Serena Williams: టెన్నిస్ అంటే తెల్లజాతీయుల ఆట. మిగతా వర్ణాల వారిని దరిదాపుల్లో కూడా రానివ్వని ఆట! కానీ ఆ ఆటలోకి, వారి మైదానంలోకి 14 ఏళ్ల వయసులోనే ఆరడుగుల ఎత్తు ఉన్న ఓ నల్ల కలువ ప్రవేశించింది. తనకు తానే ప్రొఫెషనల్ గా మారింది. బలమైన పవర్ కు టెక్నిక్ తోడైతే ఎలా ఉంటుందో తెల్లజాతీయులకు చూపించింది. టెన్నిస్ ఆటకే కొత్త సొబగులు అద్దింది. టీనేజర్ గా, మహిళగా, మాతృమూర్తిగా టెన్నిస్ కోర్టులో బరిలోకి దిగి 23 గ్రాండ్ స్లామ్స్ ను తన ఖాతాలో వేసుకొని ఆల్ టైం గ్రేట్ గా ఖ్యాతి గడించింది. గెలిచినప్పుడు, ఓడినప్పుడు రెండింటినీ సమంగా తీసుకొని అంతర్జాతీయ టెన్నిస్ కు వీడ్కోలు పలికింది. ఆఖరి మ్యాచ్లో పరాజయం పాలై కన్నీరు పెట్టుకుంటూనే కోర్టును వీడింది. ఈ మూడు దశాబ్దాల ప్రయాణంలో సెరెనా విలియమ్స్ తనను తాను మలుచుకున్న తీరు చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.

తండ్రి ప్రోత్సాహంతో..
విలియమ్స్ సిస్టర్స్ గా టెన్నిస్ లో ఆమె ఆగమనమే ఒక సంచలనం. 1981లో అమెరికాలోని మిచిగాన్ లో జన్మించిన సెరెనాకు నలుగురు అక్కలు. తండ్రి రీచర్డ్స్ శిక్షణలో అక్క వీనస్ మాదిరే టెన్నిస్ లో రాటు తేలింది. 1991లో రిచర్డ్స్ కుటుంబం ఫ్లోరిడాకు మకాం మార్చడంతో వీనస్, సెరెనా టెన్నిస్ అకాడమీలో చేరారు. పూర్తి నైపుణ్యం సాధించాక 1995లో సెరెనా విలియమ్స్ పూర్తి ప్రొఫెషనల్ గా మారింది. ఇక ఇక్కడి నుంచి మహిళా టెన్నిస్ లో సెరెనా విలియమ్స్ శకం మొదలైంది. ఓపెన్ ఎరాలో ఆటగాళ్ల మధ్య ఉండే తీవ్ర పోటీని తట్టుకుని ఆమె విజయ బావుటా ఎగరేసింది.
Also Read: Jagan- Amit Shah: అమిత్ షాపై జగన్ కు అంత కోపం ఏంటబ్బా? అసలేంటి కారణం?
అప్పటివరకు ఒక ఎత్తు
సెరెనా టెన్నిస్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఆటస్వరూపం మారిపోయింది. పవర్ ఫుల్ సర్వీసులు, గ్రౌండ్ స్ట్రోక్స్, కోర్టులో చిరుతలా పరుగెత్తేది. అందరి దృష్టిని తన వైపు తిప్పుకునేది. అదే జోరులో అక్క వీనస్ విలియమ్స్ కన్నా ముందే అంటే 1999లో 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే మార్టినా హింగిస్ ను ఓడించి యూఎస్ ఓపెన్ తో తన తొలి గ్రాండ్ స్లామ్ ను అందుకుంది. మరుసటి ఏడాదే సిడ్ని ఒలంపిక్స్ లో అక్కతో కలిసి ఆడి డబుల్స్ లో స్వర్ణం సాధించింది. కెరీర్ తొలి నాళ్ళల్లో అక్కతోనే ఆమెకు పోటీ ఎదురుయ్యేది. 2002 లో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ ఫైనల్స్ లో వీనస్ ను ఓడించి టైటిళ్ళు అందుకుంది. తర్వాతి ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ లోనూ వీనస్ పై గెలిచి ఛాంపియన్ గా నిలిచింది. అనంతరం సెరెనా విలియమ్స్ నిలకడగా రాణిస్తూ అనేక గ్రాండ్ స్లామ్స్ ను తన ఖాతాలో వేసుకుంది. మధ్యలో ఎన్నో సార్లు గాయపడి ఆటకు దూరమైనా మొక్కవోని దీక్షతో తిరిగి కోర్టులో అడుగుపెట్టింది. 2017లో రెండు నెలల గర్భిణిగా ఉన్నప్పటికీ సెరెనా విలియమ్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన తీరు ఇప్పటికీ ఒక అద్భుతమే. అంతేకాదు వీనస్, మార్టీనా హింగిస్, కాప్రియాటి, విక్టోరియా అజరెంకా, షరపోవా పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం
ఆగస్టు నెల రెండో వారంలో అమెరికాలోని ఒహాయోలో జరిగిన వెస్ట్రన్ అండ్ సదరన్ ఓపెన్ లో ప్రేక్షకులు అదేపనిగా గోట్, గోట్( జీవోఏటీ= గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అంటూ ఒకటే అరుపులు. అదే పేరుతో స్టేడియంలో బ్యానర్లను ప్రదర్శించారు. వీరంతా కూడా సెరెనా విలియమ్స్ ను ఉద్దేశించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. చాలా కొద్ది మంది ఆటగాళ్ల జీవితమే ఇంత ఘనంగా ముగుస్తుందేమో.. సెరెనా కెరీర్లో 319 వారాలపాటు నెంబర్ వన్ గా కొనసాగింది. ఇందులో 186 వారాలు ఏకధాటిగా ఆమెదే అగ్రస్థానం. ఐదు సార్లు ఒక ఏడాదిని నెంబర్ వన్ గా ముగించింది. టెన్నిస్ చరిత్రలోనే ఓపెన్ ఎరాలో 23 గ్రాండ్ స్లామ్ లు, మొత్తంగా 73 టైటిళ్ళు ఆమె సొంతం.
ఇవీ ఆమె సాధించిన ఘనతలు
ఓపెన్ శకంలో పురుషులు, మహిళల్లో అత్యధికంగా 23 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ గెలిచిన ఏకైక ప్లేయర్ సెరెనా. 40 ఏళ్ల వయసులోనూ టాప్ త్రీ ర్యాంకర్ ను ఓడించిన ఏకైక ప్లేయర్ సెరెనా. తన కెరీర్లో నాలుగు ఒలంపిక్స్ స్వర్ణాలు గెలుచుకుంది. ఇందులో సింగిల్స్ లో ఒకటి. డబుల్స్ విభాగంలో మూడు. 11 వింబుల్డన్ సింగిల్స్ ఫైనల్స్ ఆడింది. 14 గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిళ్ళు గెలుచుకుంది. వీటిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ నాలుగు, ఫ్రెంచ్ ఓపెన్ 2, వింబుల్డన్ 6, యూఎస్ ఓపెన్ 2 ఉన్నాయి. ఇక గ్రాండ్ స్లామ్స్ మిక్స్ టైటిళ్ళ విషయానికొస్తే వింబుల్డన్లో ఒకటి, యూఎస్ ఓపెన్ లో ఒకటి గెలుచుకుంది. కెరీర్లో ఓవరాల్ గా 73 సింగిల్స్ టైటిళ్ళు గెలుచుకుంది. 319 వారాలు నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగింది. ఈమె తర్వాత స్టెఫీ గ్రాఫ్ 377, నవ్రతిలోవా 332 వారాలపాటు టాప్ ర్యాంక్ లో ఉన్నారు. కెరీర్ ప్రైజ్ మనీ ద్వారా ఇప్పటిదాకా 757.26 కోట్లను సెరెనా విలియమ్స్ గెలుచుకుంది.
చివరి మ్యాచ్లో ఓటమి
ఎంతో గొప్ప చరిత్ర ఉన్న సెరెనా తన చివరి మ్యాచ్ లో ఆస్ట్రేలియా కు చెందిన 29 ఏళ్ల అజ్లా టోమ్లజనోవిక్ చేతిలో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం ఎంతో ఉద్వేగానికి గురైన సెరెనా విలేకరులతో మాట్లాడింది. రిటైర్మెంట్ అనే పదం తనకు నచ్చదని, అయితే ఆటకు దూరంగా ఉండేందుకు తాను మానసికంగా సిద్ధం కానున్నట్లు ప్రకటించింది. ఈ అద్భుతమైన ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది. తల్లిదండ్రుల కృషివల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చింది. ఏమిచ్చి వారి రుణం తీర్చుకోగలనని కన్నీటి పర్యంతమైంది. వీనస్ లేకుండా ఈ సెరెనా యే లేదు అన్నప్పుడు స్టాండ్స్ లో ఉన్న వారంతా ఉద్వేగానికి గురయ్యారు. వీనస్ విలియమ్స్ బోరున ఏడ్చేసింది. కాగా రిటర్మెంట్ పై పున: పరిశీలన చేస్తారా అని విలేకరులు అడిగితే ఆస్ట్రేలియా అంటే నాకు ఎప్పుడూ ఇష్టమేనంటూ వ్యాఖ్యానించింది. దీంతో వచ్చే జనవరిలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సెరెనా విలియమ్స్ బర్లో దిగుతుందా అనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. కానీ ఆటకు దూరంగా జరిగి జీవితంలో ఇతర ముఖ్యమైన విషయాలకు చేరువ కావాలని భావిస్తున్నానని ఇప్పటికే సెరెనా పలు సందర్భాల్లో తెలిపింది. వీటి ఆధారంగా చూస్తే ఆమె టెన్నిస్ కు వీడ్కోలు పలికినట్టే. అయితే సరోగసీ ద్వారా మరో బిడ్డను కనాలని ఉందని సెరెనా అనడం గమనార్హం.
Also Read:Telangana Liberation Day: సెప్టెంబర్ 17: బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్.. ఎవరిని ఎవరు గోకుతున్నారు?
[…] Also Read: Serena Williams: తెల్లజాతీయులను మట్టి కరిపించి… […]