Success vs luck: ప్రతి ఒక్కరూ తమ జీవితం బాగుండాలని కోరుకుంటారు. అయితే అందమైన జీవితం అంటే అందరిదీ ఒకేలా ఉండడం కాదు.. వారి అవసరాలు తీర్చుకుంటూ లక్ష్యాలను చేరుకోవడం నిజమైన విజయం. కానీ ఈ విజయం అంచుల వరకు చేరడం అంటే అంత సులభమేం కాదు. ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో అడ్డంకులు తాటుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే కొందరు మాత్రం ఎలాంటి కష్టం లేకుండానే ఓవర్ నైట్ లో స్టార్ అవుతున్నారు కదా? అనే ప్రశ్న వేయవచ్చు. వాస్తవమే.. కానీ అందరూ ఓవర్ నైట్ స్టార్లు అయితే కావడం లేదు కదా అనే సమాధానం వస్తుంది. మరి ఒక్కరోజులో లక్ష్యం చేరే మార్గం ఏదైనా ఉందా? అంటే అందుకు లక్ కావాలని కొందరు చెబుతూ ఉంటారు. అసలు లక్ ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు?
ఆవగింజంతైనా అదృష్టం లేకపోతే ఎంత కష్టపడినా ఫలితం ఉండదని కొందరు పెద్దలు చెబుతూ ఉంటారు. మరి ఆ అదృష్టం లేకపోతే జీవితం లేదా? అదృష్టం పలానా ప్రదేశంలో ఉంటుందా? అనే ప్రశ్న ఎదురు కావచ్చు. వాస్తవానికి అదృష్టం ఎక్కడ ప్రత్యేకంగా లభించదు. అదృష్టం కూడా ఊరికే రాదు. అయితే అదృష్టం ఉన్నవారి విషయం పక్కన పెడితే.. అదృష్టం లేని వారు కూడా వారితో సమానంగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకోసం అదృష్టం ఉన్నవారికంటే అదృష్టం లేని వారు కాస్త కష్టపడాల్సి వస్తుంది. ఈ కష్టపడే సమయంలో కొందరు నిజాయితీగా ఉండకుండా అదృష్టం ఉన్న వారిపై అసూయ పడుతూ ఉంటారు. ఈ అసూయ వల్ల వ్యక్తిగతంగా జీవితం నాశనమై అవుతుంది తప్ప కొత్తగా అదృష్టం అయితే ఏమీ రాదు.
అదృష్టం లేని వారు సైతం అదృష్టాన్ని తెచ్చుకోవాలంటే నిజాయితీగా అనుకున్న పనిని చేసుకుంటూ పోవాలి. ఒక లక్ష్యం చేరడానికి అందరికీ ఒకే దారి ఉండదు. అంతేకాకుండా అందరికీ పూల దారి ఉండకపోవచ్చు. కానీ ముళ్ళ దారి ఎదురైనా కూడా తట్టుకుంటూ ముందుకు వెళ్లిన వారే నిజమైన విజేతగా నిలుస్తారు. అందులోనూ అదృష్టం తో కాకుండా అదృష్టం లేకున్నా కూడా ముందుకు వెళ్లి లక్ష్యం అంచుల వరకు చేరిన వారే నిజమైన విజయాన్ని పొందడంతో పాటు అసలైన తృప్తిని పొందుతారు. ఎందుకంటే వారు ఇన్నాళ్లు పడ్డ కష్టమంతా మర్చిపోతారు. ఇలా విజయం సాధించిన వారికి అదృష్టం సహాయపడిందా? అంటే అసలు కాదని చెప్పాలి. ఎందుకంటే వారు అదృష్టాన్ని కంటే కష్టాన్ని నమ్ముకున్నారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నారు.
ఇలా ప్రతి ఒక్కరూ అదృష్టం కోసం చూడకుండా ఎవరికివారు తమకు నచ్చిన పని చేసుకుంటూ ముందుకు వెళితే ఎప్పుడూ ఒకప్పుడు కచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. నా సమయం బాగాలేదు.. నాకు అదృష్టం లేదు.. అంటూ కూర్చుంటే ఎన్నటికీ అనుకున్నది సాధించలేరు. అంతేకాకుండా అదృష్టం ఉన్న వారిపై అదృష్టం లేని వారు అసూయ పడడం కూడా ఎలాంటి ఫలితం ఉండదు.. సొంత శక్తిని నమ్ముకొని ముందుకు వెళ్లడమే అసలైన వ్యక్తిత్వం.