Extramarital affairs: భర్త అంటే కుటుంబానికి రక్షణ.. భార్య కలకాలం నిలిచి ఉండే బంధం.. పిల్లలంటే మోయాలనిపించే బరువు.. దీనినే సంసారం అంటారు. ఇలాంటి సంసారాల వల్లే భారతదేశానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. వసుదైక కుటుంబం అనే సామెత పుట్టింది.. కానీ నేటి కాలంలో సంసారాలు సర్వనాశనం అవుతున్నాయి. వసుదైక కుటుంబం అనే సామెత అర్ధాన్ని కోల్పోతున్నది. గతంలో వివాహేతర సంబంధాలు.. వాటి పర్యవసనాల వల్ల చోటుచేసుకునే దారుణాలు ఎక్కడో ఒకచోట జరిగేవి. కానీ ఇటీవల కాలంలో ఇవి పరిపాటిగా మారిపోయాయి.
వివాహం జరిగిన నెల రోజులకే భర్తను అంతం చేసింది ఓ మహిళ.. వివాహం జరిగిన తర్వాత హనీమూన్ నిమిత్తం భర్తను తీసుకెళ్లి ప్రియుడి అండతో చంపించింది మరో మహిళ.. ఇక ఒక మహిళ అయితే తన ప్రియుడితో కలిసి ఉండటం కోసం ఏకంగా భర్తను కారుతో తొక్కించి తొక్కించి మరీ చంపించింది ఇంకొక మహిళ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇటీవల కాలంలో చోటు చేసుకున్న దారుణాలు చాలా ఉన్నాయి. ఈ సంఘటనలు మీడియా ద్వారా వెలుగులోకి వచ్చి.. ఈ ఘటనలకు పాల్పడిన వారు జైలు శిక్ష అనుభవిస్తున్నప్పటికీ.. ఇటువంటి నేరాలకు అడ్డుకట్ట పడటం లేదు. మనుషుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. పైగా మరింత పైశాచికంగా తయారవుతున్నారు. అత్యంత దారుణంగా నేరాలకు పాల్పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నేరాలకు పాల్పడుతూ రాక్షస ప్రవృత్తిని నిరూపించుకుంటున్నారు.
భర్త ప్రాణం కోసం సతీ సావిత్రి ఏకంగా యమకింకరుడితో పోరాటం చేసింది. మహిళలో కనికే ప్రత్యేకంగా నిలిచింది. అయితే అటువంటి చరిత్ర ఉన్న మహిళలలో కొంతమంది దారి తప్పుతున్నారు. అడ్డగోలుగా ప్రవర్తిస్తూ చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. వివాహేతర సంబంధాల వల్ల వారు పరువు తీసుకోవడమే కాదు.. కట్టుకున్న భర్తలను చంపుతున్నారు. మేఘాలయలో ఇండోర్ కు చెందిన వ్యక్తి ఇటీవల తన భార్య చేతిలో హతమయ్యాడు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దానిని మర్చిపోకముందే తెలుగు రాష్ట్రాలలో ఐశ్వర్య – తేజేశ్వర్ ఉదంతం మేఘాలయ ఘటనను మరిపించింది.. ఇవి రెండు అత్యంత దారుణాలు అనుకుంటుంటే.. అనంతపురం జిల్లాలో అంతకంటే దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. వీటిని మర్చిపోకముందే బీహార్ లోని ఔరంగాబాద్ లో మరో దారుణం జరిగింది. ఈ ఘటనల్లో భార్యల చేతిలో భర్తలు దారుణంగా హతమయ్యారు. ప్రియుల అండ చూసుకొని భార్యలు తమ భర్తలను హతమార్చడం విశేషం.
అయితే ఈ ఘటనలు జరగడానికి ప్రేమ రాహిత్యం ప్రధాన కారణమని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. ప్రేమరాహిత్యం వల్ల.. వివాహితలు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారని.. తమ బాధను చెప్పుకుంటూ.. ధైర్యాన్ని, సాంత్వన పొందుతున్నారు. ఇలాంటి సమయంలోనే ఎదుటి వ్యక్తులకు తన మనసులో చోటు కల్పిస్తున్నారు. ఇదే సమయంలో శారీరక సంబంధాలు కూడా పెట్టుకుంటున్నారు. ఈ శారీరక సంబంధాలు ఏర్పరచుకుంటున్న సమయంలోనే భర్తలకు తెలియడం.. అవి కాస్త పంచాయతీలకు దారి తీయడంతో పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. ఆ తర్వాత జరగకూడని దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంతటి దారుణాలకు పాల్పడినప్పటికీ నిందితులలో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించకపోవడం విశేషం. ఇటువంటి పరిణామాలు సమాజానికి కీడు చేస్తాయని మనస్తత్వ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.. ఇటువంటి దారుణాలు జరగకూడదనుకుంటే కచ్చితంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలని.. వ్యక్తిగత అహాలకు పోకుండా.. సర్దుకుపోయే మనస్తత్వాన్ని కలిగి ఉండాలని మనస్తత్వ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిగతంగా కోపాలకు, పంతాలకు వెళ్తే సంసారం మొత్తం సర్వనాశనం అవుతుందని వారు చెబుతున్నారు.