Relationship: భార్యాభర్తల బంధం చాలా గొప్పది. కానీ ప్రస్తుత కాలంలో ఇద్దరు ఉద్యోగాలు చేయడం, పనులకు వెళ్లడం వల్ల సమయం కేటాయించడం చాలా తక్కువగా చూస్తుంటాం. కానీ దీని వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. ఒకరితో ఒకరు కనీసం ఐదు నిమిషాలు కూడా మాట్లాడటం లేదు. తెలిసితెలియక చేసే తప్పుల వల్ల ఇద్దరి జీవితం సమస్యల సుడిగుండం మాదిరి తయారు అవుతుంది. మరి ఇద్దరి మధ్య సఖ్యత ఉండాలంటే, జీవితం సంతోషంగా సాగాలంటే ఏం చేయాలో చూసేద్దాం.
ప్రతి ఒక్కరూ తమ తమ పనిలో బిజీగా ఉన్నారు. చాలా మంది భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తున్నారు. గృహిణి అయితే, ఆమె పిల్లలను చూసుకోవడం లేదా ఇంటి పని చేయడంలో బిజీగా ఉండటం కామన్. ఇక, సోషల్ మీడియా ఇప్పుడు చాలా జంటల సమయాన్ని దోచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరికొకరు సమయం దొరకడం కష్టంగా మారింది. దీంతో.. భాగస్వాముల మధ్య దూరం పెరుగుతుంది. భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉంటున్నా ఒకరి జీవితంలో ఏం జరుగుతుందో మరొకరికి తెలియడం లేదు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల చాలా గొడవలు, అపార్థాలు వస్తుంటాయి. అయితే, ఒకరికొకరు ఉదయం కొన్ని గంటలు తమ కోసం కేటాయించుకుంటే.. వారి రిలేషన్ డబుల్ స్ట్రాంగ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
దంపతులు ఉదయం ‘నా సమయాన్ని.. కాస్తా.. వీ టైమ్’గా మార్చుకోవాలి. ఉదయాన్నే లేచి టీ లేదా కాఫీతో కబుర్లు చెప్పుకోండి. మీ ఆలోచనలు, లోపాల్ని ఒకరితో మరొకరు షేర్ చేసుకోండి. అంతేకాకుండా మీ మధ్య జరిగిన మధుర జ్ఞాపకాల్ని నెమరువేసుకోండి. అంతేకాకుండా భార్యభర్తలిద్దరూ మార్నింగ్ వాక్‌కి వెళ్లవచ్చు. మార్నింగ్ వాక్ శరీరానికి మేలు చేయడమే కాకుండా దంపతుల మధ్య మానసిక బంధాన్ని ఏర్పరుస్తుంది. అంతేకాకుండా ఉదయాన్నే వంటగదిలో ఇద్దరూ కలిసి బ్రేక్‌ఫాస్ట్ తయారు చేయవచ్చు. దీంతో భర్త భార్యకు పనిభారం తగ్గించినట్టు అవుతారు. అంతేకాదు ఆమె మనసుకు మరింత దగ్గరవుతారు. మీ భార్య ఆఫీస్ కు వెళ్తే కాస్త డ్రాప్ చేయండి.
మార్నింగ్ రొటీన్‌లో వాకింగ్ చేయడం విసుగు అనిపిస్తే.. ఇద్దరూ కలిసి డ్యాన్స్ క్లాస్‌కి వెళ్లవచ్చు లేదా స్విమ్మింగ్ లేదా ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీ చేయవచ్చు. ఉదయం పూట ఇద్దరూ కలిసి సైకిల్ తొక్కవచ్చు. అలాగే, ఇద్దరూ కలిసి గార్డెనింగ్ పనులు చేయవచ్చు. ఇలా చేయడం వల్ల లేలేత సూర్యకిరణాల వల్ల మీ మూడ్ ఫ్రెష్‌గా ఉంటుంది.
ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి ఒత్తిడితో బాధపడుతున్నారు. సో సంతోషకరమైన రిలేషన్ మాత్రమే ఒత్తిడి నుంచి బయటపడేస్తుంది. దంపతుల మధ్య సాన్నిహిత్యం పడకగది నుంచి మాత్రమే కాదు బయట నుంచి కూడా మొదలవుతుంది అంటున్నారు నిపుణులు. ప్రతి పనిలో ఒకరినొకరు ఆదరించుకోవాలి. అంగీకరించుకోవాలి. అప్పుడు మాత్రమే ఒకరికొకరు దగ్గరవుతారు. భౌతిక స్పర్శ కంటే మనసులు కలవడమే ముఖ్యమంటున్నారు నిపుణులు. ఎప్పుడైతే వారి మనసులు ఒక్కటవుతాయో.. దాని ప్రభావం పడకగదిలో కూడా కనిపిస్తుంది.
బ్రెయిన్, బిహేవియర్ ఇమ్యూనిటీ హెల్త్ జర్నల్‌లో ప్రచురించబడిన నివేదిక ప్రకారం.. ఒకరినొకరు 10 సెకన్ల పాటు కౌగిలించుకునే జంటలలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతి జంట ఉదయాన్నే తమ భాగస్వామిని కౌగిలించుకోవాలి. ఇలా చేస్తే ఎప్పటికీ అనారోగ్యం బారిన పడరు. దంపతులు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు, వారి ఒత్తిడి పోతుంది. అంతేకాకుండా వారి శరీరంలో అడెనోసిన్, డోపమైన్ వంటి సంతోషకరమైన హార్మోన్లు విడుదలవుతాయి. ఈ హార్మోన్లు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
భార్యభర్తల మధ్య స్నేహం ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ స్నేహాన్ని ప్రారంభించడానికి మార్నింగ్ టైమ్ గోల్డెన్ అవర్. ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడే స్నేహం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు చెప్పుకున్న పనులు మొత్తం ఉదయాన్నే చేయడం వల్ల దంపతులు మంచి స్నేహితులు కూడా కావచ్చు. భాగస్వామే స్నేహితుడిగా ఉంటే మరో ఫ్రెండ్‌కు కాల్ చేయాల్సిన అవసరం ఉండదు కదా.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..