డాయి. అయితే ఈ ఆలయం చుట్టూ ప్రహరీ గోడ, ప్రకారాలు, మండపాలు ఉండేవని.. అవి కార్యక్రమం లో ధ్వంసం అయ్యాయని అంటున్నారు. అవి ధ్వంసం కాగా గర్భాలయం మాత్రం అలాగే ఉండిపోయింది అని స్థానికులు తెలుపుతున్నారు.
1000 సంవత్సరాల కింద ఈ ఆలయాన్ని కల్చూరి రాజా వంశానికి చెందిన కీర్తి సింహ అనే రాజు నిర్మించారని చరిత్ర తెలుపుతోంది. ఈ ఆలయంలో మాగ్నెటిక్ లక్షణాలు ఉండటం వల్ల అవి ఒకదానికి ఒకటి బలంగా పట్టుకొని నిలిచాయని అంటున్నారు. కానీ కొందరు మాత్రం ఈ ఆలయంలో ఏదో శక్తి ఉందని అంటున్నారు. కల్చరి రాజు తన రాణి అయిన కకనా వతి కోసం ఈ మందిరం నిర్మించాడని.. అందుకే ఈ ఆలయానికి ఆ పేరు వచ్చిందని అంటారు. మరో పురాణం ప్రకారం ఈ గుడి నిర్మాణం కేవలం ఒక రాత్రిలోనే గంధర్వులు నిర్మించారని అంటుంటారు. కకన అంటే శక్తి.. మత్ అంటే గుడి.. ఈ ఆలయంలో అనేక రకాల శక్తులు ఉన్నాయని.. అందుకే ఇది రాళ్లతో ఉన్నా కూడా ఎలాంటి ధ్వంసం కాకుండా ఉంటుందని అంటున్నారు.
ఈ ఆలయం నిర్మాణం జరిగిన తర్వాత ఎన్నో రకాల దుర్భర పరిస్థితులు ఎదురయ్యాయి. కొన్నిసార్లు భూకంపం కూడా వచ్చింది. అయినా కూడా ఇది చెక్కుచెదరకుండా అలాగే ఉండిపోవడం విశేషం. ఎత్తయిన శిఖరం, సొగసైన స్తంభాలు, లోపల గర్భగుడికి సన్నని ప్రాంగణం వంటివి ఆకర్షిస్తాయి. ఇవన్నీ 11వ శతాబ్దపు కాలానికి చెందినవే అని గుర్తించారు. అందుకే దీనిని భారతదేశంలోని అద్భుత ఆలయాల్లో ఒకటిగా చేర్చారు.