Child Success Habits: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు చదువులోనే కాదు, జీవితంలోని ప్రతి రంగంలో ముందుండాలని కోరుకుంటున్నారు. అయితే కేవలం మార్కులు ఎక్కువ రావడం లేదా పరీక్షల్లో టాప్ చేయడం మాత్రమే విజయానికి కొలమానం కాదు. చిన్న వయసు నుంచే కొన్ని మంచి అలవాట్లు, ఆలోచనా విధానాలు పిల్లల్లో పెంపొందిస్తే వారు భవిష్యత్తులో ఆత్మవిశ్వాసంతో, నాయకత్వ లక్షణాలతో, సమాజంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించే వ్యక్తులుగా ఎదుగుతారు. కొంత మంది మానసిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ ఐదు ముఖ్యమైన అలవాట్లు పిల్లల జీవితాన్నిపూర్తి మార్చేస్తాయి..
స్పష్టమైన లక్ష్యం:
పిల్లలకు చిన్న వయసు నుంచే లక్ష్యాల గురించి అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారు? ఏ విషయంలో ఆసక్తి ఉంది? వంటి విషయాలపై వారితో మాట్లాడాలి. లక్ష్యం ఉన్న పిల్లలు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. చదువు, ఆటలు, ఇతర కార్యకలాపాల్లో కూడా క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. లక్ష్యం వారిలో దిశను, పట్టుదలను పెంచుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారం:
పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. జంక్ ఫుడ్, అధిక చక్కెర ఉన్న పదార్థాల కంటే పండ్లు, కూరగాయలు, పాలు, గింజలు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని అందించాలి. మంచి ఆహారం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. ఆరోగ్యంగా ఉన్న పిల్లలు చదువులోనే కాకుండా ఇతర రంగాల్లో కూడా మెరుగైన ప్రతిభ కనబరుస్తారు.
మంచి స్నేహితులు:
పిల్లల వ్యక్తిత్వంపై స్నేహితుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మంచి అలవాట్లు ఉన్న పిల్లలతో స్నేహం చేస్తే వారిలో కూడా క్రమశిక్షణ, బాధ్యత, సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. అందుకే పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు? ఎలాంటి వాతావరణంలో ఉంటున్నారు? అనే విషయాలను తల్లిదండ్రులు గమనించాలి. మంచి స్నేహితులు జీవితంలో సరైన దిశలో నడిపించే మార్గదర్శకులుగా మారుతారు.
ఎక్కువ ప్రశ్నలు :
చాలా మంది పిల్లలు ఎందుకు? ఎలా? అనే ప్రశ్నలు అడుగుతుంటారు. కొందరు పెద్దలు దీనిని విసుగుగా భావించినా, వాస్తవానికి ఇదే వారి నేర్చుకునే ప్రక్రియలో కీలక భాగం. పిల్లలు ప్రశ్నలు అడిగినప్పుడు వారిని నిరుత్సాహపరచకుండా సమాధానాలు చెప్పాలి. ప్రశ్నించే అలవాటు వల్ల ఆలోచనా శక్తి పెరుగుతుంది. కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి పెంపొందుతుంది. భవిష్యత్తులో సమస్యలను విశ్లేషించి పరిష్కరించే సామర్థ్యం కూడా అభివృద్ధి చెందుతుంది.
మాట్లాడే నైపుణ్యం:
జీవితంలో విజయం సాధించడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. ఎంత ప్రతిభ ఉన్నా దాన్ని సరైన రీతిలో వ్యక్తపరచలేకపోతే అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. చిన్నప్పటి నుంచే పిల్లలను కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ఉపాధ్యాయులతో ధైర్యంగా మాట్లాడేలా ప్రోత్సహించాలి. కథలు చెప్పడం, వేదికలపై మాట్లాడించడం, చర్చల్లో పాల్గొనించడం వంటి కార్యకలాపాలు వారి కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి.
