Shubman Gill : ఎట్టకేలకు ఇంగ్లాండు టూర్ లో టీం ఇండియా విజయం సాధించింది. తొలి వన్డేలో అద్భుతమైన ప్రదర్శన చేసి ఆతిథ్య జట్టుకు షాక్ ఇచ్చింది. ఇటీవల ఐర్లాండ్ సిరీస్.. ఇంగ్లాండ్ సిరీస్లలో ఓటమి నుంచి సాంత్వన పొందింది. టీమిండియాలో కెప్టెన్ గిల్ అద్భుతంగా ఆడాడు. మెరుపు హాఫ్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. ఒక దశలో విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మ స్వల్ప పరుగులకే అవుట్ అయినప్పటికీ.. గిల్ అడ్డుగోడ మాదిరిగా నిలబడ్డాడు. అతడు సూపర్ బ్యాటింగ్ చేయడంవల్ల టీమిండియా ఏ దశలో కూడా ఆతిథ్య జట్టుకు అవకాశం ఇవ్వలేదు.
శ్రేయస్ అయ్యర్ నిదానంగా ఆడినప్పటికీ.. ఇంగ్లాండ్ బౌలర్లకు వికెట్ తీసే అవకాశం ఇవ్వకుండా పరుగులు తీశాడు. రాహుల్ నిరాశపరిచినప్పటికీ.. అక్షర్.. సుందర్ సమర్థవంతంగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ వందకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమ్ ఇండియాకు గెలుపును ఖాయం చేశారు. మిడిల్ ఆర్డర్లో వీరిద్దరూ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో ఇంగ్లాండు బౌలర్ల పప్పులు ఉడకలేదు.
టీమిండియా విజయంలో అక్షర్ కీలకపాత్ర పోషించాడు. నాలుగు వికెట్లు తీయడం మాత్రమే కాకుండా హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. అయితే టీమిండియా లక్ష్య చేదనలో ఉన్నప్పుడు కెప్టెన్ గిల్ ఇబ్బందిపడ్డాడు. అతడికి తొడలు పట్టేయడంతో తట్టుకోలేకపోయాడు. నొప్పి భరించలేక ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడు రిటైర్డ్ హర్ట్ గా వెనక్కి వెళ్ళాడు. అయితే అతడు రేపు జరిగే రెండో వన్డేలో ఆడతాడా.. అనే ప్రశ్న వ్యక్తం అయింది. దీనిపై మేనేజ్మెంట్ క్లారిటీ ఇచ్చింది.
ప్రస్తుతం గిల్ కోలుకుంటున్నాడని మేనేజ్మెంట్ చెబుతోంది. అతడు ఫిజియో వైద్యుల సమక్షంలో చికిత్స పొందుతున్నాడని.. పెద్ద గాయం కాదని.. కాకపోతే ఇంగ్లాండ్ వాతావరణ పరిస్థితులకు గిల్ తట్టుకోలేకపోయాడని.. వన్డే మ్యాచ్ లు ఆడక చాలా రోజులు కావడంతో అతడు కాస్త ఇబ్బంది పడ్డాడని.. రెండవ వన్డేలో అతడు పూర్తిస్థాయిలో జట్టులోకి అందుబాటులోకి వస్తాడని తెలుస్తోంది. మరోవైపు గిల్ ఆరోగ్య మీద మేనేజ్మెంట్ అఫీషియల్ గా క్లారిటీ ఇస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఒక మ్యాచ్ గెలిచిన ఇండియా.. రెండో మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. టి20 సిరీస్ ఓటమికి గట్టి బదులు తీర్చుకోవాలని కృత నిశ్చయంతో ఉంది. గిల్ మెరుపు ఫామ్ లో ఉన్న నేపథ్యంలో టీమిండియాకు సిరీస్ అందిస్తాడని..టీ20 సిరీస్ ఓటమికి బదులు తీర్చుకుంటాడని మేనేజ్మెంట్ భావిస్తోంది.
