IPL 2022: ఐపీఎల్ లో ఇప్పటివరకు 5 సార్లు విజేతగా నిలిచి ట్రోఫీ సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్ టీం ఈ సీజన్లో రాణించలేకపోతోంది. వరుసగా ఐదు మ్యాచ్ లు ఓడిపోయింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐదో మ్యాచ్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఓటమిపాలైంది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియంలో బుధవారం రాత్రి పంజాబ్ కింగ్స్ చేతిలో మట్టి కరిచింది. ప్రత్యర్థి నిర్దేశించిన లక్ష్యానికి 12 పరుగుల దూరంలోనే ఆగిపోయింది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.

ఐపీఎల్ 2022 సీజన్ లో వరుసగా ముంబై ఇండియన్స్ ఐదో ఓటమిని చవిచూసింది. పంజాబ్ కింగ్స్‌పై 12 పరుగుల తేడాతో ముంబై పరాజాయం పాలైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధవన్ 70, మయాంక్ అగర్వాల్-52 పరుగులు చేశారు. తొలి వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ముంబై బౌలర్లు ఏ మాత్రం ఒత్తిడిని తీసుకుని రాలేకపోవడంతో పంజాబీ బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడారు.
Also Read: RRR vs KGF 2 Box Office Collection: షాకింగ్ : అక్కడ ఆర్ఆర్ఆర్ కి 20 కోట్లు, కేజీఎప్ కి 45 కోట్లు !

బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ ఆరంభంలో బాగానే ఆడింది. కెప్టెన్ రోహిత్ శర్మ ధాటిగా షాట్లు కొడుతూనే 28 పరుగులకే వెనుతిరిగాడు. ఆ తర్వాత మరో వికెట్ ఇషాన్ కిషన్ అవుటయ్యాడు. అక్కడ్నించి కాస్త నిలదొక్కున్న ముంబై ఇండియన్స్ జట్టుకు బ్రేవిస్ సహకరించాడు. 25 బంతుల్లో 49 పరుగులు చేసి ఊపు మీదున్న బ్రేవిస్‌ను స్మిత్ అవుట్ చేశాడు. ఆ తరువాత సూర్యకుమార్ యాదవ్ ఆడుతూ రిక్వైర్డ్ రన్‌రేట్ తగ్గించే ప్రయత్నం చేశాడు. ఆ దశలో భారీ షాట్‌కు ప్రయత్నించి 43 పరుగుల స్కోర్ వద్ద అవుటయ్యాడు. 198 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేసి వరుసగా ఐదో ఓటమిని ఖాతాలో వేసుకుంది.
ఈ సీజన్ లో రెండో సారి ఫైన్..
ఈ సీజన్ లో వరుస ఓటుముల బాధలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్‌రేట్ కారణంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు మరోసారి భారీ జరిమానా విధించింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 ఓవర్ల కోటాను నిర్ణీత సమయంలో పూర్తి చేయనందుకు అతడిపై రూ.24 లక్షల జరిమానా ఐపీఎల్ నిర్వహకులు విధించారు. అతడితో పాటు జట్టు సభ్యలుకు రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించారు.

కాగా అంతకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ స్లో ఓవర్‌రేట్ కారణంగా ఫైన్‌ను ఎదుర్కొన్నాడు. ఇక రోహిత్ మూడో సారి స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడితే రూ.30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొంటాడు. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు రెండో సారి స్లో ఓవర్ రేటు తప్పిదానికి పాల్పడింది. దీంతో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. కెప్టెన్ రోహిత్ శర్మకు రూ. 24 లక్షలు జరిమానా, టీమ్ సభ్యులకు రూ.6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నాం అని ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read:Ram Gopal Varma: బాలీవుడ్ కి ఏమైంది.. మన రికార్డ్ ని కొట్టేవాడే లేడా.. ఆర్జీవీ ట్వీట్ వైరల్