Car Parking Precautions: ఈ రోజుల్లో కారు కొనడం పెద్ద విషయమేమీ కాదు. సామాన్యుడు సైతం సొంత కారు ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా కంపెనీలు సైతం తక్కువ ధరలో వివిధ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అయితే కారు కొనగానే సరిపోదు. దానిని సరైన విధంగా ఉపయోగించాలి. అప్పుడే జీవితకాలం మన అవసరాలను తీరుస్తుంది. కారును వాడడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అనేక సమస్యలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా అనవసరపు ఖర్చులు పెరుగుతున్నాయి. మరి కారు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను తెలుసుకుందాం.
కారు విషయంలో చాలామంది చేసే ఫస్ట్ మిస్టేక్ హ్యాండ్ బ్రేక్ తో పార్క్ చేయడం. ఇలా చేయడం వల్ల బ్రేక్ షూ మెటల్ తగిలి జామ్ అయిపోతుంది. దీనిని సరి చేయడం సాధ్యం కాదు. అందువల్ల ఎక్కడైనా కార్ పార్క్ చేసేటప్పుడు హ్యాండ్ బ్రేక్ తో ఎక్కువ సేపు పార్క్ చేయకండి..
కొంతమంది తమ వాహనాన్ని ఎక్కువసేపు నడపడం వల్ల పాడైపోతుందని అనుకుంటారు. కానీ కారు విషయంలో మాత్రం రోజూ కనీసం ఒక్కసారైనా బయటకు తీసే విధంగా చూసుకోవాలి. కారును స్టార్ట్ చేసేటప్పుడు లేదా మూవ్ అయినప్పుడు బ్యాటరీ అవసరం కచ్చితంగా ఉంటుంది. ఒకవేళ మీరు కారును కొన్ని రోజులపాటు బయటకు తీయకుండా ఉంచితే ఆ బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల కారును కచ్చితంగా రోజుకి ఒకసారి అయినా ఉపయోగించండి.
కారును ఎక్కువసేపు ఒకే చోట పార్క్ చేయడం వల్ల దొంగతనాలకు ఆస్కారం ఉంటుంది. కొందరు దీనిని గమనించి వాటి పార్ట్స్ను తీసుకెళ్లే ప్రమాదం ఉంది. అందువల్ల కారును ఎక్కువ సేపు ఒకే చోట పార్క్ చేయకుండా చూసుకోండి.
కారును కొన్ని రోజులపాటు ఒకే చోట పార్క్ చేయడం వల్ల టైర్లలోని గాలి అనవసరంగా విడుదల అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల కారు బరువు ఖాళీ టైర్ల పై పడుతుంది. దీంతో టైర్లు పాడైపోయి అనవసర ఖర్చులు పెరుగుతాయి.