How many eggs per week is safe: శరీరానికి సరైన ప్రోటీన్ అందించే ఆహార పదార్థాల్లో కోడి గుడ్డు ఒకటి. ప్రతి రోజూ ఒక గుడ్డు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుడ్డు ఒక సంపూర్ణ ఆహారంగా చెబుతున్నార. ఇందులో ఉన్న అధిక నాణ్యమైన ప్రొటీన్ శరీరానికి అవసరమైన అమినో ఆమ్లాలను అందిస్తుంది. ఇవి కండరాల నిర్మాణానికి, కండరాల బలాన్ని పెంచడానికి కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా వ్యాయామం చేసే వారికి, పిల్లలు ఎదుగుదల దశలో ఉన్న వారికి గుడ్డు చాలా ఉపయోగకరం. మరి రోజుకు ఎన్ని.. వారానికి ఎన్ని గుడ్లు తినాలి..
గుడ్డులో ప్రోటీన్‌తో పాటు విటమిన్ A, B12, D, E వంటి ముఖ్యమైన విటమిన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఎముకలను బలపరచడంలో, నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో సహాయపడతాయి. గుడ్డులోని కొలిన్ అనే పోషక పదార్థం మెదడు పనితీరును మెరుగుపరచడంలో కీలకంగా ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా సహకరిస్తుంది.గుడ్డులో ఉండే ల్యూటిన్ మరియు జియాజాంథిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి కంటి చూపును కాపాడటంతో పాటు వయస్సు పెరిగే కొద్దీ వచ్చే కంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునేవారు తమ ఆహారంలో గుడ్డును చేర్చుకోవడం మంచిది.
ఆరోగ్యవంతులైన వ్యక్తులు రోజుకు ఒక గుడ్డు తినడం సురక్షితం. అయితే గుండె సంబంధిత సమస్యలు లేదా హై కొలెస్ట్రాల్ ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారు డాక్టర్ సలహా మేరకు వారానికి 3-4 గుడ్లు మాత్రమే తీసుకోవడం మంచిది. ముఖ్యంగా గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల పరిమితంగా తీసుకోవాలి.
గుడ్డును ఎలా తింటామన్నది కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఉడకబెట్టిన గుడ్లు తినడం ఉత్తమం. ఎందుకంటే ఇవి తక్కువ క్యాలరీలతో పాటు పోషకాలు ఎక్కువగా అందిస్తాయి. ఫ్రై చేసిన గుడ్లలో అదనపు నూనె కారణంగా క్యాలరీలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉడకబెట్టిన గుడ్లను ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమమైన ఎంపిక. గుడ్డు ఒక చవకైన, సులభంగా లభించే, పోషకాలతో నిండిన ఆహారం. సరైన పరిమితిలో తీసుకుంటే ఇది శరీరానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది. రోజువారీ ఆహారంలో గుడ్డును చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.