India First Village: దేశంలోనైనా, ఎక్కడైనా కూడా మొదట, చివర అనేవి ఉంటాయి. సాధారణంగా మన దేశానికి ఫస్ట్ పాయింట్.. చివరి పాయింట్ అనేది ఉంటుంది. వీటి గురించి అందరికీ తెలిసిందే. అయితే మన దేశంలో ఫస్ట్ విలేజ్ కూడా ఒకటి ఉందని తెలియదు. దేశంలో మొదటి గ్రామం ఏదని ఎవరిని అయిన ప్రశ్నిస్తే అసలు ఫస్ట్ విలేజ్ కూడా ఉందా? అని ఆశ్చర్య పడతారు. ఉత్తరాఖండ్‌లో చమోలి జిల్లాలో ఓ మాణా అనే చిన్న గ్రామం ఉంది. దీన్నే భారతదేశంలోని మొదటి గ్రామంగా పిలుస్తారు. బద్రీనాథ్‌ను సందర్శించడానికి వెళ్లే యాత్రికులు ఎక్కువగా ఈ మాణా గ్రామాన్ని విజిట్ చేస్తారు. ఈ విలేజ్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడి ప్రకృతి వాతావరణం ఎవరికి అయిన కూడా ఇట్టే నచ్చేస్తాది. ఈ విలేజ్ భారత-టిబెట్ సరిహద్దుకు దాదాపు 25-27 కి.మీల దూరంలో ఉంటుంది. ఈ గ్రామానికి సమీపంలో అలకనంద నది ఉపనది కూడా ప్రవహిస్తుంది. ఉత్తరాఖండ్‌లో ఉన్న ప్రకృతి సౌందర్యం గురించి అసలు మాటల్లో వర్ణించలేం. అలాగే ఈ గ్రామం కూడా ఎంతో సుందరభరితంగా ఉంటుంది. ఈ గ్రామం 10,500 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రత కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ శాతం వాతావరణం చల్లగా గడ్డ కట్టే విధంగానే ఉంటుంది. గ్రామం చూట్టు కొండలు, తెల్లని మంచు మనస్సుకు ఏంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది.
సాధారణంగా చాలా మంది మెట్రో నగరాల్లో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సిటీలో ఉంటే అన్ని సౌకర్యాలు అందుతాయి. కానీ మనస్సుకు ప్రశాంతత ఉండదు. అదే ఈ మాణా గ్రామంలో అయితే ఎంతో ప్రశాంతత లభిస్తుంది. చల్లని గాలి, మంచు కొండలు మధ్య లోకేషన్లు చూస్తే ఆహా అనాల్సిందే. ఈ మాణా గ్రామం బద్రీనాథ్‌కి కేవలం 4 కి.మీ దూరంలో ఉంది. చార్‌ధమ్ యాత్రకు వెళ్లేవారు తప్పకుండా బద్రీనాథ్‌ను సందర్శిస్తారు. ఆ సమయంలో కొందరు ఈ గ్రామాన్ని వీక్షిస్తారు. ఉత్తరాఖండ్‌ను దేవ్ భూమిగా పిలుస్తారు. ఇక్కడ ఆలయాలు, వాతవారణం, ప్రకృతి ఎంతో అందంగా ఉంటాయి. అయితే ఈ గ్రామం గురించి ద్వాపర పాగంలో ప్రస్తావన ఉంది. పాండవులు అంతిమ మోక్షం కోసం ఈ మాణా గ్రామం నుంచే స్వర్గానికి వెళ్లినట్లు చెప్పుకుంటారు. అయితే ఇక్కడ ఉండే కొన్ని ప్రాంతాల్లో కూడా పాండవులతో సంబంధాలు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది.
మాణా గ్రామంలో చూడటానికి ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా హిందువులు సందర్శించడానికి వేద్ వ్యాస్ గుహ ఉంది. ద్వాపర యుగంలో ఋషి వేద వ్యాసుడు అన్ని వేదాలు, పురాణాలు, అనేక ఇతర ముఖ్యమైన హిందూ గ్రంథాలను ఇక్కడే రాశాడని నమ్ముతారు. ఆ విధంగా దీనికి వేద్ వ్యాస్ గుహ అని పిలుస్తారు. అలాగే పాండవుల కథకు సంబంధించి భీమ్ పుల్ అనే ఒక ప్లేస్ ఉంది. భీముడు ఇక్కడ నుంచి స్వర్గం వైపు వెళ్లడానికి వంతెనను కూడా సృష్టించాడట. శ్రీ గణేష్ గుఫా మాణా గ్రామంలో ఫేమస్. ఈ గుహను కూడా సందర్శించడానికి ఎక్కువ సంఖ్యలో వెళ్తుంటారు. ఈ మాణా గ్రామంలో ట్రెక్కింగ్, షాపింగ్, ఫొటోషూట్ వంటివి చేయవచ్చు. హాలీడే ట్రిప్‌కు వెళ్లడానికి కూడా ఈ మాణా గ్రామం బెస్ట్ ప్లేస్.