HCA: అస్తవ్యస్థంగా..అవినీతితో మకిలి పట్టిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్.సీ.ఏ)కు మరో షాక్ తగిలింది. హైదరాబాద్ పోలీసులు హెచ్.సీఏపై మరో కేసు నమోదు చేశారు. ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్ స్టేడియంలో టీ20 మ్యాచ్ జరిగింది. మ్యాచ్ కు సంబంధించిన టికెట్లపై తప్పుడు సమయం ముద్రించారని ఓ యువకుడు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టికెట్లపై సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుందని ముద్రించారని.. కానీ ఆట మాత్రం 7 గంటలకే ప్రారంభమైందని అందులో పేర్కొన్నాడు.

దీంతో కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే టికెట్ల విక్రయం సందర్భంగా హెచ్.సీఏపై మూడు కేసులు నమోదైన విషయం తెలిసిందే. మ్యాచ్ టికెట్ల విక్రయం సందర్భంగా కొందరు సృహ తప్పి పడిపోవడంతో గందరగోళం నెలకొంది. జింఖానా గ్రౌండ్ లో తొక్కిసలాట.. తోపులాట చోటుచేసుకుంది.
బాధితురాలు అదితి ఆలియా, ఎస్ఐ ప్రమోద్ ఫిర్యాదులతో పోలీసులు రెండు కేసులు పెట్టారు. టికెట్ నిర్వహణ, బ్లాక్ లో అమ్మారన్న ఆరోపణలపై హెచ్.సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్, మ్యాచ్ నిర్వాహకులపై కేసులు పెట్టారు. ఇప్పుడు మరో కేసుతో హెచ్.సీఏ పెద్దల మెడకు ఉచ్చు బిగించేందుకు హైదరాబాద్ పోలీసులు రెడీ అయ్యారు.

కొద్దిరోజులుగా అవినీతి వ్యవహారాలతో ఎంతకూ మారని హెచ్.సీఏ పెద్దలను కేసులతోనే దారికి తేవాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. ఈ మేరకు అరెస్ట్ లకు సిద్ధం కావచ్చన్న ప్రచారం సాగుతోంది.