Darshan Supreme Court shock: కన్నడ స్టార్ హీరో దర్శన్ , రేణుక స్వామి హత్య కేసులో అరెస్ట్ అయ్యి , కొన్ని రోజుల తర్వాత బెయిల్ మీద విడుదలై , గడువు పూర్తి అవ్వగానే మళ్లీ అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతానికి ఆయన జైలులోనే ఉన్నాడు. అయితే కర్ణాటక హై కోర్టు దర్శన్ కి రీసెంట్ గానే బెయిల్ నిరాకరించగా, ఆయన నేరుగా సుప్రీమ్ కోర్టుని ఆశ్రయించాడు. దీనిపై నేడు జస్టీస్ పార్థివాలా , జస్టీస్ బిష్ణోయ్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిటీషన్ పై తుది తీర్పుని ఇస్తూ , దర్శన్ కి బెయిల్ ని నిరాకరించింది. అంతే కాదు , ట్రయిల్ కోర్టు లో ఈ కేసు నత్త నడకన సాగుతుండడం పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసుకి సంబంధించిన దాదాపుగా 150 మంది సాక్షులు ఉన్నారు , వీళ్లందరినీ విచారించాల్సి ఉంది.
కానీ గడిచిన 7 నెలల్లో కేవలం 10 మందిని మాత్రమే విచారించారట , దీనిని ధర్మాసనం తప్పుబట్టింది. వచ్చే ఏడాది లో విచారణ వేగవంతం అయితేనే, బెయిల్ కి దరఖాస్తు చేసుకోవాలని దర్శన్ కి సుప్రీం కోర్టు సూచించినట్టు తెలుస్తోంది. అంటే దీని అర్థం మరో ఏడాది వరకు ఆయనకు బెయిల్ వచ్చే అవకాశాలే కనిపించడం లేదు. 7 నెలల్లో 10 మందిని విచారించారంటే , ఇక ఏడాది లో మహా అయితే మరో 10 మందిని మాత్రమే విచారించగలరని , ఇలా అయితే దర్శన్ బెయిల్ మీద బయటకు వచ్చే లోపు పుణ్య కాలం కాస్త గడిచిపోతుందని దర్శన్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విచారణ వాయిదాలు వేయకుండా , రోజుకు ఒకరిని కచ్చితంగా విచారించేలా ప్రణాళికలు చేయాల్సిందిగా ట్రయిల్ కోర్టు కి సుప్రీమ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతం ట్రయిల్ కోర్టు జడ్జి అదనపు బాధ్యతల్లో ఉండడం వల్ల, విచారణ కు చాలా సమయం పడుతుందని, దర్శన్ తరుపున న్యాయవాది ముకుల్ సుప్రీమ్ కోర్టుకి వివరించారు. దీంతో వెంటనే రెగ్యులర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ని నియమించాలని కర్ణాటక హై కోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది. తనకు జైలులో అవసరమయ్యే కనీసం వసతులను కూడా నిరాకరిస్తున్నారని సుప్రీమ్ కోర్టు కి దర్శన్ విన్నవించుకోవడం తో , రూల్స్ ప్రకారం దర్శన్ కి అందాలన్సిన అన్ని వసతులు ఇవ్వాలని , అలా అని ఆయనకు వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వరాదని సుప్రీం కోర్టు ఆదేశించింది. తన ప్రియురాలు పవిత్ర గౌడ కి , రేణుక స్వామి అనే 33 ఏళ్ళ అభిమాని, అసభ్యకరంగా మెసేజిలు పెట్టాడనే కారణంతో , దర్శన్ తన అనుచరులతో రేణుక స్వామి ని కిడ్నాప్ చేసి హత్య చేసాడని ఆరోపణలు ఉన్న నేపథ్యం లో 2024 జూన్ 11 న దర్శన్ ని అరెస్ట్ చేశారు . అప్పటి నుండి ఆయన జైలులోనే ఉంటున్నాడు , మధ్యలో ఒకసారి బెయిల్ లభించింది కానీ , సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉండడంతో సుప్రీం కోర్టు బెయిల్ రద్దు చేసింది.
