Hug Benefits: మాములుగా నచ్చిన వారికి ప్రేమను, ఇష్టాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా తెలియజేస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు మాటలు చెప్పేందుకు ప్రయత్నిస్తారు. మరి కొందరు ఏదైనా బహుమతి ఇచ్చి తెలియపరుస్తారు. ఇంకొందరు పూలు ఇచ్చి ఇలా ఒక్కో తరహాలో ప్రేమను వ్యక్తపరుస్తుంటారన్న సంగతి తెలిసిందే. అలాగే హగ్ చేసుకుంటారు. అయితే ఈ విధంగా హగ్ చేసుకోవడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయట. అవి ఏంటనే విషయాలను తెలుసుకుందాం.
మనలో చాలా మంది బాధ అయినా సంతోషమైనా మనకు ఇష్టమైన వారికి చెప్పుకునే సమయంలో హగ్ చేసుకుంటుంటారు. ఈ విధంగా చేయడం వలన తమ బాధ నుంచి కొంత వరకు ఉపశమనం పొందుతారని తెలుస్తోంది. అలాగే ఒత్తిడిని తగ్గించుకునేందుకు కూడా కౌగిలింత ఉత్తమమైన పరిష్కారమని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
హగ్ చేసుకోవడం వలన ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందడంతో పాటు రోగ నిరోధక వ్యవస్థ కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి మనిషి రోజుకు నాలుగు సార్లు హగ్ చేసుకుంటే ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారట. అంతేకాదు మానసిక సమస్యలతో బాధపడేవారు ఎనిమిది నుంచి 12 సార్లు హగ్ చేసుకోవడం వలన వారి ఆందోళన, ఒత్తిడి,యాంక్జైటీ, డిప్రెషన్, ఒంటరితనం, రక్తపోటు వంటి ఇబ్బందులు దూరం అవుతాయని వైద్య నిపుణులు తెలిపారు.
కౌగిలింత వలన ఎవరితోనూ చెప్పుకోకుండా మోస్తున్న భారం కూడా తగ్గినట్లు అనిపిస్తుందని తెలియజేస్తున్నారు. హగ్ వలన శరీరంలో ఆక్సిటోసిన్ ఉత్పత్తి ఎక్కువ అవుతుందని, ఈ హార్మోన్ కారణంగా హార్ట్ సమస్యలు తగ్గుతాయని తెలుస్తోంది. హగ్ వలన గుండె వేగం తగ్గడమే కాకుండా చాలా ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తుంది. అలాగే నిద్రలేమితో బాధపడే వారికి కూడా హగ్ మంచి పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. పడుకునే ముందు హగ్ చేసుకోవడం వలన నిద్ర బాగా పడుతుందని, నాడీ వ్యవస్థ మెరుగుపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.