Homeక్రీడలుIndia vs Australia Odi 2023: వన్డేలో రాణిస్తే వరల్డ్‌ కప్‌ చాన్స్‌.. మరి ఆ...

India vs Australia Odi 2023: వన్డేలో రాణిస్తే వరల్డ్‌ కప్‌ చాన్స్‌.. మరి ఆ ముగ్గురు ఏం చేస్తారో!?

India vs Australia Odi 2023
Ravindra Jadeja

India vs Australia Odi 2023: భారత్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టుకు ఇప్పటి వరకు జరిగిన టీ20, టెస్ట్‌ సిరీస్‌లో ఆశించిన ఫలితం రాలేదు. రెండు సిరీస్‌లను ఆస్ట్రేలియా కల్పోయింది. ఈనెల 17 నుంచి వన్డే సిరీస్‌కు రెండు జట్లు సన్నద్ధమవుతున్నాయి. మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ శుక్రవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. ఈ ఏడాది వన్డే వరల్డ్‌ కప్‌ ఉన్న నేపథ్యంలో ఈ సిరీస్‌ కొంతమంది భారత ఆటగాళ్లకు చాలా కీలకంగా మారనుంది. ఇక్కడ ప్రతిభ చాటితే వరల్డ్‌ కప్‌ జట్టులో స్థానం దక్కే అవకాశం ఉంది.

రవీంద్ర జడేజా
టెస్టు జట్టులో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రవీంద్ర జడేజా.. వన్డేల్లో తన స్థానాన్ని పదిలం చేసుకోవాల్సి ఉంది. 2021 నుంచి టీమిండియా ఆడిన వన్డే మ్యాచుల్లో కేవలం మూడింటిలోనే జడ్డూకు చోటు దక్కింది. అతను లేకపోవడంతో అక్షర్‌ పటేల్, వాషింగ్టన్‌ సుందర్, షాబాజ్‌ అహ్మద్‌ తదితరులు ఏడో స్థానంలో ఆడారు. వీళ్లంతా కూడా తమకు వచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకొని రాణించారు. ఇలాంటి సమయంలో ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో జడ్డూ రాణించకపోతే ఈ ముగ్గురిలోనే ఒకరికి తన స్థానాన్ని కోల్పోవాల్సి వస్తుంది.

సూర్యకుమార్‌..
టీ20ల్లో టాప్‌ బ్యాటర్‌గా కొనసాగుతున్న టీమిండియా స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌.. వన్డేల్లో మాత్రం తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. టీ20 ఫార్మాట్‌లో సెంచరీల మీద సెంచరీలు చేస్తున్న అతను.. వన్డేల్లో మాత్రం కేవలం 28.86 సగటుతో పరుగులు చేశాడు. దీంతో జట్టులో అతని స్థానంపై ప్రశ్నలు తలెత్తాయి. అతను ఈ ఫార్మాట్లో అవుటవుతున్న విధానం చూస్తుంటే తన డిఫెన్స్, ఎటాక్‌ గేమ్స్‌ మధ్య బ్యాలెన్స్‌ కోల్పోయినట్లు కనిపిస్తుంది. ఇంకా చాలా ఓవర్లు ఉండగా తన 360 డిగ్రీస్‌ షాట్లు ఆడబోయి అవుటవడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌ కూడా లేకపోవడంతో సూర్యకు బంగారం వంటి అవకాశం లభించినట్లే. మరి దీన్ని అతను ఏమాత్రం ఉపయోగించుకుంటాడో చూడాలి.

Ravindra Jadeja
Suryakumar. Shardul Thakur

శార్దూల్‌ ఠాకూర్‌
వన్డే వరల్డ్‌ కప్‌ ఆడే జట్టులో మూడో పేసర్‌ స్థానం కోసం శార్దూల్‌ ఠాకూర్‌ పోటీలో ఉన్నాడు. అతనికి యవ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ నుంచి గట్టి పోటీ ఉంది. అయితే అవసరమైనప్పుడు బ్యాటుతో కూడా విలువైన పరుగులు చేయడం శార్దూల్‌కు ఉన్న పెద్ద ప్లస్‌. ఈ క్రమంలో తన బౌలింగ్‌ కూడా మెరుగ్గా ఉందని శార్దూల్‌ నిరూపించుకుంటే.. అనుభవం ఉన్న అతనికి జట్టులో చోటిచ్చేందుకే సెలెక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది. దీనికి ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌ చక్కని వేదికగా కనిపిస్తోంది. ఈ సిరీస్‌లో కనుక శార్దూల్‌ రాణిస్తే.. జట్టులో మూడో పేసర్‌ స్థానం అతను అందిపుచ్చుకున్నట్లే.

మొత్తంగా ఈ ముగ్గురు యువ క్రికెటర్లు.. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌ను సద్వినియోగం చేసుకుంటే.. వరల్డ్‌ కప్‌ జట్టు ఎంపికలో వీరికి ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. మరి ఈముగ్గురి పెర్ఫార్మెన్స్‌ ఆస్ట్రేలియాపై ఎలా ఉంటుందో చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version