Anemia: ఇటీవల కాలంలో రక్తహీనత ప్రధాన సమస్యగా మారుతోంది. ముఖ్యంగా మహిళల్లో రక్తం తక్కువగా ఉండటం కామనే. దీంతో అనేక అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. రక్తహీనతతో బాధపడేవారికి ఆకలి మందగించడం, నిద్ర లేకపోవడం, మలబద్ధకం, వాంతి వచ్చినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతో వారు అప్రమత్తం కావాల్సి ఉంటుంది. వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకుని రక్తహీనత సమస్య నుంచి దూరం కావాల్సిన అవసరం ఉంటుంది. రక్త హీనతను అశ్రద్ధ చేస్తే అనర్థాలే వస్తాయి. దీంతో భవిష్యత్ లో ఇబ్బందులు రావడం జరుగుతుంది. రక్తహీనత ఉన్నట్లయితే తగిన మందులు వాడుకుని దాన్ని దూరం చేసుకోవాలి.

అసలు మనిషికి ఎంత మేర రక్తం ఉండాలి. హిమోగ్లోబిన్ శాతంపై రకరకాల లెక్కలు అందుబాటులో ఉన్నాయి. మగవారిలో హిమోగ్లోబిన్ శాతం 13 గ్రాములు ఉండాలి. మహిళల్లో 12 గ్రాములుండాలి. చిన్న పిల్లలకు 11 గ్రాములుండాలి. గర్భిణులు, బాలింతలకు 12 గ్రాములుండాలి. అంతకన్నా తగ్గితే రక్తహీనత ఉందని అర్థం చేసుకోవాలి. డాక్టర్ ను సంప్రదించి తగిన మందులు తీసుకుని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. రక్త హీనతను తగ్గించుకోవడానాకి సరైన ఆహారాలు తీసుకుంటే కూడా సరిపోతుంది.
రక్తహీనతతో బాధపడేవారు ఖర్జూరాలు ఎక్కువ తీసుకోవాలి. నువ్వుల్లో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందుకే రోజు భోజనం చేశాక ఓ నువ్వుల ఉండ తినడంతో మేలు కలుగుతుంది. రోజుకు ఓ టీ స్పూన్ నువ్వులు తినేలా చర్యలు తీసుకోవాలి. ఇందులో ఉండే ఐరన్ తో రక్తం పెరుగుతుంది. ఫలితంగా మనకు రక్తహీనత దూరమవుతుంది. ఇంకా బీట్ రూట్ కూడా మనకు రక్తం బాగా పట్టే ఆహారాల్లో ఒకటి కావడం గమనార్హం. అందుకే రోజువారీ ఆహారంలో వీటిని తీసుకుంటే మనకు రక్తహీనత సమస్య రాదని తెలుసుకోవాలి.

శరీరంలో రక్తం మోతాదు పెంచే ఆహారాల్లో ఆపిల్ ఒకటి. రోజుకో ఆపిల్ తింటే ప్రయోజనమే. దానిమ్మ కూడా హెమోగ్లోబిన్ పెంచుతుది. దీన్ని రోజు తింటే రక్తం బాగా పట్టడానికి కారణమవుతుంది. పప్పులు, శనగలు, అలసందలు, ఉలవలు, సోయాబీన్స్, చిక్కడు తదితర తృణ ధాన్యాలు కూడా మనకు హెమోగ్లోబిన్ పెంచేందుకు దోహదపడతాయి. రక్తహీనత నుంచి బయట పడటానికి తోటకూర, పాలకూర, గోంగూర వంటి ఆకుకూరలతో కూడా మనకు ఎంతో మేలు కలుగుతుంది. ఇలా సమృద్ధిగా దొరికే వాటితో రక్తహీనతను దూరం చేసుకుని ఆరోగ్యవంతంగా జీవించాల్సిన అవసరం ఎంతో ఉంది.