Life: మన జీవితం గమ్యం కాదు.. కేవలం గమనం మాత్రమేనని చాలా మంది చెబుతుంటారు. అందుకే జీవిత గమనంలో ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి కచ్చితంగా అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం కాగా గమనం అనేకం.. ఈ క్రమంలోనే ఓటమి చెందామని దిగులు చెందకుండా, నిరాశలో కూరుకుపోకూడదు. ఓటమిని సైతం స్ఫూర్తిగా తీసుకుని విజయం సాధించేంత వరకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. విజయాన్ని అందుకోవాలంటే ఎవరైనా మొదటి చేయాల్సింది ప్రయత్నమే. అందుకే అంటారు విజయం కన్నా దానికోసం చేసే ప్రయత్నమే గొప్పదని..
లక్ష్యసాధనలో ఎన్నిసార్లు పరాజయం పాలైనా సరే ప్రయత్నిస్తూనే ఉండాలి. దీని వలన విజయం సాధించడానికి ఏదో ఒక రోజు అవకాశం వచ్చి తీరుతుంది. అప్పుడు ఆ గెలుపుతో మనం ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. కానీ ఓడిపోయానని బాధతో, నిరాశతో ప్రయత్నాన్ని విరమిస్తే జీవచ్ఛవంగా మారాల్సి వస్తుంది. దాని వలన అథ: పాతాళానికి పడిపోతాం.
జీవితం అంటే ఆరంభం.. అందుకే పడిపోయినప్పుడు ఆగిపోకూడదని చెబుతుంటారు.. ఏదైనా కోల్పోయినప్పుడు బాధపడకూడదు.. మనం కావాలనుకున్న దాని కోసం నిరంతరం ప్రయత్నించాలి.. కష్టపడాలి.. అప్పుడే మనం అనుకున్న దాన్ని పొందగలం. అది ఉద్యోగమైనా, ఇంకేదైనా సరే. ఒక్క అవకాశం చేజారిపోయిందన్న, ఒకసారి ఓడిపోయామన్నా.. ఇంకా ముందుకు సాగడానికి అనేక దారులు ఉంటాయి. అదేవిధంగా గెలిచే అవకాశాలు ఉంటాయి.
మన నిర్ణయం మన చేతిలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో పరాజయం చెందామని నడకను ఆపేస్తావో.. లేక గెలుపు సాధించేంత వరకు అలుపు చెందక ప్రయత్నిస్తావో మనమే తేల్చుకోవాలి. అందుకే విజయానికి అవకాశాలు ఎన్ని ఉన్నాయో చూడటం మానేసి.. మన ప్రయత్నాన్ని కొనసాగిస్తుండాలి. చీకటిగా ఉందని నిందించడం మానేసి కొవ్వొత్తి వెలగించడం మంచిదని పెద్దలు చెప్పే ఓ మాట దీనికి నిదర్శనం. చిన్న విషయమైనా.. పెద్ద విషయమైనా సరే సానుకూల మార్పు ఏదైనా ప్రయత్నించడంలో తప్పు లేదు. అయితే విఫలం చెందామని ప్రయత్నాన్ని విరమించకూడదు. అలా ప్రయత్నించడాన్ని ఆపేయడమే మన జీవితంలో మనం చేసే అతి పెద్ద తప్పుగా మిగిలిపోతుందని చెప్పుకోవచ్చు..