FIFA World Cup 2022: ఆదివారం ఖతార్ దేశం వేదికగా పిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కానుంది. 32 దేశాల జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. ఈ పోటీకి తొలిసారి ఖతార్ ఆతిథ్యం ఇస్తోంది. ఇందుకు సంబంధించి ఎనిమిది వేదికలు సిద్ధం చేసింది. వాస్తవానికి ఫుట్ బాల్ మ్యాచ్ లు అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. దీనికి తోడు ప్రపంచ కప్ అంటే అది మరింత ఎక్కువవుతుంది. పాశ్చాత్య దేశాల్లో బీర్ తాగుతూ ఫుట్ బాల్ మ్యాచ్ ను అభిమానులు ఆస్వాదిస్తారు. గతంలో జరిగిన టోర్నీల్లో బీర్ల కంపెనీలు పిఫాతో వందల కోట్లల్లో ఒప్పందం కుదుర్చుకునేవి. ఈసారి ఖతార్ దేశంలో ప్రారంభమయ్యే టోర్నీకి బడ్వైజర్ అనే కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ చివరి నిమిషంలో అది రద్దయింది.

ఎందుకంటే
ఖతార్ పూర్తి ముస్లిం దేశం. ఇక్కడ ఆంక్షలు అధికంగా ఉంటాయి. సాగర్ మ్యాచ్ లు జరిగే స్టేడియం పరిసరాల్లో బీర్లు అమ్మ రాదని ఖతార్ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. నాన్ ఆల్కహాలిక్ బీర్లపై ఎటువంటి నిషేధం లేదని స్పష్టం చేసింది. అయితే ఈ నిర్ణయానికి ప్రపంచ ఫుట్బాల్ సమాఖ్య మద్దతు పలికింది. ఇక ఖతార్ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం స్టేడియంలో కేవలం వీఐపీ సూట్ లో మాత్రమే బీర్లు అందుబాటులో ఉంటాయి. వీటిని ప్రపంచ ఫుట్ బాల్ సమాఖ్య మాత్రమే విక్రయిస్తుంది. అయితే ఖతార్ లో అభిమానుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్యాన్ జోన్లలో బీర్లు లభిస్తాయని తెలుస్తోంది.
28 రోజులపాటు పండగే
ఫుట్బాల్ వరల్డ్ కప్ ఆదివారం మొదలై డిసెంబర్ 18 ఫైనల్ మ్యాచ్ తో ముగుస్తుంది.. తొలి మ్యాచ్ ఈక్వెడార్, ఆతిధ్య ఖతార్ జట్ల మధ్య జరుగుతుంది. నేపథ్యంలో స్టేడియం వద్ద డజన్ల కొద్దీ ఏర్పాటు చేసిన బీర్ సేల్ పాయింట్లను తొలగించారు. ఈ టోర్నీ సందర్భంగా పది లక్షల మందికి పైగా అభిమానులు తమ దేశాన్ని సందర్శిస్తారని ఖతార్ అంచనా వేస్తోంది.

అందుకే ప్రధాన బీరు ఉత్పత్తి దారయిన బడ్ వైజర్ తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే సేల్స్ పాయింట్లు తొలగిస్తున్నప్పటికీ స్టేడియంలోని విఐపి సూట్స్ లో బీర్ లభ్యమవుతుంది.. కాగా దోహాలోని పిఫా ఫ్యాన్ జోన్ లో కొన్ని ప్రైవేట్ ఫ్యాన్స్ జోన్స్, 35 హోటల్స్, రెస్టారెంట్ బార్స్ ఉన్నాయి. అయితే ప్రేక్షకుల కోరిక మేరకు నాన్ ఆల్కహాలిక్ బీర్లు మాత్రమే అందుబాటులో ఉంచుతామని ఖతార్ తెలిపింది. అయితే దీనిపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.