Gautam Adani- LIC: గౌతమ్ అదాని అంతకంతకు దూసుకుపోతున్నాడు. టాటా ల వల్ల కానిది…ముఖేష్ చేయలేనిది. టకటకా చేసుకుంటూ పోతున్నాడు. అంబుజా సిమెంట్ నుంచి ఎన్డీ టీవీ దాకా ఇప్పుడు నడుస్తోంది మొత్తం అదాని హవానే. దేశంలో మెజారిటీ కార్పొరేట్ వ్యాపారాలు మొత్తం ఇప్పుడు ఆదానివే అంటే అతిశయోక్తి కాక మానదు. కార్పొరేట్ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసేలా అదాని దూసుకుపోతున్నాడు. ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం ఛాయల్లో కూరుపోయిన నేపథ్యంలో.. కేవలం ఆదాని మాత్రమే పెట్టుబడులు ఎలా పెట్టగలుగుతున్నాడు? దీనికి కారణం ఎల్ఐసి.. ప్రభుత్వ రంగ సంస్థ కు, ప్రైవేట్ వ్యాపారి అదానికి ఏమిటి సంబంధం అంటే అక్కడే ఉంది అసలు కిటుకు.

అదానికి పెట్టుబడి
భారతీయ బీమా సంస్థల్లో ఎల్ ఐ సీ నంబర్ వన్. కేంద్రం ఈ సంస్థ కాళ్ళల్లో కట్టెలు పెడుతుంది గాని.. ఎప్పుడో మరింత పెద్ద కంపెనీగా ఎదిగేది. కానీ ఈ ఎల్ఐసి లో ప్రజలు పొదుపు చేస్తున్న మొత్తం ఇప్పుడు గౌతమ్ అదాని కంపెనీలకు పెట్టుబడిగా మారుతున్నది. అదాని గ్రూప్ కంపెనీలో ప్రస్తుతం ఎల్ఐసి కి ఉన్న పెట్టుబడుల విలువ 87,380 కోట్లు. గత ఏడాది ఈ మొత్తం 32,100 కోట్లు మాత్రమే. అంటే ఏడాదిలోనే 55 వేల కోట్ల కంటే ఎక్కువ సొమ్ము ఆదాని గ్రూపులో చేరింది.. టాటా, రిలయన్స్ తర్వాత ఎల్ఐసి అత్యధికంగా అదాని గ్రూపులో పెట్టుబడి పెట్టింది. గత రెండు సంవత్సరాల నుంచి ఎల్ఐసి మొత్తం 7 అదాని లిస్టెడ్ కంపెనీల్లో 5 కంపెనీల షేర్లను పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్లో కొనుగోలు చేసింది. ఈ కొనుగోళ్ళ ప్రభావంతో అదాని పోర్ట్స్ అండ్ సెజ్ కంపెనీలో ఎల్ఐసి వాటా పది శాతాన్ని మించిపోయింది.. ఇక ఇతర సంస్థల్లో కూడా ఇదే స్థాయిలో పెట్టుబడులు ఉన్నాయి..
ప్రపంచానికి భిన్నంగా
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి.. అధిక వడ్డీరేట్ల కారణంగా విదేశీ పెట్టుబడిదారులు అదాని గ్రూప్ కంపెనీల షేర్లను విక్రయిస్తున్నారు. కానీ ఇదే సమయంలో ఎల్ఐసి మాత్రం కొనేస్తోంది. అదాని కంపెనీల షేర్లు వాటి పోటీ వ్యాపార కంపెనీలతో పోలిస్తే అత్యధిక విలువపై ట్రేడ్ అవుతున్నాయి. అంతేకాదు అదాని గ్రీన్ అనే కంపెనీ లాభంతో పోలిస్తే షేరు ధర 1,109 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ స్థాయిలో కాకపోయినా అదాని అన్ని షేర్ల పరిస్థితి కూడా అంతే. ఏమైనా తేడా వస్తే మొత్తం వ్యవస్థ కూలిపోతుంది.

ఈ విధంగా షేర్ విలువ పెరగడం అంగీకారయోగ్యం కాదని.. స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. విదేశీ పెట్టుబడిదారులు అమ్మిన షేర్లను ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ ఐ సీ ఎందుకు కొంటుందో, భారీ స్థాయిలో పెట్టుబడి ఎందుకు పెడుతుందో? ఆ సంస్థకే తెలియాలి.. ఖర్మ గాలి అదాని గ్రూపులో ఏదైనా జరిగితే తీవ్రంగా నష్టపోయేది ఎల్ ఐ సీ నే. ఒకవేళ అదే జరిగితే ప్రజలకు తీవ్ర నష్టం.. ఎందుకంటే అదంతా ప్రజల సొమ్ము కాబట్టి. ఏ కంపెనీల్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు అంతగా ఆసక్తి చూపని ఎల్ఐసీ, కేవలం అదాని కంపెనీల్లో మాత్రమే ఆ స్థాయిలో ఎందుకు పెడుతుందో అంతు పట్టకుండా ఉంది. అయితే ఎల్ఐసి ఈ నిర్ణయం తీసుకునేందుకు వెనక ఉన్నది ప్రధానమంత్రి అని నెటిజన్లు విమర్శిస్తున్నారు.