Gond Katira benefits summer: ఎండలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఇలాంటి సమయంలో శరీరం ఆటోమేటిక్ గా వేడెక్కుతూ ఉంటుంది. శరీరంలో ఉష్ణగ్రతను తగ్గించుకోవడానికి రసాయనాలు కలిపిన కూల్ డ్రింక్స్ కాకుండా సహజమైన మార్గాలపై చాలా మంది దృష్టి పెడుతున్నారు. అలాంటి వాటిలో ఇప్పుడు ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్నది ‘గోండ్ కటీరా’. దీనిని హిందీలో “గోండ్ కతీరా”, ఇంగ్లీష్‌లో Gond Katira లేదా Tragacanth gum అని పిలుస్తారు. ఇది సహజసిద్ధంగా లభించే ఒక నేచురల్ గమ్. దీనిని వేసవి కాలంలో ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే శరీరంను డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. అసలు దీనిని ఎలా తయారు చేస్తారు?
గోండ్ కటీరా ప్రధానంగా Astragalus జాతికి చెందిన మొక్కల వేర్లు, కాండాల నుంచి సేకరిస్తారు. బయటకు తెల్లటి లేదా పసుపు రంగులో ఉండే ఈ గమ్‌ను నీటిలో నానబెడితే జెల్లీలా మారుతుంది. రాత్రి ఒక స్పూన్ గోండ్ కటీరాను గ్లాసు నీటిలో వేసి నానబెడితే ఉదయానికి అది మెత్తగా ఉబ్బి జెల్లా తయారవుతుంది. దీన్ని శర్బత్, పాలు, నిమ్మరసం లేదా నట్రోస్ మిల్క్‌లో కలిపి తీసుకుంటే శరీరానికి చల్లదనం లభిస్తుంది.
వేసవికాలంలో అధిక వేడి వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీని నుంచి ఉపశమనం పొందడానికి గోండ్ కటీరా చాలా వరకు ఉపయోగపడుతుంది. శరీరానికి సహజ చల్లదనం అందించి హీట్‌స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఎండల్లో ఎక్కువగా చెమటపడటం వల్ల నీరు, లవణాలు తగ్గిపోతాయి. గోండ్ కటీరా నీటిని నిల్వ ఉంచే లక్షణం కలిగి ఉండటం వల్ల డీహైడ్రేషన్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే సహజ ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదింపజేసి రక్తంలో చక్కెర స్థాయులు ఒక్కసారిగా పెరగకుండా సహాయపడుతుంది.
గోండ్ కటీరా తీసుకున్న తర్వాత ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆకలి తగ్గి అధికంగా తినే అలవాటు తగ్గుతుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఇది ఉపశమనం ఇవ్వొచ్చు. పేగుల్లో మృదుత్వాన్ని పెంచి జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. శరీరంలో తేమ నిల్వ ఉండటానికి సహాయపడటం వల్ల చర్మం ఎండిపోకుండా ఉంటుంది. వెంట్రుకల బలానికి కూడా తోడ్పడుతుంది.
గోండ్ కటీరాను తీసుకోవాలని అనుకునేవారు ఒక స్పూన్ గోండ్ కటీరాను రాత్రి నీటిలో నానబెట్టాలి. ఉదయానికి జెల్లీలా మారిన తర్వాత నిమ్మరసం, శర్బత్, చల్లటి పాలు లేదా ఫలరసాల్లో కలిపి తాగాలి. అయితే ఎక్కువ మోతాదులో తీసుకుంటే జీర్ణ సమస్యలు రావచ్చు. డయాబెటిస్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలున్నవారు వైద్యుల సలహాతో తీసుకోవడం మంచిది. పిల్లలకు తక్కువ మోతాదులో మాత్రమే ఇవ్వాలి. సమ్మర్లో సహజంగా శరీరాన్ని కూల్‌గా ఉంచుకోవాలనుకునేవారికి గోండ్ కటీరా మంచి ఎంపికగా వైద్యులు సూచిస్తున్నారు. అయితే మితంగా తీసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు