India vs New Zealand: శ్రీలంకతో వన్డే సిరీస్ వైట్ వాష్ చేసిన భారత జట్టు న్యూజిలాండ్ తో బుధవారం నుంచి మరో పోరుకు సిద్ధమైంది.. హైదరాబాద్ వేదికగా తలపడనుంది. సొంత గడ్డపై తిరుగులేని టీం ఇండియాకు…టాప్ ర్యాంకర్ కీవిస్ తో ఎప్పుడూ కఠిన సవాలే.. కింగ్ కోహ్లీ వరుస సెంచరీలతో సూపర్ ఫామ్ తో ప్రత్యర్థుల్లో గుబులు రేపు తున్నాడు. గిల్, రోహిత్ శర్మ టచ్ లో ఉండడంతో టీమిండియా ఆత్మవిశ్వాసంతో ఉంది. కానీ, పాకిస్తాన్ కు ఝలక్ ఇచ్చిన న్యూజిలాండ్… అదే జోరు కొనసాగించాలనుకుంటున్నది.

శ్రీలంకపై క్లీన్ స్వీప్ తో టీం ఇండియా మంచి జోష్ లో ఉంది. వరల్డ్ కప్ ముందు టీం ఇండియాకు ఈ సిరీస్ ఎంతో కీలకం. లంకతో మూడు సిరీస్ లో భారత జట్టు బ్యాటర్లు నిలకడగా రాణించారు. ముఖ్యంగా టాప్ ఆర్డర్లో కెప్టెన్ రోహిత్ శర్మ, గిల్, కోహ్లీ అదర కొట్టారు. బంగ్లాదేశ్ పై డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ ను పక్కన పెట్టి గిల్ కు అవకాశం కల్పించడంపై విమర్శలు వచ్చినప్పటికీ అతడు తన బ్యాట్ తోనే వాటికి సమాధానం చెప్పాడు. తొలి వన్డే లో హాఫ్ సెంచరీ చేసిన గిల్….మూడో వన్డే లో సెంచరీ చేసి దుమ్ము రేపాడు. చేతి వేలి గాయం నుంచి కోలుకొని మళ్లీ టీం లోకి వచ్చిన హిట్ మ్యాన్ కూడా టచ్ లోకి రావడంతో టీం ఇండియా ఓపెనింగ్ జోడి కుదురుకున్నట్టు కనిపిస్తోంది. ఇక వన్ డౌన్ లో విరాట్ వీర విహారం చేస్తుండటం ఫ్యాన్స్ ను ఆనంద డోలికల్లో ముంచేస్తోంది.. లంకపై రెండు శతకాలు బాదిన కోహ్లీ ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుండటం జట్టుకు శుభ పరిణామం.. మిడిల్ ఆర్డర్లో శ్రేయాస్ అయ్యర్ గాయంతో సిరీస్ కు దూరం కావడం.. డ్యాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కు అనుకోని వరంగా మారింది. లంకతో జరిగిన మ్యాచ్లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిన సూర్య..ఈ సీరిస్ లో రాణించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. శ్రేయాస్ స్థానంలో రజత్ పాటిదార్ ను ఎంపిక చేశారు. కే ఎల్ రాహుల్ వివాహం కారణంగా ఈ సిరీస్ కు దూరంగా ఉన్నాడు. అతడి స్థానంలో ఈషాన్ కిషన్ కీపర్ గా వ్యవహరిస్తాడు. మిడిల్ ఆర్డర్లో కూడా ఆడతాడు. హార్దిక్ పాండ్యా ఫినిషర్ పాత్ర పోషించనుండగా..అక్షర్ స్థానంలో సుందర్ జట్టులోకి రానున్నాడు.
ఇక ఈ మ్యాచ్లో సిరాజ్ పైనే అందరి దృష్టి ఉంది. బౌలింగ్ విషయానికొస్తే సొంత మైదానంలో ఆడుతున్న పేసర్ సిరాజ్ పై భారత జట్టు బోలెడు ఆశలు పెట్టుకుంది. లంక తో సీరిస్ లో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు..మూడో పేసర్ గా ఉమ్రాన్, శార్దూల్ మధ్య పోటీ ఉంది. లెగ్ స్పిన్నర్ ఛాహల్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మరోవైపు వన్డే సిరీస్లో పాక్ జట్టును వారి సొంత గడ్డపై 2_1 తేడాతో ఓడించిన న్యూజిలాండ్ ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. పైగా టీమిండియా కు ఎప్పుడూ కఠిన సవాల్ విసిరే జట్టుగా కివిస్ కు పేరు ఉంది. కెన్ విలియంసన్, టిమ్ సౌథీ కి విశ్రాంతి ఇవ్వడంతో.. టామ్ లాథమ్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఓపెనర్ ఫిన్ అలెన్,కాన్వే, లాథమ్,ఫిలిప్స్ ఫామ్ లో ఉండటం భారత బౌలర్లను కలవర పెట్టే విషయం. విలియంసన్ స్థానంలో హెన్రీ నికోలస్ కు చోటు దక్కే అవకాశం ఉంది. కాగా, గాయం కారణంగా సోథీ ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఇక న్యూజిలాండ్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలో కి దిగే అవకాశం కనిపిస్తోంది.
జట్ల అంచనా ఇది
భారత్: రోహిత్ శర్మ, గిల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్,ఇషాన్ కిషన్, పాండ్యా, సుందర్, కులదీప్ యాదవ్/ చాహల్, షమీ, సిరాజ్, శార్దూల్/ ఉమ్రాన్.
న్యూజిలాండ్: ఫిన్ అలెన్, కాన్వే, మార్క్ చాప్ మన్/ హెన్రీ నికోల్స్, డారెల్ మిచెల్, లాథమ్,ఫిలిప్స్, బ్రేస్ వెల్, శాంట్నర్, హెన్రీ షిప్లే, డో బ్రేస్ వెల్, జాకబ్ డప్ఫీ, ఫెర్గు సన్.
పిచ్ ఇలా
ఉప్పల్ పిచ్ స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉంది. ఎవరి సారిగా 2019 మార్చిలో ఇక్కడ జరిగిన మ్యాచ్లో కులదీప్, జడేజా చెలరేగడంతో ఆస్ట్రేలియాపై భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.. వాతావరణం సాధారణంగా, పొడిగా ఉంది.
ఇక ఈ సిరీస్ ను భారత్ 3_0 క్లీన్ స్వీప్ చేస్తే వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంక్ సొంతం చేసుకుంటుంది.. న్యూజిలాండ్ ప్రస్తుతం నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతోంది. 2010 నుంచి సొంత గడ్డపై ఆడిన 25 ద్వై పాక్షిక సిరీస్ ల్లో టీం ఇండియా 22 నెగ్గింది. ఇక భారత గడ్డపై న్యూజిలాండ్ 35 మ్యాచ్లు ఆడితే 8 నెగ్గింది. భారత్ 26 మ్యాచ్లో గెలిచింది. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు.. ఇక ఇప్పటివరకు ఈ రెండు జట్లు 111 మ్యాచులు ఆడాయి. భారత్ 55, కివీస్ 50 మ్యాచ్ ల్లో నెగ్గాయి. ఇందులో 7 మ్యాచ్ ల్లో ఫలితం తేల లేదు. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు. ఒక మ్యాచ్ టై గా ముగిసింది. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి ఐదు వన్డేలోనూ కివీస్ దే విజయం సాధించింది..
మధ్యాహ్నం 1:30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ లో ఈ మ్యాచ్ ప్రచారం కానుంది.