
MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో మహేంద్ర సింగ్ ధోని దుమ్ము దులుపుతున్నాడు. 41 ఏళ్ల వయసులో తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని ఆట ద్వారా నిరూపిస్తున్నాడు ధోని. తాజాగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ లో 21 పరుగులు అవసరం కాగా రెండు భారీ సిక్సులు బాది గెలిపించినంత పని చేశాడు. ఈ మ్యాచ్ లో ధోని బ్యాటింగ్ కు రాగానే జియో సినిమా వ్యూస్ భారీగా పెరిగి రికార్డును క్రియేట్ చేసాయి.
ప్రపంచ క్రికెట్లో మహేంద్రసింగ్ ధోనికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కోట్లాది మంది అభిమానులు ఆయన బ్యాటింగ్ కోసం ఎదురు చూస్తుంటారు. వికెట్ల వెనకాల ఉంటూ జట్టును అన్ని విధాల నడిపించే ఆయన వ్యూహాలకు పిచ్చెక్కిపోయే అభిమానులు ఉన్నారు. చివరి దశలో ధోని బ్యాటింగ్ కు దిగితే.. తన మార్కు విశ్వరూపాన్ని చూసేందుకు వేయి కళ్లతో ఎదురుచూసే అభిమానులకు కొదవేలేదు. అటువంటి అవకాశం బుధవారం రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ధోనీకి లభించింది. చివరి ఓవర్లో 21 పరుగులు విజయానికి అవసరం కాగా రెండు భారీ సిక్సులు కొట్టి విజయానికి దగ్గర చేశాడు. దురదృష్టవశాత్తు చెన్నై జట్టు మూడు పరుగులు తేడాతో ఓటమి పాలైంది. కానీ ప్రత్యర్థి జట్టుకు ధోని ముచ్చెమటలు పట్టించాడు.
ప్రత్యర్థిని భయపెట్టిన మహేంద్ర సింగ్ ధోని..
బుధవారం చెన్నై జట్టు రాజస్థాన్ రాయల్స్ తో తలపడింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 8 వికెట్లు నష్టపోయి 175 పరుగులు చేసింది. జోస్ బట్లర్ 36 బంతుల్లో 52 పరుగులు చేయగా, పడిక్కల్ 26 బంతుల్లో 38 పరుగులు, అశ్విన్ 22 బంతుల్లో 30 పరుగులు, హెట్మియర్ 18 బంతుల్లో 30 పరుగులు చేయడంతో మెరుగైన లక్ష్యాన్ని చెన్నై జట్టుకు విధించింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి చెన్నై జట్టు బరిలోకి దిగింది. ఓపెనర్ డెవాన్ కాన్వాయ్ 38 బంతుల్లో 50 పరుగులు, అజంకే రహానే 19 బంతుల్లో 31 పరుగులు చేశారు. చివరి 30 బంతుల్లో 63 పరుగులు కావాల్సిన దశలో బ్యాటింగ్ కు వచ్చిన ధోని జడేజా తో కలిసి జట్టును గెలిపించినంత పని చేశాడు. మూడు సిక్సులతో పాటు ఓ బౌండరీ బాదిన ధోని అభిమానులను అలరించాడు. ఈ మ్యాచ్ లో ధోని ఆడింది 17 బంతులే అయినా 32 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఒక్కసారిగా పెరిగిపోయిన వ్యూస్..
మహేంద్రసింగ్ ధోని బ్యాటింగ్ కు రాగానే జియో సినిమా వ్యూస్ రెండు కోట్ల మార్కును దాటింది. ఆఖరి ఓవర్ లో రెండు సిక్సులు బాదిన అనంతరం ఈ సంఖ్య 2.20 20 కోట్లకు చేరింది. ఇది జియో సినిమాకు ఆల్ టైం రికార్డుగా చెబుతున్నారు. ధోని బ్యాటింగ్ కు రావడానికి ముందు వరకు కోటి 60 లక్షలు వ్యూస్ ఉండగా.. అతను రాగానే మరో 60 లక్షలు వ్యూస్ అమాంతం పెరిగిపోయాయి. లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో ధోని బ్యాటింగ్ చేసినప్పుడు 1.7 కోట్ల వ్యూస్ రాగా, ఆర్సీబీ, లక్నో మ్యాచ్ లో 1.8 ఎనిమిది కోట్ల వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు ఇదే రికార్డుగా ఉంది.. తాజా మ్యాచ్ ఆ రికార్డును బ్రేక్ చేసింది.

చివరి ఓవర్ జరిగింది ఇలా..
చివరి ఓవర్ ను రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ వేశాడు. ఆరు బంతుల్లో 21 పరుగులు అవసరం కాగా ధోని బ్యాటింగ్ చేస్తున్నాడు. మొదటి రెండు బంతులను సందీప్ శర్మ వైడ్ గా వేయడంతో.. ఆరు బంతుల్లో 19 పరుగులకు లక్ష్యం తగ్గింది. మళ్లీ మొదటి బంతి వేయగా ధోని పరుగు తీయలేకపోయాడు. రెండో బంతికి సిక్స్ కొట్టాడు ధోని. దీంతో నాలుగు బంతుల్లో 13 పరుగులకు లక్ష్యం తగ్గింది. మూడో బంతి వేయగా మరో సిక్స్ కొట్టాడు ధోని. దీంతో మూడు బంతుల్లో ఏడు పరుగులకు లక్ష్యం తగ్గింది. అయితే చివరి మూడు బంతులను సందీప్ శర్మ అద్భుతంగా వేయడంతో మూడు పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో చెన్నై జట్టు మూడు పరుగులు తేడాతో ఓటమి పాలు కావాల్సి వచ్చింది.