Second Marriage: సమాజంలో ఇద్దరు వ్యక్తులు (ఆడ, మగ) కలిసి జీవితాంతం కలిసి ఉండడానికి పెళ్లి అనే బంధం ద్వారా ఒక్కటవుతారు. కష్టసుఖాలను పంచుకుంటూ.. పిల్లలను పెంచి పోషిస్తూ చివరి వరకు జీవనం సాగిస్తారు. ఈ ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చిన వివాహ బంధం అనేది చెరిగిపోరాకుండా ఉండాలని కొందరు పెద్దలు చెబుతూ ఉంటారు. చిన్న చిన్న మనస్పర్థలకు దాంపత్య జీవితాన్ని చెరిపేసుకోవద్దని సూచిస్తుంటారు. కానీ నేటి సమాజంలో పెళ్లి అనే బంధానికి విలువ లేకుండా పోయింది. కొన్ని జంటలు ఎంతో ఆడంబరంగా వివాహం చేసుకుంటున్నారు.. అంతే తక్కువ సమయంలో విడిపోతున్నారు. ఈ క్రమంలో వారు వేర్వేరుగా మరొకరిని వివాహం చేసుకుంటున్నారు. అసలు రెండో వివాహం ఎప్పుడు అవసరం పడుతుంది? రెండో వివాహాన్ని ఎవరు చేసుకోవాలి? రెండో వివాహంతో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి. అనే విషయాల్లోకి వెళితే..
ఒక వ్యక్తికి రెండో వివాహం చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఏ సమయంలో రెండో వివాహం చేసుకోవాలి? ఉదాహరణకు భాగస్వామి ఉండగానే మరొకరిపై మనసు పారేసుకుంటున్నారంటే అందుకు కారణమేంటో తెలుసుకోవాలి. ఇంట్లో ఉన్న భాగస్వామికి తనతో కలిసి ఉండడం ఇష్టం లేదా? లేదా వారి మధ్య ఎలాంటి అన్యోన్య జీవితం సాగడం లేదా? అనేది గ్రహించుకోవాలి. ఇలాంటి సమయంలో ఇద్దరు కలిసి ఉండడం ఇష్టం లేనప్పుడు వీరు అధికారికంగా కోర్టు ద్వారా విడాకులు తీసుకొని రెండో వివాహం చేసుకోవచ్చు.
కొందరికి పెళ్లయిన తరువాత భర్త లేదా భార్య మరణించిప్పుడు వారు తోడు కోసం పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ ఈ సమయంలో వారి పిల్లలతో ఆ విషయం ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతుంటారు. అయితే జీవితాంతం తోడు కోసం వారికి వివరించి చెప్పండి. వారు ఒప్పుకునేవరకు వేచి చూడండి. అప్పుడు వారు అర్థం చేసుకున్నాక రెండో పెళ్లి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ పిల్లలు ఒప్పుకోకపోతే వారు ఇతర పనులు చేస్తూ గడిపేయడం మంచిది. ఎందుకంటే జీవితాంత బాగోగులు చూసుకోవాల్సింది పిల్లలే కదా..
భాగస్వామి ఉండగానే తెలివిగా మరొకరితో సహజీవనం కొనసాగిస్తారు. ఇంట్లోని భాగస్వామి ఇష్టం లేదనే నెపంతో మరొకరితో సంబంధం పెట్టుకుంటారు. కొందరు ఒకడుగు ముందుకేసి సీక్రెట్ గా వివాహం చేసుకొని ఒకరికి తెలియకుండా మరొకరితో కాపురం చేస్తారు. ఇది ఎన్నిటికైనా ప్రమాదమే. ఈ విషయం రెండిళ్లలో తెలిస్తే జీవితం ఛిన్నాభిన్నమవుతుంది. ఇలా చేయడం వల్ల పిల్లల జీవితం నాశనమవుతుంది. కాల క్రమంలో ఇద్దరు దూరం పెడితే ఒంటరి జీవితం గడపాల్సి వస్తుంది.
ప్రత్యేక అవసరాల్లో రెండో పెళ్లి తప్పనిసరి కావొచ్చు. ఉదాహరణకు పెళ్లయిన కొత్తలో దురదృష్టవశాత్తూ భాగస్వామి మరణిస్తే మరో తోడు కోసం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కుటుంబ సభ్యుల ఆమోదంతో పాటు రెండో పెళ్లి చేసుకునే వ్యక్తి పూర్తి ఇష్టంతోనే ముందుకు సాగాలి. ఈ సమయంలో ఒత్తిడితో పెళ్లి చేసుకోవడం ద్వారా ఎప్పటికైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో రెండో పెళ్లి చేసుకోవడం కరెక్టేనని కొందరు మానసిక నిపుణులు సూచిస్తున్నారు.