spot_img
Homeలైఫ్ స్టైల్Lightning Safety Tips: పిడుగుల నుంచి ఇలా తప్పించుకోండి ..

Lightning Safety Tips: పిడుగుల నుంచి ఇలా తప్పించుకోండి ..

Lightning Safety Tips: వేసవి కాలంలో పిడుగుపాటు ప్రాణహానిగా మారుతోంది. ముఖ్యంగా ఉపాధి హామీ పనులు, వ్యవసాయ పనులకు వెళ్లే శ్రామికులు ఈ సమస్యలను ఎక్కవగా ఎదుర్కొంటారు. మే నుంచి జూన్‌ నెలలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో ఉరుములు, మెరుపులు సంభవిస్తుంటాయి. ఈ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారు ప్రమాదాలకు గురవుతుంటారు. ఇలాంటి సమయంలో పిడుగుల నుంచి రక్షణ పొందడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

వాతావరణ నిపుణుల ప్రకారం పిడుగు అనేది సహజ ప్రకృతి విపత్తు. అయినప్పటికీ సరైన జాగ్రత్తలు పాటిస్తే ప్రాణనష్టం నుంచి తప్పించుకోవచ్చు. ఆకాశంలో మెరుపు కనిపించిన తర్వాత 30 సెకన్లలోపు ఉరుములు వినిపిస్తే ప్రమాదం చాలా దగ్గర్లోనే ఉందని అర్థం చేసుకోవాలి. అలాంటి సమయంలో వెంటనే పనులు ఆపేసి సురక్షిత ప్రదేశానికి వెళ్లాలని సూచిస్తున్నారు. చివరి ఉరుమ వినిపించిన తర్వాత కనీసం 30 నిమిషాల వరకు బయటకు రాకపోవడం మంచిదని చెబుతున్నారు.

పిడుగులు ఎక్కువగా ఎత్తయిన వస్తువులను తాకే అవకాశం ఉంటుంది. అందువల్ల మెరుపులు, ఉరుములు వినిపించే సమయంలో చెట్ల కింద నిలబడటం చాలా ప్రమాదకరం. ఒకే ప్రదేశంలో గుంపుగా నిలబడటం కూడా ప్రమాదానికి దారితీయొచ్చు. పిడుగు పడినప్పుడు విద్యుత్ ప్రభావం ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంటుంది. అందువల్ల కూలీలు గుంపులుగా కాకుండా దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా పొలాల్లో పని చేసే రైతులు వర్ష సూచనలు కనిపించగానే వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి.

అయితే సురక్షితమైన ప్రదేశాలు అనగా పక్కాగా నిర్మించిన ఇళ్లు, పైకప్పు ఉన్న భవనాల్లోకి వెళ్లడం మంచిది. అలాంటి ప్రదేశాలు అందుబాటులో లేకపోతే తక్కువ ఎత్తు ఉన్న ప్రాంతానికి వెళ్లాలి. పొలంలోనే చిక్కుకుపోయిన పరిస్థితుల్లో నేలపై పూర్తిగా పడుకోకుండా, చేతులు నేలను తాకకుండా మోకాళ్లపై వంగి ఉండటం ద్వారా ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఉపాధి హామీ పనులకు వెళ్లే శ్రామికులు వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకోవడం, గాలులు వేగంగా వీచడం, మెరుపులు కనిపించడం వంటి సంకేతాలు కనిపించగానే పని నిలిపివేయాలి. ప్రాణాల కంటే పని ముఖ్యం కాదనే అవగాహన గ్రామీణ ప్రాంతాల్లో మరింత పెరగాల్సిన అవసరం ఉంది.

ఇదిలా ఉండగా పిడుగుపాటుతో మరణించిన ఉపాధి హామీ శ్రామికుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతం రూ.2 లక్షల పరిహారం మంజూరు చేస్తున్నారు. గతంలో ఈ సాయం రూ.50 వేలుగా ఉండగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానిని రూ.2 లక్షలకు పెంచారు. ఈ పరిహారం పొందాలంటే స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్‌ ద్వారా ఘటనకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సేకరించి ఎంపీడీవో కార్యాలయానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version