
Naradishti : ప్రస్తుతం అందరు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఏం చేసిన కలిసి రావట్లేదని నిట్టూరుస్తున్నారు. అనారోగ్య సమస్యలు, వ్యాపారాల్లో కలిసి రాకపోవడం, కుటుంబ కలహాలు వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. వీటికి ప్రధాన కారణం ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీనే. దీన్నే నరదిష్టి అంటారు. నరుడి దిష్టికి నల్లరాళ్లే కరుగుతాయట. అంతటి తీవ్రత అందులో ఉంటుంది. నరదిష్టి మన మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మన ఇల్లు గుల్లవుతుంది. కష్టాలు మనల్ని వేధిస్తాయి. దీనికి కూడా కొన్ని చిట్కాలు ఉన్నాయి. క్షణాల్లో దూరం చేసుకునే అద్భుతమైన చిట్కా ఒకటి ఉంది పాటిస్తే ఇక నరదిష్టి మీకు ఉండనే ఉండదు.
మొదటగా మన ఇంటి గుమ్మం ముందు బూడిద గుమ్మడికాయ కట్టుకోవాలి. నరదిష్టి మన ఇంటి మీద పడకుండా ఇది కాపాడుతుంది. మూడు నెలలకోసారి దీన్ని మారుస్తుండాలి. అది కూడా బుధవారం రోజు అయితే శుభంగా ఉంటుంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వారు మళ్లీ లోపలికి వచ్చేటప్పుడు కాళ్లు కడుక్కుంటే మంచిది. లేదంటే దుమ్ము ధూళి కాళ్లతో పాటు ఇంట్లోకి ప్రవేశించి చెడు ఫలితాలు వచ్చేందుకు కారణమవుతుంది. అందుకే బయటకు వెళ్లిన వారు కచ్చితంగా కాళ్లు కడుక్కుని లోపలికి రావడం మంచిది.
ఇంకా నరదిష్టి పోవడానికి ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు, పసుపు, తెల్ల ఆవాలు తీసుకోవాలి. తెల్ల ఆవాలు దొరకకపోతే నల్లవి తీసుకున్నా ఫర్వాలేదు. గిన్నెలో వీటిని వేసుకుని చేత్తో పట్టుకుని నరదిష్టి తొలగిపోవాలని మనసులో అనుకుంటూ ఇల్లంతా ప్రతి మూల తిరగాలి. తరువాత వీటిని ఓ మూలలో ఉంచాలి. తెల్లవారి ఇంటి ప్రధాన ద్వారం తీయకుండా ఇంటి వెనుక ద్వారాన్ని తీయాలి. ఇలా చేయడం వల్ల నరదిష్టి వెళ్లిపోతుంది. తరువాత ప్రధాన ద్వారం తీయాలి. దీంతో లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది.
ఇంట్లో ఉంచిన ఆవాలను ప్రవహించే నీటిలో వేయాలి. ప్రవహించే నీరు అందుబాటులో లేని వారు ఇంటి బయట ఉన్న సింక్ లో వేయాలి. లోపలి సింక్ లో వేయకూడదు. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ కలహాలు లేకుండా పోతాయి. వ్యాపారంలో మంచి వృద్ధి జరుగుతుంది. ఇలా ఈ చిట్కాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయి. ఇంతటి సులభమైన చిట్కా అందరు పాటించి నరదిష్టిని దూరం చేసుకోవడం మంచిది.