Fridge Usage Tips: వేసవి కాలంలో ఫ్రిజ్ వాడకం తప్పనిసరి. ప్రస్తుత కాలంలో దాదాపు చాలా మంది ఇళ్లల్లో ఫ్రిజ్ తప్పనిసరిగా ఉంటోంది. అయితే దీనిని వాడే విషయంలో కొంతమందికి అవగాహన లేకపోవడంతో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొందరు తమకు తెలియకుండానే చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల ఫ్రిజ్ నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. అసలు ఫ్రిజ్ నుంచి దుర్వాసన ఎందుకు వస్తుంది? ఇలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
ఇంట్లో అత్యంత అవసరమైన గృహోపకరణాల్లో ఫ్రిజ్ ఒకటి. రోజూ ఉపయోగించే దీనిని అవగాహనతో వాడడం వల్ల ఇందులో ఉండే ఆహార పదార్థాలు నాణ్యంగా ఉంటాయి. కొంత మంది ఫ్రిజ్‌ను తరచూ ఆన్, ఆఫ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల దీని పనితీరుపై ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కంప్రెసర్‌పై ఒత్తిడి ఎందుకు పెరుగుతుంది. ఫ్రిజ్‌లో ప్రధాన భాగం కంప్రెసర్. ఇది కూలింగ్ వ్యవస్థను నడిపించే హృదయం లాంటిది. ఫ్రిజ్‌ను ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేస్తే కంప్రెసర్ ఒక్కసారిగా ఎక్కువ శక్తితో పనిచేయాల్సి వస్తుంది. ఈ తరచు మార్పులు కంప్రెసర్‌పై అదనపు ఒత్తిడిని పెంచి దాని లైఫ్ స్పాన్‌ను తగ్గిస్తాయి. ఫలితంగా ఫ్రిజ్ త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంటుంది.
ఒకటి లేదా రెండు రోజుల పాటు ఇంట్లో లేకపోయినా ఫ్రిజ్‌ను ఆఫ్ చేయకపోవడం మంచిది. ముఖ్యంగా అందులో పాలు, పెరుగు, కూరగాయలు, పండ్లు వంటి పదార్థాలు ఉంటే అవి పాడవకుండా ఉండేందుకు ఫ్రిజ్ పనిచేయాల్సిందే. ఫ్రిజ్ ఆఫ్ చేస్తే ఇవి చెడిపోవడమే కాకుండా బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులు బయటకు వెళ్తే మాత్రం ఫ్రిజ్‌ను ఆఫ్ చేయవచ్చు. అయితే ఆఫ్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ఇందులో ఫ్రిజ్‌లోని అన్ని ఆహార పదార్థాలను పూర్తిగా తీసేయాలి. ట్రేలు, ర్యాక్‌లు శుభ్రం చేసి బాగా ఆరబెట్టాలి.
తలుపు కొంచెం ఓపెన్‌గా ఉంచాలి (దుర్వాసన రాకుండా). ఫ్రిజ్‌ను ఆఫ్ చేసిన తర్వాత లోపల తేమ ఉండిపోతే దుర్వాసన, ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ట్రేలను శుభ్రం చేసి పూర్తిగా ఆరబెట్టడం చాలా ముఖ్యం. ఇది ఫ్రిజ్‌ను మళ్లీ వాడేటప్పుడు తాజాగా ఉంచుతుంది.
చాలామంది విద్యుత్ బిల్లు తగ్గించుకోవడానికి ఫ్రిజ్‌ను తరచూ ఆఫ్ చేస్తుంటారు. కానీ ఇది తాత్కాలికంగా కొద్దిపాటి సేవింగ్ ఇస్తే కూడా, దీర్ఘకాలంలో కంప్రెసర్ దెబ్బతిని పెద్ద ఖర్చు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఫ్రిజ్‌ను నిరంతరం ఆన్‌లో ఉంచడం ఉత్తమం. అంతేకాకుండా ఫ్రిజ్‌ను సరిగ్గా వాడటం ద్వారా దీని ఆయుష్షును పెంచుకోవచ్చు. తరచూ ఆన్ ఆఫ్ చేయడం వంటి చిన్న తప్పులు పెద్ద సమస్యలకు దారి తీస్తాయి. కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఫ్రిజ్ ఎక్కువకాలం సమర్థంగా పనిచేస్తుంది, మీ ఖర్చులను కూడా తగ్గిస్తుంది.