Relationship : భార్యాభర్తల బంధం చాలా పవిత్రమైనది. నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేస్తారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని జీవితాంతం ఎలాంటి గొడవలు లేకుండా బతకాలని కోరుకుంటారు. అయితే పెళ్లయిన కొత్తలో అన్యోన్యంగానే ఉన్న అలా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. చిన్న విషయాలకు గొడవలు పడటం, భాగస్వామిని అర్థం చేసుకోకుండా తప్పుపట్టడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి వాటి వల్ల భార్యాభర్తలు దూరంగా ఉంటారు. తప్పులు అనేవి సహజం. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తూనే ఉంటారు. కానీ ఒకసారి చేసిన తప్పును మళ్లీ చేయకూడదు. అసలు ఇద్దరి మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవాలి. అవే గొడవలు మళ్లీ ఇద్దరి మధ్య రాకుండా చూసుకోవాలి. కొందరు ఈగోలకు పోయి భాగస్వామిని దూరం పెడతారు. ఇలా ఇద్దరి మధ్య దూరం పెరగకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో మరి చూద్దాం.
నిజాయితీగా ఉండాలి
ఎక్కువ శాతం అబద్ధాలు చెప్పడం వల్లే బంధంలో గొడవలు వస్తాయి. తప్పు చేస్తే భాగస్వామి దగ్గర ఒప్పుకోండి. మీ నిజాయితీని చూసి ఇంకా ప్రేమ ఎక్కువ అవుతుంది. ఫీల్ అవుతుందని, ఇంకా ఏదో అనుకుంటుందని అబద్ధం చెప్పవద్దు. దీనివల్ల ఇద్దరి మధ్య దూరం పెరగడమే కానీ.. తగ్గడం ఉండదు. కాబట్టి బంధంలో నిజాయితీగా ఉండండి.
క్షమించే గుణం ఉండాలి
భార్యాభర్తలు అన్న తర్వాత ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటే సరిపోదు. క్షమించే గుణం కూడా ఉండాలి. ఏ బంధంలో అయిన తప్పులు అనేవి సహజం. కాబట్టి భాగస్వామి ఏదైనా తప్పు చేస్తే క్షమించేయండి. అలా కాకుండా గొడవను పెంచుకుంటూ కూర్చొంటే ఇద్దరి మధ్య దూరం కూడా పెరుగుతుంది. ఒకరి మీద ఒకరికి పగ పెరుగుతుంది. ప్రేమ పెరగాలంటే ప్రతి విషయంలో భాగస్వామిని అర్థం చేసుకోవాలి.
ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ ఉండాలి
ఏ ఇద్దరు కలకాలం సంతోషంగా ఉండాలన్నా అర్థం చేసుకునే గుణం ఉండాలి. ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ ఉంటేనే సంతోషంగా ఉంటారు. బంధంలో అండర్‌స్టాండింగ్ లేకపోతే ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. ప్రతి చిన్న విషయానికి గొడవలు చేస్తారు. వీటివల్ల దూరం పెరుగుతుంది. కానీ తగ్గదు. కారణం లేకుండా, చిన్న విషయాలకు కూడా గొడవలు పెట్టుకుంటే బంధం విరిగిపోవడం తప్ప మళ్లీ కలవడం కష్టం.
మానసికంగా కలిసి ఉండాలి
భార్యాభర్తలు అంటే శారీరకంగా కలిస్తే సరిపోతుందని చాలా మంది అనుకుంటారు. కానీ భార్యాభర్తలు అన్న తర్వాత కేవలం మానసికంగా కలిసి ఉండాలి. శారీరకంగా ఉంటే పక్కన ఉన్నప్పుడే ఫీల్ అవుతారు. అదే మానసికంగా భాగస్వామితో అటాచ్ అయితే ఎన్ని గొడవలు వచ్చిన మళ్లీ కలిసిపోతారు. అసలు ఒక్కరోజు కూడా మాట్లాడకుండా ఉండలేరు. అలా కనెక్ట్ అయితే ఏ విషయంలో నిర్ణయం తీసుకున్న కూడా భాగస్వామి పర్మిషన్ తీసుకుంటారు. ఇద్దరి హక్కులకు గౌరవిస్తూ.. సంతోషంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.