Unhappy Leave: కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సాధారణంగా వీకెండ్ డేస్ లో సెలవు ఉంటుంది. ఏదైనా ప్రత్యేక అవసరానికి రిక్వెస్ట్ చేస్తే సెలవు తీసుకోవచ్చు. ఇలా మొత్తంగా అన్నీ కలిపి ఏడాదికి 32 సెలవులు ఉంటాయి. అయితే ఎవరైనా నేను సంతోషంగా లేను అని లీవ్ అడిగితే ఇస్తారా? ఎవరు ఇవ్వరు. ఎందుకంటే ప్రత్యేక కారణం లేకుంటే సెలవు ఇవ్వడానికి ఏ సంస్థ ఒప్పుకోదు. కానీ చైనాలో మాత్రం కొత్త రకమైన సెలవు అందుబాటులోకి వచ్చింది. నేను సంతోషంగా లేను అని ఏ ఉద్యోగి అయినా చెబితే వెంటనే సెలవు ఇచ్చేస్తారు. మరి అలా ఎందుకు ఇస్తారంటే?
ఒక ఉద్యోగి సమర్థవంతంగా పనిచేయాలంటే అతని మనసు ప్రశాంతంగా ఉండాలి. అంతేకాకుండా చేసే పనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కానీ ఉద్యోగులు ఒక్కోసారి వారు చేసే పనిపై దృష్టి పెట్టలేరు. ఒత్తిడి కారణంగా .. కుటుంబ సమస్యలతో ఒక్కోసారి మనసు ఆందోళనగా ఉంటుంది. ఈ ప్రభావం చేసే పనిపై పడుతుంది. అయితే ఈ విషయాన్ని చాలా కంపెనీలు గ్రహించినా పెద్దగా పట్టించుకోరు. కానీ చైనాలోని ప్రావిన్స్ కు చెందిన పాంగ్ డాంగ్ లై అనే రిటైల్ కంపెనీ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ కంపెనీ చైర్మన్ డాంగ్ లూయి ఉద్యోగుల మానసిక పరిస్థితిని పరిశీలించాడు. కొందరి ఉద్యోగుల మానసిక స్థితి బాగా లేకపోతే వారు సరిగ్గా పనిచేయలేదని గుర్తించాడు. దీంతో వారికి విశ్రాంతి కావాలని గుర్తించాడు. ఈ నేపథ్యంలోనే అన్ హ్యాపీ లీవ్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి ఏడాది పది రోజులపాటు అన్ హ్యాపీ లీవ్ ఉంటుందని ఈ కంపెనీ చైర్మన్ పేర్కొన్నాడు.
ఉద్యోగులు ఎవరైనా తన మానసిక పరిస్థితి బాగాలేదు అంటే.. సెలవు తీసుకోవచ్చని పేర్కొన్నాడు. ఉద్యోగి మానసిక పరిస్థితి బాగా ఉంటేనే వారు చక్కగా పనిచేయగలుగుతారని ఆయన గుర్తించాడు. అయితే దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఉద్యోగులు రకరకాల కారణాలతో ఒత్తిడితో ఉంటారని.. వారు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ విధానం బాగుంటుందని గుర్తిస్తున్నారు. అయితే చైనాలో నిర్వహించిన ఓ అధ్యయనంలో 65% మంది ఉద్యోగులు రకరకాల సమస్యలతో బాధపడుతున్నారని తేలింది. ఈ విధానంతో వారు తమ విధుల్లో మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ప్రస్తుతం వారానికి ఒకరోజు సెలవు ఇస్తున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలో వారానికి రెండు రోజులు అవకాశం ఇస్తున్నారు. కొన్ని రోజులుగా కార్యాలయాల్లో ఉద్యోగులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని.. దీంతో వారి ఆరోగ్యం పై ప్రభావం పడి విధులు సక్రమంగా నిర్వహించడం లేదని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఇలాంటి సమయంలో వారి ఆరోగ్యం దృష్ట్యా ప్రత్యేకంగా సెలవు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. అయితే ఇప్పటికే వారానికి రెండు రోజులపాటు సెలవు ఇచ్చినా.. మిగతా రోజుల్లో ఎక్కువ గంటలు పని చేయించుకుంటున్నారని కొందరు విమర్శలు చేస్తున్నారు. మరి భవిష్యత్తులో అన్ హ్యాపీ లీవు మన దేశంలో కూడా వస్తుందా? లేదా? చూడాలి.